AP New Sports Policy: ‘ఉద్యోగాల్లో స్పోర్ట్స్‌ కోటా రిజర్వేషన్‌ 2 నుంచి 3 శాతానికి పెంపు’ సీఎం చంద్రబాబు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పోర్ట్స్‌ ఫర్‌ ఆల్‌ విధానంతో నూతన క్రీడా పాలసీకి ఆమోదం తెలిపారు. అంతేకాకుండా ఉద్యోగాల్లో స్పోర్ట్స్‌ కోటా రిజర్వేషన్‌ 2 నుంచి 3 శాతానికి పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు..

AP New Sports Policy: 'ఉద్యోగాల్లో స్పోర్ట్స్‌ కోటా రిజర్వేషన్‌ 2 నుంచి 3 శాతానికి పెంపు' సీఎం చంద్రబాబు
Sports Quota Reservation
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 05, 2024 | 8:05 AM

అమరావతి, నవంబర్‌ 5: రాష్ట్ర సచివాలయంలో సీఎం అధ్యక్షతన నూతన స్పోర్ట్స్‌ పాలసీపై సోమవారం (నవంబర్‌ 4) సమీక్ష జరిగింది. ఏపీ కొత్తగా తీసుకువస్తున్న స్పోర్ట్స్‌ పాలసీ విధానం దేశంలోనే ఉత్తమ క్రీడా విధానంగా ఉండాలని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని క్రీడా కేంద్రంగా మార్చేందుకు నాలుగు లక్ష్యాలతో పాలసీకి రూపకల్పన చేయాలి. స్పోర్ట్స్‌ ఫర్‌ ఆల్, నర్చర్‌ టాలెంట్, స్పోర్ట్స్‌ ఎకో సిస్టం, గ్లోబల్‌ విజిబిలిటీ ప్రాతిపదికగా పాలసీని రూపొందించాలి. గ్రామ స్థాయి నుంచి క్రీడల ప్రోత్సాహకానికి ప్రణాళిక రూపొందించాలి. ఇందులో భాగంగా క్రీడా కోటా రిజర్వేషన్‌ 2 నుంచి 3 శాతానికి పెంచుతున్నట్లు నిర్ణయం తీసుకున్నామన్నారు. శాప్‌లో గ్రేడ్‌ 3 కోచ్‌ల కోసం ఇంటర్నేషనల్‌ మెడల్స్‌ సాధించిన వారికి 50 శాతం రిజర్వేషన్‌ కల్పించనున్నట్టు ఆయన ప్రకటించారు.

ఒలింపిక్స్‌ విజేతలకు భారీ ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు నిర్ణయం

ఒలింపిక్స్‌లో బంగారు పతకానికి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం రూ.75 లక్షలు ఇస్తుండగా.. దానిని రూ.7 కోట్లకు పెంచారు. రజత పతకానికి రూ.50 లక్షలు నుంచి రూ.5 కోట్లు, కాంస్యానికి రూ.30 లక్షల నుంచి రూ.3 కోట్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఒలింపిక్స్‌లో పాల్గొన్న వారికి రూ.50 లక్షల చొప్పున ప్రోత్సాహకం ఇవ్వాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఏషియన్‌ గేమ్స్‌ బంగారు పతకానికి రూ.4 కోట్లు, రజత పతకానికి రూ.2 కోట్లు, కాంస్య పతకానికి రూ.కోటి, పాల్గొన్న వారికి రూ.10 లక్షల చొప్పున ప్రోత్సాహకం ఇవ్వాలన్నారు. అదే విధంగా వరల్డ్‌ ఛాంపియన్‌షిప్, వరల్డ్‌ కప్‌ పోటీల్లో బంగారు పతకం సాధించిన వారికి రూ.50 లక్షలు, రజతానికి రూ.35 లక్షలు, కాంస్యానికి రూ.25 లక్షల చొప్పున ఇవ్వనున్నట్టు ప్రకటించారు.

నేషనల్‌ గేమ్స్‌లో బంగారు పతకం సాధించిన వారికి రూ.10 లక్షలు, రజతానికి రూ.5 లక్షలు, కాంస్య పతకానికి రూ.3 లక్షలు.. ఖేలో ఇండియా గేమ్స్, నేషనల్‌ స్కూల్‌ గేమ్స్‌లో బంగారు పతకం సాధించిన వారికి రూ.2.50 లక్షలు, రజత పతకం సాధించిన వారికి రూ.2 లక్షలు, కాంస్యం సాధించిన వారికి రూ.లక్ష చొప్పున ప్రోత్సాహకం ఇవ్వనున్నట్లు సీఎం తెలిపారు. ఈ మేరకు స్పోర్ట్స్‌ ఫర్‌ ఆల్‌ విధానంతో నూతన క్రీడా పాలసీకి చంద్రబాబు ఆమోదం తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.