అమరావతి, నవంబర్ 13: ఏపీపీఎస్సీ-కంప్యూటర్ ప్రొఫిషయన్సీ టెస్ట్ (సీపీటీ) పరీక్షలు రేపట్నుంచి జరగనున్నాయి. ఈ మేరకు నవంబరు 14, 15 తేదీల్లో ఆరు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ వెల్లడించింది. పరీక్షల నిర్వహణకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్టీఆర్ (కలెక్టరేట్) జిల్లా రెవెన్యూ శాఖ అధికారి ఎస్.వి.నాగేశ్వరరావు తెలిపారు. పరీక్షల ఏర్పాట్లపై కలెక్టరేట్‌లోని ఛాంబరులో నవంబరు 10న సమావేశం నిర్వహించారు. విజయవాడ గవర్నర్‌పేట రామమందిరం రోడ్డులోని ఎస్‌వీటీ ఇన్ఫోటెక్ పరీక్షా కేంద్రంలో మొత్తం 604 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యేందుకు ఏర్పాట్లు చేయాలని ఈ సమవేశంలో డీఆర్వో అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో 5వ శ్రేణి పంచాయతీ కార్యదర్శులు, రెవెన్యూ శాఖ పరిధిలో ఒకటో, రెండో శ్రేణి వీఆర్వోలు, 2014 మే 12 తర్వాత అన్ని హెచ్‌వోడీలు, డైరెక్టరేట్లు, ఏపీ సచివాలయంలో కారుణ్య నియామకాల కింద చేరినవారు ఈ పరీక్ష రాయనున్నట్టు ఆయన వివరించారు.
తెలంగాణ రాష్ట్రంలో 2023-24 విద్యా సంవత్సరం నుంచి పదో తరగతి హాల్‌టికెట్లతోపాటు మార్కుల మెమోలపై పర్మినెంట్ ఎడ్యుకేషన్ నంబరు-పెన్‌ను ముద్రించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. పూర్వ ప్రాథమిక తరగతి నుంచి ఇంటర్ వరకు ప్రవేశ రిజిస్టర్, హాజరు రిజిస్టర్, రికార్డ్ షీట్/టీసీ తదితర వాటిపై ఈ శాశ్వత విద్యా సంఖ్యను రాయడం, ముద్రించడం తప్పని సరి చేశారు. దీనిని ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తున్నారు. అందువల్ల ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కాలేజీల యాజమాన్యాలు దీని గురించి తెలుసుకొవాలని విద్యాశాఖ సూచించింది.
అందుకే ప్రతి విద్యార్థి పేరు జిల్లా పాఠశాల విద్యా సమాచారం (యూడైస్ ఫ్లస్) పోర్టల్‌లో నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం పేర్కొంది. అందుకు సంబంధించిన వివరాలను అప్‌డేట్ చేయాలని పాఠశాల విద్యాశాఖను విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ అధికారులను ఆదేశించారు. అందువల్లనే యూడైస్‌లో ప్రతి ఒక్కరినీ నమోదు చేయాలని, అందులో ఉన్న వారికి మాత్రమే సాఫ్ట్‌వేర్ ద్వారా శాశ్వత సంఖ్య కేటాయిస్తారని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.