AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MBBS ప్రవేశాల్లో.. వారికి 1% రిజర్వేషన్‌ ఇవ్వాల్సిందే..! 71 ఏళ్ల వృద్ధుడి వింత డిమాండ్

ఎంబీబీఎస్ ప్రవేశాల్లో సీనియర్ సిటిజన్లకు 1 శాతం ప్రత్యేక కోటా కల్పించాలని కోరుతూ ఓ వృద్ధుడు అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. నీట్-యూజీ 2026 పరీక్ష రాసిన ఆయన, వయోపరిమితి లేకుండా పరీక్ష రాయడానికి అవకాశం ఇస్తున్నప్పుడు ప్రవేశాల్లో కూడా సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక అవకాశం కల్పించాలని వాదిస్తున్నారు..

MBBS ప్రవేశాల్లో.. వారికి 1% రిజర్వేషన్‌ ఇవ్వాల్సిందే..! 71 ఏళ్ల వృద్ధుడి వింత డిమాండ్
71-year-old NEET aspirant seeking MBBS quota
Srilakshmi C
|

Updated on: Jul 20, 2026 | 12:30 PM

Share

లక్నో, జులై 20: లక్నోకు చెందిన 71 ఏళ్ల అశోక్ బహార్ ఎంబీబీఎస్ ప్రవేశాల్లో సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక కోటా కల్పించాలని కోరుతూ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. నీట్-యూజీ (NEET-UG) 2026 పరీక్ష రాసిన ఆయన, అర్హత సాధించిన సీనియర్ సిటిజన్లకు కనీసం 1 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై లక్నో బెంచ్ జూలై 21న విచారణ చేపట్టనుంది. తన పిటిషన్‌లో అశోక్ బహార్ కీలక వాదనలు వినిపించారు. ప్రస్తుతం వైద్య విద్య ప్రవేశాల్లో పలు వర్గాలకు రిజర్వేషన్లు, ప్రత్యేక సౌకర్యాలు ఉన్నప్పటికీ, సీనియర్ సిటిజన్ల కోసం ఎలాంటి ప్రత్యేక నిబంధనలు లేవని పేర్కొన్నారు. నీట్-యూజీ పరీక్ష రాయడానికి గరిష్ట వయోపరిమితి లేకపోతే, వృద్ధులకు కూడా ప్రవేశాల్లో తగిన అవకాశాలు కల్పించాలని ఆయన అభిప్రాయపడ్డారు. అతని తరఫు న్యాయవాది పంకజ్ ధీర్ సింగ్ రాణా, నీట్-యూజీకి ఉన్న గరిష్ట వయోపరిమితిని రద్దు చేసిన సుప్రీంకోర్టు తీర్పును ప్రస్తావించారు. పరీక్షలో అర్హత సాధించిన సీనియర్ సిటిజన్లకు అనుకూలంగా ప్రభుత్వం ప్రత్యేక విధానాన్ని రూపొందించాలని పిటిషన్‌లో కోరారు.

వైద్య విద్య కల కోసం జీవిత కాలం నిరీక్షణ

అశోక్ బహార్ వైద్యుడిగా మారాలనే ఆశయం దాదాపు ఐదు దశాబ్దాల క్రితమే ప్రారంభమైంది. 1974లో తొలిసారి మెడికల్ ఎంట్రన్స్ పరీక్ష రాసినప్పటికీ విజయం సాధించలేకపోయారు. అనంతరం చాలా కాలం తర్వాత 2023లో మరోసారి ప్రయత్నించారు. అయితే పరీక్షా కేంద్రం దూరంగా ఉండటంతో ఆలస్యంగా చేరుకోవడం వల్ల పరీక్ష రాయలేకపోయారు. అయినా ఆయన వెనక్కి తగ్గలేదు. 2026 మే నెలలో నిర్వహించిన నీట్-యూజీ పరీక్షకు హాజరై తన కలను సజీవంగా ఉంచుకున్నారు.

తల్లి కలను నెరవేర్చాలనే పట్టుదల

తన తల్లి సావిత్రి దేవి తనను డాక్టర్‌గా చూడాలని కోరుకునేదని అశోక్ బహార్ తెలిపారు. 1990లో ఆమె మరణించినప్పటికీ ఆ కలను వదిలిపెట్టలేదని చెప్పారు. అనంతరం ఆయన భార్య డాక్టర్ మంజు బహార్ మరోసారి ప్రయత్నించాలని ప్రోత్సహించారని పేర్కొన్నారు. అశోక్ బహార్ కుటుంబంలో దాదాపు 20 మంది వైద్యులు ఉన్నారు. వారిలో చాలామంది విదేశాల్లో వైద్య వృత్తిని కొనసాగిస్తున్నారు. అశోక్ బహార్ లక్నో విశ్వవిద్యాలయం నుంచి బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీలో బీఎస్సీ పట్టా పొందారు. అదనంగా కంప్యూటర్ అప్లికేషన్స్‌లో పీజీ డిప్లొమా, ఎంబీఏ, న్యాయశాస్త్రంలో డిగ్రీలను కూడా పూర్తి చేశారు.

ఇవి కూడా చదవండి

వృత్తి జీవితంలో ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ (IDPL) సంస్థలో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల మార్కెటింగ్ హెడ్‌గా పనిచేశారు. స్వచ్ఛంద పదవీ విరమణ అనంతరం విదేశాంగ మంత్రిత్వ శాఖకు కన్సల్టెంట్‌గా సేవలందించారు. ప్రస్తుతం హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. విద్యను అభ్యసించడానికి వయసు ఎప్పుడూ అడ్డంకి కాకూడదని అశోక్ బహార్ అభిప్రాయపడుతున్నారు. జీవితంలో ఏ దశలోనైనా తమ కలలను సాకారం చేసుకోవడానికి ప్రతి ఒక్కరికీ అవకాశం ఉండాలని ఆయన అంటున్నారు. గతంలో నెరవేరని లక్ష్యాలను సాధించాలనుకునే సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక నిబంధనలు తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ ఆసక్తికరమైన పిటిషన్‌పై అలహాబాద్ హైకోర్టు తీసుకునే నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Follow Us