అమరావతి, డిసెంబర్ 7: ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సై ఉద్యోగాలకు సంబంధించిన తుది రాత పరీక్ష ఫలితాలు బుధవారం (డిసెంబర్ 6) పోలీసు నియామక మండలి విడుదల చేసింది. మొత్తం 411 పోస్టులకుగాను 18,637 మంది అర్హత సాధించినట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన ఫలితాలను పోలీసు నియామక మండలి అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. డిసెంబరు 8న తేదీ సాయంత్రం 5 గంటల వరకూ తుది రాతపరీక్షకు సంబంధించి పేపర్-3, పేపర్-4 సమాధాన పత్రాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని బోర్డు తెల్పింది. ఫలితాలకు సంబంధించి ఎలాంటి సందేహాలు తలెత్తినా వెంటనే 9441450639, 9100203323 ఫోన్ నెంబర్లు సంప్రదించాలని పోలీసు నియామక మండలి ఛైర్మన్ అతుల్‌సింగ్ ప్రకటన విడుదల చేశారు.
కాగా ఎస్సై ఉద్యోగాలకు మొత్తం 1,51,288 మంది ప్రిలిమినరీ రాత పరీక్ష రాయగా.. వారిలో 57,923 మంది అర్హత సాధించారు. వీరందరికీ దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. ఫలితాలంలొ 31,193 మంది మెయిన్స్ రాతపరీక్షకు ఎంపికయ్యారు. తుది రాత పరీక్షలో మొత్తం 18,637 మంది అర్హత సాధించారు. వీరిలో మెరిట్ జాబితా రూపొందించి రోస్టర్ ప్రకారం మెరిట్‌లో నిలిచిన 411 మందిని పోస్టులకు ఎంపిక చేయనున్నారు. స్థానికత, రిజర్వేషన్ తదితర ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ధవళేశ్వరం కొత్తవీధికి చెందిన అంబటి కీర్తినాయుడు అనే యువతి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నోటిఫికేషన్లలో ఏకంగా ఏడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది. తాజాగా సెంట్రల్ బోర్డు ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సస్‌లో జీఎస్టీ ఇన్‌స్పెక్టర్‌గా కొలువు వచ్చినట్లు కీర్తినాయుడు తండ్రి అడ్వకేట్ అంబటి మురళీకృష్ణ బుధవారం (డిసెంబర్ 6) మీడియాకు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ)లో 2019లో ఆదాయపు పన్ను శాఖలో ఉన్నతాధికారి ఉద్యోగం సాధించింది. అనంతరం కస్టమ్స్ విభాగంలో ట్యాక్స్ అసిస్టెంట్‌గా ఉద్యోగం సాధించారు. గతేడాది మార్చిలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఇంటర్‌బేస్డ్ ఉద్యోగాల్లో భాగంగా ఎంటీఎస్ ఉద్యోగం సాధించారు. ఆ తర్వాత భారత రైల్వేలో ఉన్నతాధికారిగా, పోస్టల్ విజిలెన్సు విభాగంలో మరో ఉద్యోగం సాధించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన గ్రామ కార్యదర్శి పోస్టుకు సైతం కీర్తి నాయుడు ఎంపికయ్యారు. 2019లో డిగ్రీ పూర్తయిన వెంటనే కీర్తి నాయుడుకి ఆరు కంపెనీల్లో సాఫ్ట్‌వేర్ కొలువులు ఆఫర్ వచ్చింది. ఎప్పటికైనా సివిల్స్ సాధనే తన లక్ష్యమని మీడియాకు తెలిపారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.