AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Success Story: టైలర్‌ కుమారుడి అద్భుత విజయం.. కెనడాలో రూ.1.06 కోట్ల AI ఇంజినీర్ ఉద్యోగం

సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఓ యువకుడు తన ప్రతిభ, పట్టుదలతో అరుదైన విజయాన్ని సాధించాడు. దర్జీగా పనిచేసే తండ్రి కష్టాలను అధిగమిస్తూ చదువుకున్న అతడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో నైపుణ్యాలు పెంచుకుని కెనడాలో ఏడాదికి రూ.1.06 కోట్ల ప్యాకేజీతో AI ఇంజినీర్ ఉద్యోగాన్ని సాధించాడు. అతని సక్సెస్ స్టోరీ ఎంతోమంది యువతకు స్ఫూర్తిగా నిలుస్తోంది..

Success Story: టైలర్‌ కుమారుడి అద్భుత విజయం.. కెనడాలో రూ.1.06 కోట్ల AI ఇంజినీర్ ఉద్యోగం
Kakinada Tailor Son Success Story
Srilakshmi C
|

Updated on: Jul 28, 2026 | 6:51 PM

Share

కాకినాడ, జులై 28: ఆర్థిక ఇబ్బందులు ఎంత ఉన్నా కష్టపడి చదివితే విజయాన్ని అందుకోవచ్చని తాజాగా మరోమారు రుజువైంది. టైలర్‌గా పనిచేస్తున్న తండ్రి కష్టాలను చూసి పెరిగిన ఓ యువకుడు ఇప్పుడు కెనడాలో ఏడాదికి రూ.1.06 కోట్ల వేతనంతో AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఇంజినీర్‌గా ఉద్యోగం సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం కుతుకుడుమిల్లి గ్రామానికి చెందిన మాల్తి అఖిలేశ్‌.. సాధారణ మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు. అఖిలేశ్‌ తండ్రి కుట్టు పనులు చేసి కుటుంబాన్ని పోషించేవారు. పరిమిత ఆదాయం, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కుమారుడి చదువుకు ఎలాంటి ఆటంకం రాకుండా తల్లిదండ్రులు అండగా నిలిచారు. వారి కష్టాన్ని వృథా చేయకుండా విద్యలో ప్రతిభ కనబరిచిన అఖిలేశ్‌ సాంకేతిక రంగంలో తన నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగాడు.

కష్టానికి దక్కిన ఫలితం

ఇంజినీరింగ్ పూర్తి చేసిన అనంతరం కృత్రిమ మేధస్సు (AI), మెషిన్ లెర్నింగ్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ వంటి అత్యాధునిక సాంకేతికతల్లో ప్రత్యేక నైపుణ్యాలను అభివృద్ధి చేసుకున్నాడు. అనేక ప్రాజెక్టులు, సాంకేతిక ఇంటర్వ్యూల ద్వారా తన ప్రతిభను నిరూపించుకుని చివరకు కెనడాకు చెందిన ప్రముఖ సంస్థలో AI ఇంజినీర్‌గా ఏడాదికి రూ.1.06 కోట్ల ప్యాకేజీతో ఉద్యోగాన్ని దక్కించుకున్నాడు. ఈ విజయం వెనుక ఎన్నో సంవత్సరాల కృషి, నిరంతర అభ్యాసం, కొత్త టెక్నాలజీలపై ఆసక్తి ఉన్నట్లు అఖిలేశ్‌ సన్నిహితులు చెబుతున్నారు. ఆర్థిక పరిస్థితులు విజయానికి అడ్డంకి కావని, సరైన నైపుణ్యాలు, పట్టుదల ఉంటే ప్రపంచ స్థాయి అవకాశాలు దక్కుతాయని ఈ యువకుడి ప్రయాణం మరోసారి నిరూపించింది.

ప్రస్తుతం AI, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ వంటి రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో కొత్త సాంకేతికతలను నేర్చుకుని నైపుణ్యాలను పెంపొందించుకుంటే అంతర్జాతీయ స్థాయిలో ఉన్నత వేతన ఉద్యోగాలు సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు. దర్జీ కుమారుడిగా ప్రారంభమైన ఈ యువకుడి ప్రయాణం, ఇప్పుడు కోట్ల రూపాయల వేతనంతో అంతర్జాతీయ సంస్థలో ఉద్యోగం సాధించే స్థాయికి చేరుకోవడం ఎంతోమంది విద్యార్థులకు, యువ ఇంజినీర్లకు స్ఫూర్తిగా నిలిచింది.

Follow Us