ఏపీ గురుకులాల్లో ఖాళీగా ఉన్న 1,010 పోస్టులను వెంటనే భర్తీ చేయండి: సీఎం జగన్‌

|

Nov 20, 2022 | 12:31 PM

ఆంధ్రప్రదేశ్‌ గురుకుల పాఠశాలలు, వసతి గృహాల్లో ఖాళీగా ఉన్న 1,010 ఖాళీల భర్తీకి వెంటనే చర్యలు చేపట్టవల్సిందిగా ముఖ్యమంత్రి జగన్‌ అధికారులను ఆదేశించారు. వసతి గృహాల్లో ఖాళీగా..

ఏపీ గురుకులాల్లో ఖాళీగా ఉన్న 1,010 పోస్టులను వెంటనే భర్తీ చేయండి: సీఎం జగన్‌
AP CM Jagan review meeting on Gurukula schools
Follow us on

ఆంధ్రప్రదేశ్‌ గురుకుల పాఠశాలలు, వసతి గృహాల్లో ఖాళీగా ఉన్న 1,010 ఖాళీల భర్తీకి వెంటనే చర్యలు చేపట్టవల్సిందిగా ముఖ్యమంత్రి జగన్‌ అధికారులను ఆదేశించారు. వసతి గృహాల్లో ఖాళీగా ఉన్న 759 సంక్షేమాధికారి పోస్టులు, 80 కేర్‌టేకర్‌ పోస్టులు, గిరిజన గురుకులాల్లో 171 మంది వసతిగృహ అధికారులను నియమించాలన్నారు. పోస్టు మెట్రిక్‌ వసతి గృహాల్లో నాలుగో తరగతి ఉద్యోగుల నియామకంపైనా దృష్టి పెట్టాలన్నారు. నవంబర్‌ 18న గురుకులాలు, వసతి గృహాలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో నాడు-నేడు పనులపై జరిగిన సమీక్ష సమావేశంలో సీఎం జగన్‌ ఈ మేరకు తెలిపారు.

ఇంకా ఏమన్నారంటే.. ‘గురుకుల పాఠశాలలు, వసతి గృహాల్లో మూడుదశల్లో నాడు-నేడు కార్యక్రమం నిర్వహించాలి. తొలి విడత పనులు వచ్చే జనవరి నుంచి ప్రారంభించి, ఏడాదిలోగా పూర్తి చేయాలి. గురుకుల పాఠశాలలు, వసతి గృహాలన్నీ కలిపి 3,013 చోట్ల పనులు చేపట్టాల్సి ఉంటుంది. మొదటిదశలో 1,366 చోట్ల చేపట్టాలి. కర్నూలు పశ్చిమ ప్రాంతంలోని వసతి గృహాలను మొదటి విడతలోనే బాగు చేయించాలి. వసతి గృహాల్లో మౌలిక సదుపాయాల కల్పనతోపాటు వంటగదులను ఆధునీకరించాలి. వాటికి అవసరమైన 10 రకాల వస్తువులను కొనాలి. నాడు-నేడు ద్వారా గణనీయమైన మార్పు కనిపించాలి. చదువులు ‘కొన’లేని వారు తమ పిల్లల్ని హాస్టళ్లకు పంపిస్తారు. వారు బాగా చదువుకోడానికి, ఎదగడానికి గురుకులాలు వేదిక కావాలి. అలాగే అంగన్‌వాడీ కేంద్రాల్లో నాడు-నేడు పనులు, అనంతర నిర్వహణపై కార్యాచరణ ఉండాలి. అక్కడ మరుగుదొడ్ల నిర్వహణ, పరిశుభ్రతకు పెద్దపీట వేయాలి. సమస్యలుంటే ఫిర్యాదుల కోసం కేంద్రాల్లో ప్రత్యేక నంబరు పెట్టాలని’ సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. ఈ పనులు పూర్తి చేయడానికి మొత్తంగా రూ.3,364 కోట్ల వరకు అవుతుందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.