DSC Free Coaching: గురుకులాల్లో ఉచితంగా డీఎస్సీ శిక్షణ ఇచ్చే సంస్థల కోసం దరఖాస్తుల ఆహ్వానం.. చివరి తేదీ ఇదే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి త్వరలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వెలువరించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సాంఘిక, గిరిజన సంక్షేమశాఖల ఆధ్వర్యంలో డీఎస్సీ ఉచిత శిక్షణ ఇవ్వనుంది. మొత్తం 5,050 మంది ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు డీఎస్సీ..
అమరావతి, అక్టోబర్ 9: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి త్వరలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వెలువరించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సాంఘిక, గిరిజన సంక్షేమశాఖల ఆధ్వర్యంలో డీఎస్సీ ఉచిత శిక్షణ ఇవ్వనుంది. మొత్తం 5,050 మంది ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు డీఎస్సీ ఉచిత శిక్షణ ఇచ్చేందుకుగాను ప్రభుత్వం ఆసక్తిగల సంస్థల నుంచి దరఖాస్తులను కోరుతూ ప్రకటన వెలువరించింది. ఈ దరఖాస్తు చేసుకునే సంస్థలు కనీసం రెండు డీఎస్సీ నోటిఫికేషన్‌లకు కోచింగ్ ఇచ్చి ఉండాలని ప్రకటనలో పేర్కొంది. కనీసం ఆ సంస్థ నుంచి 100 మంది ఉపాధ్యాయులుగా ఉద్యోగాలు సాధించి ఉండాలని స్పష్టంగా తెలియజేసింది. అలాగే మూడు సంవత్సరాల టర్నోవర్ కనీసం రూ.40 లక్షలుగా ఉండాలని తెలిపింది. ఆసక్తి కలిగిన సంస్థలు అక్టోబర్ 21వ తేదీ లోపు ఏపీ ఈ-ప్రొక్యూర్‌మెంట్ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఇక ఇప్పటికే పలు సంస్థలు ఏపీలో డీఎస్సీ అశావహ అభ్యర్ధులకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. శిక్షణా కాలంలో వసతి, భోజనం, మెటీరియల్‌ను ఉచితంగా అందించనున్నాయి.
ఇంటర్మీడియట్ విద్యార్థులకు 75 శాతం హాజరు తప్పనిసరి: ఇంటర్ బోర్డు కార్యదర్శి కృతికాశుక్లా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జూనియర్ కాలేజీల్లో చదువుతున్న ఇంటర్మీడియట్ విద్యార్థుల హాజరుపై స్పష్టతనిస్తూ ఇంటర్ బోర్డు కార్యదర్శి కృతికాశుక్లా అక్టోబరు 7న ఉత్తర్వులు జారీ చేశారు. మొదటి, రెండో ఏడాది చదివే రెగ్యులర్ విద్యార్థులకు తప్పనిసరిగా 75 శాతం హాజరు ఉండాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. 75 శాతం కంటే తక్కువ ఉంటే అపరాధ రుసుము చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఉత్తర్వుల్లో స్పష్టంగా వివరించారు. 60 నుంచి 65 శాతం హాజరు ఉంటే రూ.2వేలు, 65 నుంచి 70 శాతం హాజరు ఉంటే రూ.1500, 70 నుంచి 75 శాతం హాజరు ఉంటే రూ.1000 అపరాధ రుసుము చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. 60 శాతం కంటే తక్కువ హాజరు ఉంటే.. సైన్సు విద్యార్థులు పబ్లిక్ పరీక్షలు రాయడానికి అనర్హులుగా తేల్చారు. ఆర్ట్స్ విద్యార్థుల్ని ప్రైవేట్ క్యాండిడేచర్ కింద పరిగణనలోకి తీసుకుని పరీక్షలకు అనుమతిస్తామని తెలిపారు. అలాగే ఒకేషన్ విద్యార్థులకు కూడా ఈ షరతులు వర్తిస్తాయని సూచించారు.