AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోడి ముందా? గుడ్డు ముందా? బీర్బల్ చెప్పిన తెలివైన సమాధానం వింటే నవ్వకుండా ఉండలేరు!

అక్బర్‌ బీర్బల్ కథలు అనగానే చమత్కారం, సమయస్ఫూర్తి, తెలివితేటలు గుర్తుకొస్తాయి. క్లిష్టమైన ప్రశ్నలకు సైతం తనదైన శైలిలో సమాధానాలు చెబుతూ ప్రత్యర్థులను సైతం ఆశ్చర్యపరచడం బీర్బల్ ప్రత్యేకత. అలాంటి ఓ ఆసక్తికరమైన కథలో ఒక పండితుడు బీర్బల్‌ను ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నిస్తాడు. 'ముందు కోడి వచ్చిందా? గుడ్డు వచ్చిందా?' అని ప్రశ్నిస్తాడు. అయితే బీర్బల్ తన తెలివితో ఆ ప్రశ్నకే కాదు, పండితుడి సవాలుకూ చమత్కారమైన సమాధానం చెబుతాడు. ఇంతకీ ఆ కథ ఏమిటో తెలుసుకుందాం..

కోడి ముందా? గుడ్డు ముందా? బీర్బల్ చెప్పిన తెలివైన సమాధానం వింటే నవ్వకుండా ఉండలేరు!
Chicken Or Egg First
Srilakshmi C
|

Updated on: Oct 09, 2026 | 9:20 AM

Share

ఒకరోజు ఆగ్రాలోని చక్రవర్తి అక్బర్‌ రాజదర్బారుకు ఓ పండితుడు వచ్చాడు. దేశవిదేశాల్లోని అనేక మంది పండితులను తన ప్రశ్నలతో ఓడించానని, ఇప్పుడు అక్బర్‌ ఆస్థానంలోని మేధావుల తెలివితేటలను పరీక్షించాలనుకుంటున్నానని చెప్పాడు. కావలివాడు ఈ విషయాన్ని చక్రవర్తికి తెలియజేయడంతో అక్బర్‌ ఆ పండితుడిని సభలోకి పిలిపించాడు. పండితుడు సభలోకి వచ్చి తనకు ఎదురులేదన్నట్లు గర్వంగా మాట్లాడాడు. అతడి మాటలు విన్న కొందరు సభికులు బీర్బల్‌ వైపు చూశారు. అప్పటికే బీర్బల్‌ తెలివితేటలపై అసూయతో ఉన్న కొందరు సభికులు ఈ అవకాశాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని భావించారు. ఈసారి పండితుడి ప్రశ్నలకు బీర్బల్‌ సమాధానం చెప్పలేడని మనసులో అనుకున్నారు.

పండితుడు బీర్బల్‌ దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు. ‘బీర్బల్‌! నీ తెలివితేటల గురించి చాలా విన్నాను. ఇప్పుడు నీ సామర్థ్యాన్ని పరీక్షించాలనుకుంటున్నాను. నీకు రెండు అవకాశాలు ఇస్తాను. మొదటిది.. నేను అడిగే వంద సులభమైన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. రెండోది.. నేను అడిగే ఒకే ఒక్క కఠినమైన ప్రశ్నకు సమాధానం చెప్పాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి ఎంచుకో!’ పండితుడి సవాలు విన్న సభికులు ఆశ్చర్యపోయారు. వంద ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం అంత సులభం కాదు. ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పాలన్నా అది చాలా క్లిష్టమైనదై ఉండవచ్చు. అయితే బీర్బల్‌ ఏమాత్రం తడబడలేదు. కాసేపు ఆలోచించి, ‘పండితులవారూ.. నేను మీ ఒక్క కఠినమైన ప్రశ్నకే సమాధానం చెబుతాను’ అని బదులిచ్చాడు.

కోడి ముందా? గుడ్డు ముందా?

బీర్బల్‌ నిర్ణయంతో పండితుడు సంతోషించాడు. తన ప్రశ్నతో బీర్బల్‌ను ఇరకాటంలో పెట్టవచ్చని భావించాడు. వెంటనే గంభీరంగా చూస్తూ.. ‘బీర్బల్‌! చెప్పు.. ఈ ప్రపంచంలో మొదట కోడి వచ్చిందా? గుడ్డు వచ్చిందా?’ అని ప్రశ్నించాడు. ఈ ప్రశ్న విన్న సభలో నిశ్శబ్దం నెలకొంది. కొందరు సభికులు ఒకరి ముఖాలు మరొకరు చూసుకున్నారు. కోడి ముందొస్తే అది గుడ్డు నుంచి పుట్టి ఉండాలి. గుడ్డు ముందొస్తే దాన్ని కోడి పెట్టి ఉండాలి. మరి మొదట ఏది వచ్చిందనేది ఎలా తేల్చాలి? పండితుడు బీర్బల్‌ సమాధానం కోసం ఆసక్తిగా ఎదురుచూశాడు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేక బీర్బల్‌ ఓడిపోతాడని అనుకున్నాడు. అయితే బీర్బల్‌ ఏమాత్రం ఆలోచించకుండా చిరునవ్వుతో ఇలా అన్నాడు..

