AP SSC Exams 2025: టెన్త్ విద్యార్ధులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.. రవాణాశాఖ మంత్రి ప్రకటన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం (మార్చి 17) నుంచి ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. మొత్తం 6 లక్షలకుపైగా విద్యార్ధులు ఈ పరీక్షలు రాయనున్నారు. పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు హాల్‌టికెట్ చూపిస్తే ఆర్టీసీ బస్సులో ఉచితంగా పరీక్షకు వెళ్లే సదుపాయం రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది..

అమరావతి, మార్చి 16: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థులకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులందరికీ ప్రభుత్వం ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణ సదుపాయం కల్పించింది. ఈ మేరకు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఎలాంటి ఆలస్యం లేకుండా విద్యార్ధులు సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు అనుగుణంగా ఉచిత ప్రయాణ సదుపాయం ఏర్పాటు చేసినట్టు ఆయన వెల్లడించారు. పరీక్ష సమయానికి ముందుగానే ఆయా పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు చేరుకోవాలని, విద్యార్థులందరూ విజయవంతంగా పదో తరగతి పరీక్షలు రాయాలని మంత్రి మండిపల్లి ఆకాంక్షించారు. విద్యార్ధులు తల్లితండ్రుల ఆశలు నెరవేర్చే దిశగా అడుగులు వేయాలని, పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆయన తెలిపారు.
కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం (మార్చి 17) నుంచి ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. మొత్తం 6 లక్షలకుపైగా విద్యార్ధులు ఈ పరీక్షలు రాయనున్నారు. ఇంగ్లిష్ మీడియంలో 5,64,064 మంది, తెలుగు మీడియంలో 51,069 మంది వరకు పరీక్షలు రాస్తారు. మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వరకు పదో తరగతి పరీక్షలు కొనసాగనున్నాయి.
ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఫిజికల్ సైన్స్, బయలాజీకల్ సైన్స్ పేపర్లకు మాత్రం ఒక్కోరోజు ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు హాల్‌టికెట్ చూపిస్తే ఆర్టీసీ బస్సులో ఉచితంగా పరీక్షకు వెళ్లే సదుపాయం రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.