
అమరావతి, డిసెంబర్ 20: ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్ 2025) రాత పరీక్షలు కొనసాగుతున్నాయి. డిసెంబరు 10వ తేదీ నుంచి మొదలైన ఈ పరీక్షలు రోజుకు రెండు సెషన్ల చొప్పున ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి 12గంటలు మొదటి సెషన్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతున్నాయి.ఇక డిసెంబర్ 21వ తేదీతో టెట్ పరీక్షలు ముగియనున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ ఏపీ టెట్-2025 (AP TET) పరీక్షలకు సంబంధించి ప్రాథమిక కీలను విడుదల చేసింది. ఈ మేరకు సంబంధిత సబ్జెక్టుల ఆన్సర్ కీలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. పరీక్షలకు హాజరైన అభ్యర్థులు tet2dsc.apcfss.in లేదా aptet.apcfss.in వెబ్‌సైట్‌ల ద్వారా కీ ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఏపీ టెట్ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి ఓ ప్రటకనలో తెలిపారు. తాజా ఆన్సర్ కీలపై డిసెంబర్ 24 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు తెలిపారు.
ఈ సారి టెట్‌కు మొత్తం 2,41,509 మంది అభ్యర్థులు 2,71,692 దరఖాస్తులు సమర్పించిన సంగతి తెలిసిందే. వీరంతా పోటాపోటీగా టెట్ పరీక్షలు రాస్తున్నారు. టెట్ రాత పరీక్షల అనంతరం షెడ్యూల్ ప్రకారం ప్రాథమిక కీ 2026 జనవరి 2 నాటికి అన్ని ఆన్సర్ కీలను విడుదల చేస్తారు. ఇక ఫైనల్ కీ జనవరి 13న వెల్లడించి, తుది ఫలితాలు జనవరి 19న విడుదల చేయనున్నారు. ఇక వచ్చే ఏడాది డీఎస్సీ నోటిఫికేషన్ జారీచేస్తామని ఇప్పటికే కూటమి ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది 16వేలకు పైగా పోస్టులు భర్తీచేసింది. అయితే ఇందులో మిగిలిన పోస్టులతోపాటు కొత్తగా ఏర్పడే ఖాళీలతో 2 వేల పోస్టులతో కొత్త డీఎస్సీ ఉంటుందని సమాచారం. ఈ నేపథ్యంలో టెట్‌కు మరోమారు నిరుద్యోగులు తమ వెయిటేజీ మార్కులు పెంచుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారు.
ఏపీ టెట్-2025 ఆన్సర్ కీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.