ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం (2023-24) నుంచి 1 నుంచి 7 తరగతులకు సీబీఎస్‌ఈ సిలబస్ పాఠ్య పుస్తకాలు తీసుకురావాలని ఏపీ పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ప్రస్తుతం ఎనిమిదో తరగతిలో ఈ విధానాన్ని అమలు చేస్తుండగా, ఇకపై అన్ని తరగతులకు సీబీఎస్‌ఈ పుస్తకాలనే అందించాలని విద్యాశాఖ భావిస్తోంది. ఈ మేరకు గురువారం (డిసెంబరు 15) నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయించారు. 1 నుంచి 7 తరగతులకు మ్యాథమ్యాటిక్స్, ఇంగ్లిష్ టెక్స్ట్ బుక్స్, 6, 7 తరగతులకు జనరల్ సైన్స్ సబ్జెక్టులకు సంబంధించి సీబీఎస్సీ సిలబస్‌తో కూడిన కొత్త పాఠ్యపుస్తకాలు ఇస్తారు. సోషల్ సైన్సెస్ మాత్రం రాష్ట్ర (ఏపీ చరిత్ర) సిలబస్ ఉంటుంది. సీబీఎస్ సిలబస్‌లో దేశ చరిత్ర మాత్రమే ఉంటుంది. అందువల్లనే సోషల్ సబ్జెక్టును మినహాయించి మిగతా వాటికి సీబీఎస్‌ఈ సిలబస్‌తో పాఠ్యపుస్తకాలు ఇస్తారు.
సాధారణంగా ఎన్‌సీఈఆర్టీ పాఠ్య పుస్తకాలను సీబీఎస్‌ఈ అనుసరిస్తుంది. ఎనిమిదో తరగతి నుంచే సీబీఎస్‌ఈ ప్రత్యేకంగా పాఠ్యపుస్తకాలను రూపొందిస్తోంది. కింది తరగతులకు ఎన్‌సీఈఆర్టీ సూచించిన సిలబస్ ఆధారంగా పాఠ్య పుస్తకాలను అందిస్తారు. వచ్చే ఏడాది (2023) నుంచి తొమ్మిదో తరగతి విద్యార్ధులకు కూడా వీటినే అందిస్తారు. బోర్డు అనుమతి లేని పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు మాత్రం సీబీఎస్‌ఈ సిలబస్ చదివినా రాష్ట్ర బోర్డు పరీక్షలే రాయాల్సి ఉంటుంది. సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలు రాయాలంటే ఆయా విద్యాసంస్థలు బోర్డు అనుమతి తీసుకోవల్సి ఉంటుంది.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.