‘పండితులవారూ.. ఇందులో సందేహం ఏముంది? ముందుగా కోడే వచ్చింది!’ బీర్బల్‌ సమాధానం విన్న పండితుడు ఆశ్చర్యపోయాడు. వెంటనే మరో ప్రశ్న వేశాడు. ‘అదెలా చెప్పగలవు? కోడి ముందుగా వచ్చిందని నిరూపించగలవా? దాని వెనుక ఉన్న తర్కం ఏమిటి?’ పండితుడు ఇప్పుడు బీర్బల్‌ను ఇరుకున పెట్టానని భావించాడు. బీర్బల్‌ తన సమాధానాన్ని సమర్థించుకునే ప్రయత్నంలో చిక్కుకుంటాడని అనుకున్నాడు. కానీ బీర్బల్‌ ప్రశాంతంగా నవ్వుతూ ఇలా అన్నాడు.. ‘పండితులవారూ.. మీరు నాకు ఒక కఠినమైన ప్రశ్న మాత్రమే అడుగుతానని చెప్పారు. మీరు అడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెప్పాను. ఇప్పుడు మీరు అడుగుతున్నది మరో ప్రశ్న. మన ఒప్పందం ప్రకారం నేను ఒక్క ప్రశ్నకే సమాధానం చెప్పాలి. ఆ ప్రశ్నకు సమాధానం ఇప్పటికే ఇచ్చేశాను!’

బీర్బల్‌ సమయస్ఫూర్తితో ఇచ్చిన సమాధానం విన్న సభికులు చప్పట్లతో దర్బారును మారుమోగించారు. చక్రవర్తి అక్బర్‌ సైతం తన నవ్వును ఆపుకోలేకపోయాడు. పండితుడు తన తప్పును గ్రహించాడు. బీర్బల్‌ ప్రశ్నకు శాస్త్రీయమైన వివరణ ఇవ్వకపోయినా, తాను విధించిన షరతును తెలివిగా ఉపయోగించుకుని తనను మౌనంగా ఉంచాడని అర్థం చేసుకున్నాడు. ‘బీర్బల్‌! నీ సమయస్ఫూర్తి నిజంగా అద్భుతం. ఎంతోమంది పండితులను కలిశాను. కానీ ఇంత చాకచక్యంగా సమాధానం చెప్పడం మాత్రం ఇప్పుడే చూశాను’ అని ప్రశంసించాడు. చక్రవర్తి అక్బర్‌ కూడా బీర్బల్‌ను అభినందించాడు. ‘సమస్య ఎంత క్లిష్టంగా ఉన్నా, దాన్ని ఎదుర్కొనే తెలివి, సమయస్ఫూర్తి మనిషికి ఎంతో అవసరం’ అని సభికులకు వివరించాడు. పండితుడు బీర్బల్‌ తెలివితేటలను మెచ్చుకుని, చక్రవర్తికి నమస్కరించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. బీర్బల్‌ను ఓడిపోతాడని ఎదురుచూసిన సభికులు మాత్రం అతడి సమయస్ఫూర్తిని చూసి ఆశ్చర్యపోయారు.

ఈ అక్బర్‌ బీర్బల్‌ కథ మనకు ఓ ముఖ్యమైన విషయాన్ని తెలియజేస్తుంది. తెలివి అంటే ప్రతి ప్రశ్నకు సుదీర్ఘంగా సమాధానం చెప్పడం కాదు.. పరిస్థితిని అర్థం చేసుకుని సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం. ఎదుటివారు వేసే సవాళ్లను ఆవేశంతో కాకుండా ప్రశాంతంగా, వివేకంతో ఎదుర్కొంటే క్లిష్టమైన పరిస్థితుల నుంచి కూడా బయటపడవచ్చు. అందుకే జీవితంలో జ్ఞానంతో పాటు సమయస్ఫూర్తి, చాకచక్యం, స్పష్టమైన ఆలోచన కూడా ఎంతో అవసరం.

Follow Us