అమరావతి, జులై 27: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 2వ తేదీన టెట్ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 3వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ క్రమంలో మైనారిటీ విద్యార్థులకు ఏపీ టెట్-2024 పరీక్షకు సంబంధించి ఉర్దూ, తెలుగు మీడియంలలో ఉచిత కోచింగ్ ఇచ్చేందుకు మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ ప్రకటన వెలువరించారు. ముస్లిం, క్రిస్టియన్ (బీసీ-సీ), సిక్కులు, బుద్ధులు, జైనులు వంటి తదితర మైనారిటీ వర్గాలకు చెందిన అభ్యర్ధులకు ఉచిత కోచింగ్ అందిస్తామని శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల వారీగా మొత్తం 19 శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. మైనారిటీ సంక్షేమశాఖ, ఏపీ ప్రభుత్వ సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (సీఈడీఎం) ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ప్రోగ్రామ్ జరగనుంది. ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 25వ తేదీ వరకు ఇచిత శిక్షణ అందిస్తారు.
కాగా ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) పరీక్షలు ఏకంగా అక్టోబర్ 3 నుంచి 20వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో నిర్వహించనున్నారు. 16,347 టీచర్ పోస్టుల భర్తీకి వెలువడిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్ నేపథ్యంలో ఏపీ సర్కార్ మరోసారి టెట్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. డీఎస్సీలో టెట్‌కు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. టెట్ ఆన్‌లైన్ మాక్‌టెస్ట్‌లు సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభమవుతాయి. హాల్‌టికెట్లను జులై 22 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రొవిజినల్ కీ అక్టోబర్ 4 విడుదల చేసి, అక్టోబర్ 5 నుంచి ప్రాథమిక కీపై అభ్యంతరాలను స్వీకరించనున్నారు. అక్టోబర్ 27న ఫైనల్ ఆన్సర్ కీ విడుదలవుతుంది. టెట్ ఫలితాలు నవంబర్ 2న విడుదల చేస్తారు.