Exams Postponed 2026: నేటి ఇంటర్ ఫస్ట్ ఇయర్, టెన్త్ పరీక్షలు వాయిదా.. కొత్త తేదీలు ఇవే!
Andhra Pradesh Reschedules Inter And SSC Exams 2026: రంజాన్ సెలవు మారిన నేపథ్యంలో మార్చి 21న జరగాల్సిన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-1, లాజిక్ పేపర్ 1 పరీక్షలు, పదో తరగతి ఇంగ్లిష్ పరీక్ష వాయిదా పడ్డాయి. ఈ క్రమంలో ఇంటర్ బోర్డు కొత్త తేదీలను ప్రకటించింది..

అమరావతి, మార్చి 21: తెలుగు రాష్ట్రాల్లో మార్చి 21 (శనివారం) రంజాన్ సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మార్పు కారణంగా మార్చి 21న జరగాల్సిన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-1, లాజిక్ పేపర్ 1 పరీక్షలు వాయిదా పడ్డాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలను మార్చి 25వ తేదీన నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు రీషెడ్యూల్ చేసింది. ఈ మేరకు మారిన పరీక్ష తేదీని ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి రంజిత్ బాషా ప్రకటించారు. అయితే ఈ పరీక్షలకు ప్రస్తుతం ఉన్న హాల్‌టికెట్లతోనే పరీక్షలకు హాజరుకావొచ్చని అన్నారు. అలాగే పరీక్షా కేంద్రాల్లోనూ ఎలాంటి మార్పు ఉండబోదని పేర్కొన్నారు. యథావిధిగా మార్చి 25న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.
మరోవైపు శనివారం జరగాల్సిన పదో తరగతి ఇంగ్లిష్ పరీక్ష కూడా వాయిదా పడింది. పదో తరగతి ఇంగ్లిష్ సబ్జెక్ట్ పరీక్షను తిరిగి ఏప్రిల్ 2వ తేదీన ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:45 గంటల వరకు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. నిజానికి మార్చి 20వ తేదీన రంజాన్ సెలవు ప్రకటించినప్పటికీ శుక్రవారం సాయంత్రం దేశవ్యాప్తంగా నెలవంక కనిపించడంతో ముస్లిం మత పెద్దలు శనివారం పండుగ జరుపుకోవాలని నిర్ణయించారు. ముస్లిం సోదరుల అభ్యర్థనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం మార్చి 21వ తేదీని రంజాన్ సెలవుగా ప్రకటించింది. దీంతో పదో తరగతి, ఇంటర్ పరీక్షల తేదీల్లో మార్పులు చేశారు. ఈ మార్పులకు అనుగుణంగా పరీక్షా కేంద్రాల వద్ద తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా విద్యాశాఖాధికారులను (DEOs) ప్రభుత్వం ఆదేశించింది.
సార్వత్రిక విద్యాపీఠం పరీక్షల తేదీలు సైతం మార్పు
రంజాన్ సెలవు కారణంగా మార్చి 21న జరగాల్సిన సార్వత్రిక విద్యాపీఠం పదో తరగతి పరీక్షను మార్చి 30కి వాయిదా వేశారు. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మార్చి 21న గణితం, భారతీయ సంస్కృతి-వారసత్వం పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే ఈ పరీక్షలను మార్చి 30న నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




