Inspiration Story: ఏకంగా 50 సార్లు విఫలం.. పట్టువదలక పోరాడి సర్కార్‌ కొలువు కైవసం! ఓ పేదింటి బిడ్డ బతుకు కథ

'పట్టు పట్టరాదు.. పట్టి విడువ రాదు' అని వేమన హితబోధ చేశాడు. కార్యమునకు ముందు పట్టుదల చేయరాదు. పట్టుదల పట్టిన తర్వాత కార్యాన్ని వదలరాదు. పట్టుదల పట్టి విడుచుట కన్నా చచ్చుట మంచిదని నాడు వేమన అంటే.. దాన్ని అక్షరాలా అనుసరించి చూపాడు దోసకాయలపల్లికి చెందిన అశోక్‌. సర్కారు కొలువు సాధించాలనే తన కలను ఎన్ని అడ్డంకులు ఎదురైనా వదల లేదు. పట్టుదలతో తన కలను నెరవేర్చుకున్నాడు..

Inspiration Story: ఏకంగా 50 సార్లు విఫలం.. పట్టువదలక పోరాడి సర్కార్‌ కొలువు కైవసం! ఓ పేదింటి బిడ్డ బతుకు కథ
Police Constable Andiboyina Ashok

Updated on: Dec 19, 2025 | 10:35 AM

కోరుకొండ, డిసెంబర్‌ 19: ‘పట్టు పట్టరాదు.. పట్టి విడువ రాదు’ అని వేమన హితబోధ చేశాడు. కార్యమునకు ముందు పట్టుదల చేయరాదు. పట్టుదల పట్టిన తర్వాత కార్యాన్ని వదలరాదు. పట్టుదల పట్టి విడుచుట కన్నా చచ్చుట మంచిదని నాడు వేమన అంటే.. దాన్ని అక్షరాలా అనుసరించి చూపాడు దోసకాయలపల్లికి చెందిన అశోక్‌. సర్కారు కొలువు సాధించాలనే తన కలను ఎన్ని అడ్డంకులు ఎదురైనా వదల లేదు. పట్టుదలతో తన కలను నెరవేర్చుకున్నాడు. అయితే తన ప్రయత్నంలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 50 సార్లు విఫలమయ్యాడు. సాధారణంగా ఇన్ని సార్లు విఫలమైతే ఎవరికైనా నిస్సహాయట ఆవరిస్తుంది. నాలుగైదు సార్లు ప్రయత్నం చేస్తారు. మహా అయితే 10 లేదా 15సార్లు ప్రయత్నిస్తారు.

ఆ తర్వాత నిరాశకు గురై లేదా కుటుంబ పరిస్థితుల కారణంగా ప్రయత్నం ఆపేస్తారు. కానీ అశోక్‌ తన పట్టుదలను విడువలేదు. సర్కార్‌ కొలువుకొట్టాలి.. అమ్మనాన్నలను బాగా చూసుకోవాలనే తన ఆశయం కోసం కష్టించి చదివి తన కలను నెరవేర్చుకున్నాడు. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం దోసకాయలపల్లికి చెందిన అండిబోయిన అశోక్‌ గురించే మనం చర్చిస్తుంది. ఏడేళ్లు నిర్విరామంగా శ్రమించి 50కు పైగా ప్రయత్నాల తర్వాత ఇటీవల జరిగిన కానిస్టేబుల్‌ నియామకాల్లో ఎంపికయ్యాడు. అశోక్‌ ప్రయాణం అతడి మాటల్లోనే తెలుసుకుందాం..

నాన్న విష్ణు టైలర్‌. అమ్మ ఆదిలక్ష్మి గృహిణి. మా కుంటుంబం ఆర్థికంగా అంతంత మాత్రమే. బీఎస్సీ కంప్యూటర్స్‌ చదివాను. డిగ్రీ తర్వాత ఏదో ఒక ప్రైవేటు ఉద్యోగం చేద్దామనే అందరిలా అకున్నాను. కానీ అది అప్పటి అవసరాలు తీర్చినా భవిష్యత్తుకు భరోసా ఉండదు. అదే ప్రభుత్వ ఉద్యోగమైతే తమ పరిస్థితి మారుతుంది. నా తల్లిదండ్రులకే కాదు రేపటి నా పిల్లలకు కూడా మంచి భవిష్యత్తు ఇవ్వగలను. ఈ ఆలోచనతోనే 21వ ఏట నుంచే పోటీ పరీక్షలకు సిద్ధమయ్యాను. ఆర్‌ఆర్‌బీ, బ్యాంక్స్, ఎస్‌ఎస్‌సీ, ఏపీపీఎస్సీ ఇలా ఏ నోటిఫికేషన్‌ వచ్చినా పరీక్షలు రాస్తూనే ఉన్నాను. పరీక్ష ఫీజులు, పుస్తకాలు, ఆన్‌లైన్‌ మాక్‌ పరీక్షలు ఇలా చాలా డబ్బు ఖర్చు అయ్యేది.

ఇవి కూడా చదవండి

నాతో పాటు దీపక్‌ అనే నా స్నేహితుడు కూడా ప్రిపేర్‌ అయ్యేవాడు. అయితే నా స్నేహితుడు దీపక్‌కు 2022లో బ్యాంకు ఉద్యోగం వచ్చింది. అప్పటికే నేను చాలా రాశాను. కానీ ఏ ఒక్కదానిలో సెలక్ట్ కాలేదు. ఓ సారి రైల్వేలో స్టేషన్‌మాస్టర్‌ ఉద్యోగం కేవలం 3 మార్కుల తేడాలో చేజారింది. ఇదేకాదు ఆరు ఉద్యోగాలు 2 నుంచి 5 మార్కుల తేడాతో దక్కలేదు. ఆ సమయంలో తీవ్ర నిరాశ ఆవరించేది. నా వల్ల కాదు అనిపించేది. కానీ అమ్మనాన్నలు ఎంతో ప్రోత్సహించేవారు. దీపక్‌ ఆర్థికంగా అండగా నిలవడంతో నా ప్రయత్నాన్ని కొనసాగించాను. ఇన్నాళ్లకు కానిస్టేబుల్‌గా ఉద్యోగం రావడంతో నా కల నెరవేరింది. నా కష్టం ఫలించి ప్రభుత్వ ఉద్యోగాన్ని అందుకోవడం సంతోషంగా ఉందని అశోక్‌ అనందం వ్యక్తం చేశారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.