అమరావతి, జూన్ 18: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు మంగళవారం (జూన్ 18) విడుదలయ్యాయి. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఇంటర్ బోర్డు ఫలితాలను విడుదల చేసింది. పరీక్షలకు హాజరైన విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1.40 లక్షల మంది హాజరయ్యారు. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మే 24 నుంచి జూన్ 1వ తేదీ వరకు ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితియ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే.
తొలుత ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు, ఆ తర్వాత ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాలు వెల్లడించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు ఈ రోజు ఇంటర్ సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు వెలువడ్డాయి. ఇక ఇంటర్ మొదటి ఏడాది అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు జూన్ 26న విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా ఈ ఏడాది ఇంటర్మిడియెట్ సప్లిమెంటరీ పరీక్షల జవాబు పత్రాలను తొలిసారిగా డిజిటల్ విధానంలో మూల్యాంకనం చేశారు. ఇంటర్ ఫలితాల అనంతరం రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి పలు డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు చేపడతారు. ఇందుకు సంబంధించి అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు.
జూన్ 18 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఆన్‌లైన్‌లోనే విద్యార్ధులు కాలేజీలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ అడ్మిషన్ మాడ్యుల్ ఫర్ డిగ్రీ కాలేజెస్ (ఓఏఏండీసీ) ద్వారా డిగ్రీ ప్రవేశాలు నేటి నుంచి జూన్ 29 వరకు కొనసాగుతాయి. కౌన్సెలింగ్ ప్రక్రియ మొత్తం మూడు దశల్లో నిర్వహిస్తారు. ఇంటర్మీడియట్ లో 90 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులకు మొదట దశలో ప్రవేశాలు కల్పిస్తారు. 80 నుంచి 90 శాతం మధ్య మార్కులు సాధించిన విద్యార్థులకు రెండో దశలో, 80 శాతం కంటే తక్కువ మార్కులు సాధించిన విద్యార్థులకు చివరి దశలో ప్రవేశాలు కల్పిస్తారు. రాష్ట్రంలోని ప్రస్తుతం 3.19 లక్షల సీట్లు అందుబాటులో ఉన్నాయి. గతేడాది 1.53 లక్షల సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.