
అమరావతి, మే 16: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా డీఎస్సీ నియమాక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకాల కోసం జారీ చేసిన డీఎస్సీ 2025 నోటిఫికేషన్ ఆన్‌లైన్ దరఖాస్తు గడువు గురువారం (మే 15) అర్ధరాత్రితో ముగిసింది. చివరి ఒక్క రోజులోనే భారీగా దరఖాస్తులు వచ్చినట్లు విద్యాశాఖ వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3,53,598 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని, మొత్తం 5.67 దరఖాస్తులు సమర్పించినట్టు పాఠశాల విద్యాశాఖ తాజాగా ప్రకటించింది. కూటమి సర్కార్ తీసుకువచ్చిన మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఈ నియామక ప్రక్రియ చేపట్టగా.. ఏప్రిల్ 20 నుంచి దరఖాస్తులు సమర్పణకు అవకాశం కల్పించింది.
అయితే ఈ నోటిఫికేషన్‌లో ఊహించని రీతిలో పలు కఠిన నిబంధనలు ఉండటంతో దాదాపు 7లక్షల మందికి పైగా అభ్యర్థులు అనర్హులయ్యారంటూ తొలుత విమర్శలు వచ్చాయి. ఈ కఠిన నిబంధనలతో అనుకున్న స్థాయిలో దరఖాస్తులు రాలేదని గుర్తించిన విద్యాశాఖ ఆ తర్వాత దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. డిగ్రీ అర్హత మార్కులను 40 శాతానికి తగ్గించి, టెట్‌లో ఇచ్చిన నిబంధనల మేరకే డీఎస్సీకి కూడా అర్హత మార్కులు తగ్గించింది. మరోవైపు పదో తరగతి వరకు సీబీఎస్‌ఈలో చదివి, డీఈడీ, టెట్ పూర్తి చేసినవారికీ డీఎస్సీ దరఖాస్తులో ఇబ్బందులెదురైనాయి. సాధారణంగా సీబీఎస్‌ఈ విద్యార్థులకు పదో తరగతిలో ఫస్ట్ లాంగ్వేజ్ కింద ఇంగ్లిష్, సెకండ్ లాంగ్వేజ్ కింద తెలుగు/హిందీ/ఉర్దూ వంటి ఇతర భాషలు ఉంటాయి. ఆ ప్రకారంగా చదివిన వారిలో మొదటి భాషగా తెలుగు ఉంటేనే ఎస్‌జీటీ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలని డీఎస్సీలో నిబంధన పెట్టడంతో సీబీఎస్‌ఈ అభ్యర్థులు డీఎస్సీకి దూరమయ్యారు.
దరఖాస్తు గడువు పొడిగించాలని నిరుద్యోగులు ఎంతగా మొత్తుకున్నా కూటమి సర్కార్ మొండిగా వ్యవహరిస్తుండటం పలువురికి తీరని ఆవేదనను మిగిల్చింది. దరఖాస్తు గడువు పొడిగిస్తే దాదాపు 7 లక్షల వరకు దరఖాస్తులు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కానీ కూటమి సర్కార్ ఇందుకు విరుద్ధంగా నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లుతూ కఠినంగా వ్యవహరించడం విడ్డూరంగా ఉందంటూ పలువురు ఆవేదన చెందుతున్నారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.