Mega DSC Free Coaching: మెగా డీఎస్సీ ఉచిత కోచింగ్ స్క్రీనింగ్ పరీక్ష వాయిదా..! కొత్త తేదీపై ఉత్కంఠ
రాష్ట్రంలోని నిరుపేద నిరుద్యోగులకు మెగా డీఎస్సీకి ఉచిత కోచింగ్ ఇచ్చేందుకు కూటమి సర్కార్ ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ పూర్తికాగా అదివారం స్క్రీనింగ్ టెస్ట్ జరగాల్సి ఉంది. కానీ ఈ పరీక్ష వాయిదా పడింది. దీంతో కొత్త తేదీ ఎప్పుడో.. కోచింగ్ ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుందో తెలియక అభ్యర్ధులు గందరగోళం పడుతున్నారు..
అమరావతి, నవంబర్ 11: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మెగా డీఎస్సీ ఉచిత శిక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తులు స్వీకరించిన సంగతి తెలిసిందే. స్ర్కీనింగ్ పరీక్ష ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరికీ నవంబర్ 10న స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించాల్సి ఉంది. కానీ ఈ పరీక్ష వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల సంక్షేమ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రకటనలో పేర్కొంది. పరీక్షను నిర్వహించే తేదీని త్వరలోనే వెల్లడిస్తామని, అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలని ప్రకటనలో తెలిపింది.
స్ర్కీనింగ్ పరీక్షలో అర్హత సాధించిన వారిలో మొత్తం 5,050 మంది అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అందులో ఎస్సీలకు 3,050, ఎస్టీలకు 2,000 సీట్లు కేటాయిస్తారు. ఎంపికైన వారికి ఉచితంగా బోధన, భోజనం, వసతి సౌకర్యాలు కూడా కల్పిస్తారు. వీరందరికీ అనుభవజ్ఞులైన బోధనా సిబ్బందితో ఆయా జిల్లాల్లో 3 నెలల పాటు గురుకులాల్లో తరగతులు నిర్వహించనున్నారు. ఎస్‌జీటీ, స్కూల్ అసిస్టెంట్ పరీక్షలకు సంబంధించి కోచింగ్ అందిస్తారు. మెగా డీఎస్సీ ఫ్రీ కోచింగ్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకుంటూ ఉండాలని అధికారులు సూచించారు.
ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీ ఫ్రీ కోచింగ్ అధికారిక వెబ్‌సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ప్రశాంతంగా ముగిసిన తెలంగాణ గ్రేడ్-2 ల్యాబ్ టెక్నీషియన్ పరీక్ష
తెలంగాణ మెడికల్, హెల్త్ సర్వీసుల నియామక బోర్డు నవంబరు నవంబర్ 10 (ఆదివారం)న గ్రేడ్ 2 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) నిర్వహించింది. ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 24,045 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. వారిలో 23,323 మంది అంటే 97 శాతం మంది పరీక్షకు హాజరైనట్లు బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య సేవల నియామక బోర్డు నిర్వహించే ‘ఎంపీహెచ్‌ఏ(ఎఫ్)’ కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష తేదీని వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. డిసెంబరు 29న రాత పరీక్ష నిర్వహించనున్నట్లు బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది.