హైదరాబాద్, జులై 7: డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్-తెలంగాణ (దోస్త్) మూడో విడత సీట్ల కేటాయింపు ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం ముడో విడతలో 73,662 మంది విద్యార్థులకు సీట్లు దక్కాయి. వారిలో 9,630 మంది గత రెండు విడతల్లో సీట్లు పొందినవారు ఉన్నారు. వీరంతా మళ్లీ వెబ్ ఆప్షన్లు ఇచ్చుకుని కొత్త కాలేజీలు, కోర్సుల కోసం ప్రయత్నించారు. ఇందుకు సంబంధించిన వివరాలను దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి వెల్లడించారు. వెబ్ ఆప్షన్లు తక్కువగా ఇచ్చినందున 6,650 మందికి సీట్లు దక్కలేదని ఆయన తెలిపారు. సీట్లు పొందినవారు జులై 7 నుంచి 11వ తేదీలోపు ఫీజు చెల్లించి ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి సీట్లను రిజర్వు చేసుకోవాల్సి ఉంటుంది. రెండో విడతలో సీటు పొంది.. మళ్లీ మూడో విడతలో కొత్తగా వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నవారు కూడా మళ్లీ ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని దోస్త్ కన్వీనర్ స్పష్టం చేశారు.
సీట్లు పొందిన విద్యార్ధుల మొబైల్ ఫోన్లకు ఓటీపీ వస్తుందని, జులై 8 నుంచి 12వ తేదీ వరకు సంబంధిత కాలేజీలకు వెళ్లి, ఆ ఓటీపీ సమర్పించి తమ సీట్లను ఫైనలైజ్ చేసుకోవాలని తెలిపారు. ఎవరైనా సీట్లు పొందిన కాలేజీల్లో రిపోర్ట్ చేయకుంటే సీట్లు కోల్పోతారని అన్నారు. దోస్త్ దరఖాస్తు, సీటు కేటాయింపు లెటర్, ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్ట్, పది, ఇంటర్ మెమోలు, 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు బోనాఫైడ్, కుల, ఆదాయ పత్రాలతో పాటు ఆధార్‌కార్డు, 4 పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు, రెసిడెన్షియల్ సర్టిఫికెట్లు, రెండు సెట్ల జిరాక్స్ కాపీలు తీసుకురావాలని ఆయన సూచించారు.
ఇక తాజా ప్రక్రియతో మూడు విడతల సీట్ల కేటాయింపు పూర్తి అయినట్లైంది. దీంతో జులై 15వ తేదీ నుంచి మొదటి సెమిస్టర్ తరగతులు ప్రారంభం కానున్నాయి. మూడు విడతల్లో సీట్లు పొందిన అభ్యర్థులు ఆయా కాలేజీల్లో ఖాళీలను బట్టి తమ కోర్సులను మార్చుకోవచ్చని దోస్త్ కన్వీనర్ లింబాద్రి సూచించారు. ఇలా కోర్సులు మార్చుకునేందుకు జులై 16 నుంచి 18వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలని, 19న సీట్లు కేటాయిస్తామని ఆయన పేర్కొన్నారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.