
అమరావతి, ఆగస్ట్ 15: మెగా డీఎస్సీ 2025 ఫలితాలు ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. అయితే డీఎస్సీ ఫలితాల్లో టెట్ మార్కుల వెయిటేజీ విషయంలో గందరగోళం నెలకొంది. పేపర్ 2 పరీక్ష రాసిన అనేక మంది బీఎడ్ అభ్యర్ధులు మూడు, నాలుగు పేపర్లు పరీక్షలు రాశారు. వీటికి టెట్ మార్కులు కూడా దరఖాస్తు సమయంలోనే పేపర్ వైజ్ సమర్పించారు. అయితే గతంలో టెట్ పరీక్షల్లో ఎన్ని పేపర్లకు పరీక్షలు రాసినా ఒకటే హాల్ టికెట్ నెంబర్ ఇచ్చారు. దీంతో వీరు రాసిన పేపర్లన్నింటికీ ఒకే హాల్ టికెట్‌తో టెట్ వెయిటేజీ మార్కులను డీఎస్సీలో కలిపారు.
ఉదాహరణకు.. 2024లో ఏపీలో రెండు సార్లు టెట్ పరీక్షలు జరిగాయి. ఇందులో తొలి దశ ఫిబ్రవరిలో జరిగిన టెట్ పరీక్షలో ఓ అభ్యర్ధి సోషల్ స్టడీస్, తెలుగు క్వాలిఫై అయ్యారు. కానీ హాల్ టికెట్ మాత్రం ఒకటే ఉంది. దీంతో ఆ అభ్యర్ధి డీఎస్సీ దరఖాస్తు సమయంలో రెండు పేపర్లకు ఇదే హాల్ టికెట్ నంబర్‌ను రెండు పేపర్లకు ఇచ్చి, టెట్ మార్కులను ఏ సబ్జెక్టుకు ఆ సబ్జెక్ట్ వేర్వేరుగా ఎంటర్ చేశారు. అయితే తాజాగా వెలువడని డీఎస్సీ ఫలితాల్లో టెట్‌లో రాసిన ఈ రెండు పేపర్లలో ఎక్కువ మార్కులు వచ్చిన సబ్జెక్ట్ వెయిటేజీనే డీఎస్సీ 4 పరీక్షలకు కలిపేశారు. దీంతో ఈ మార్కులు ఎలా మార్చుకోవాలో తెలియక ఆ అభ్యర్ధి తికమక పడుతున్నాడు. డీఎస్సీ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి మాత్రం టెట్ మార్కుల సవరణకు అవకాశం ఇచ్చినప్పటికీ.. డీఎస్సీ వెబ్‌సైట్‌లో ఇందుకు అవకాశం లేకుండా పోయింది. దీంతో అభ్యర్దులు ఆందోళన చెందుతున్నారు. ఏ మాత్రం అటుఇటైన చేతిదాకా వచ్చిన ఉద్యోగం చేజారే అవకాశం ఉందంటూ వాపోతున్నారు. ఒకే ఏడాదిలో రెండు టెట్ పేపర్లు క్వాలిఫై అయిన అభ్యర్థులందరికీ ఇదే విధంగా మార్కులు నమోదవడంతో తలలు పట్టుకుంటున్నారు. టెట్ మార్కుల సవరణకు శుక్రవారం వరకు అవకాశం ఉన్నప్పటికీ ఏం చేయాలో తెలియక తికమక పడుతున్నారు.
మరోవైపు అభ్యంతరాల స్వీకరణ అనంతరం సవరించిన టెట్ మార్కులతో తాజాగా విద్యాశాఖ స్కోర్ కార్డులను విడుదల చేసింది. సవరించిన స్కోర్ కార్డులను ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.