ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ (AI)తో ఉద్యోగాలు ఊడిపోతాయేమోనని గత కొంత కాలంగా టెకీలు మదనపడుతున్నారు. దీంతో ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియక బిక్కుబిక్కుమంటూ కొలువులు చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో బెయిన్ అండ్ కంపెనీ నుంచి జారీ చేసిన తాజా నివేదిక శుభవార్త తెలిపింది. అదేంటంటే.. 2027 నాటికి ఏఐ ద్వారా దాదాపు 2.3 మిలియన్లకు పైగా ఉద్యోగాలు జాబ్ మార్కెట్లోకి వస్తాయని వెల్లడించింది. అయితే భవిష్యత్తు ఉద్యోగాల్లో ఆశావహ దృక్పధాన్ని అందిస్తున్నప్పటికీ మరో ముఖ్యమైన సవాలు కూడా ఉందని నివేదిక తెల్పింది. అందుబాటులో ఉన్న శ్రామిక శక్తి కంటే AI నిపుణులకు డిమాండ్ పెరగనుంది. దీంతో అప్‌స్కిల్లింగ్, రిస్కిల్లింగ్‌లో నైపుణ్యం పొందడం ఆవశ్యకమైంది.
కన్సల్టింగ్ సంస్థ తాజా అధ్యయనం ప్రకారం.. ప్రపంచ AI టాలెంట్ పూల్ 2024లో 8 లక్షలు ఉండగా అది 2025 నాటికి 9 లక్షల 40 వేలకి పెరుగుతుందని, 2026 నాటికి 1.08 మిలియన్లకు చేరుకుంటుందని అంచనా. అయితే ఈ పెరుగుదలతో కూడా AI టాలెంట్ డిమాండ్ సరఫరాను మించిపోతుంది. 1.5 మిలియన్ల AI నిపుణుల అవసరం ఉంది. ఇది 2025 నాటికి 2 మిలియన్లకు పెరిగే అవకాశం ఉంది. ఇది భారీ అంతరాన్ని సూచిస్తుంది. ప్రొఫెషనల్స్ నైపుణ్యాన్ని పెంచుకోవడం ద్వారా AI రోల్స్‌లో తగినంత అవకాశాలు అందిస్తుంది. ముఖ్యంగా పాశ్చాత్య దేశాలలో AI ప్రతిభ కొరత తీవ్రంగా ఉంది. UKలో AI నిపుణుల కొరత 50 శాతం, జర్మనీలో 70 శాతం AI ఉద్యోగాల కొరత ఉందని నివేదిక అంచనా వేసింది. ఇక ఆస్ట్రేలియాలో 2027 నాటికి దాదాపు 60 వేల మంది నిపుణుల్లో ప్రతిభ అంతరం చోటు చేసుకుంటుందని అంచనా. ఇది ప్రపంచ మార్కెట్లలో AI నిపుణులకు పెరుగుతున్న డిమాండ్‌కు సంకేతం. ఇది US, UK వంటి దేశాలలో భారతీయ నిపుణులకు లాభాదాయకంగా మారనుంది.
44 శాతం మంది యాజమన్యం తమ సంస్థలలో AI-ఆధారిత పరిష్కారాలను అమలు చేయడానికి తమ అంతర్గత నిపుణుల్లో AI నైపుణ్యం లేకపోవడాన్ని ముఖ్యమైన అవరోధంగా భావిస్తున్నట్లు బెయిన్ & కంపెనీ పరిశోధనలో తేలింది. పెరుగుతున్న AI నిపుణుల డిమాండ్‌ను ఇది సూచిస్తుంది. గ్లోబల్ ఏఐ టాలెంట్ కేంద్రంగా తనను తాను నిలబెట్టుకోవడానికి భారత్‌కు ఇది సువర్ణావకాశమని బెయిన్ అండ్ కంపెనీకి చెందిన భారత్ AI ఇన్‌సైట్స్ అండ్ సొల్యూషన్స్ ప్రాక్టీస్ పార్ట్నర్ లీడ్ సైకత్ బెనర్జీ పేర్కొన్నారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.