Inter Public Exams 2025: తెలంగాణ ఇంటర్ బోర్డ్ vs ప్రైవేటు జూనియర్ కాలేజీలు.. యవ్వారం ఎక్కడిదాకా వెళ్తుందో?

TG private junior colleges boycott inter exams: ఇంటర్ బోర్డు వైఖరిపై తెలంగాణ ప్రైవేటు జూనియర్ కాలేజీలు మూకుమ్మడిగా నిరసన వ్యక్తం చేస్తున్నాయి. వచ్చే ఇంటర్ పబ్లిక్‌ పరీక్షలకు తమ కాలేజీలను సెంటర్లుగా ఇవ్వబోమని తెగేసి చెబుతున్నాయి. దీంతో మరో నెల రోజుల్లో ఇంటర్ పరీక్షలు ప్రారంభంకానుండగా.. పరీక్ష కేంద్రాల ఏర్పాటు ఎలా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1125 కాలేజీలు బోర్డు నిబంధనలను వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టాయి..

Inter Public Exams 2025: తెలంగాణ ఇంటర్ బోర్డ్ vs ప్రైవేటు జూనియర్ కాలేజీలు.. యవ్వారం ఎక్కడిదాకా వెళ్తుందో?
TG private junior colleges boycott inter exams

Edited By:

Updated on: Jan 30, 2025 | 7:54 AM

హైదరాబాద్‌, జనవరి 30: ఇంటర్ పరీక్షల నిర్వహణకు సెంటర్లపై సందిగ్ధత ఏర్పడింది. ఇంటర్ బోర్డు వైఖరిపై నిరసన వ్యక్తం చేస్తూ తెలంగాణ ప్రైవేటు జూనియర్ కాలేజీలు ఇంటర్ పరీక్షలకు తమ కాలేజీలను సెంటర్లుగా ఇవ్వబోమని కీలక నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఇంటర పరీక్షలకు కేంద్రాలు ఎలా అనే సందేహాలు మొదలవుతున్నాయి. మార్చి 5 నుంచి జరిగే ఇంటర్ వార్షిక పరీక్షలకు సెంటర్లుగా ప్రభుత్వ కాలేజీలతో పాటు ప్రైవేటు కార్పొరేట్, బడ్జెట్ కాలేజీలను ఎంపిక చేసుకుంటారు. ఇందులో ప్రైవేటు బడ్జెట్ కాలేజీలైన దాదాపు 1125 కాలేజీలు బోర్డు నిబంధనలతో సెంటర్లను ఇచ్చేందుకు నిరాకరిస్తున్నట్లు యాజమాన్యలు వెల్లడించాయి.

మిక్స్ డ్ ఆక్యూపెన్సీ భవనాల్లో ఉన్న కాలేజీలకు ఎన్వోసీ ఇచ్చేందుకు ప్రభుత్వం జనవరి 15న జీవో ఇచ్చింది. ఆ తర్వాత బోర్డు నుంచి రావాల్సిన అనుబంధ గుర్తింపునకు సెక్రటరీ అడ్డంకులు సృష్టిస్తున్నారని తెలంగాణ ప్రైవేటు జూనియర్ కాలేజీల యాజమాన్యల సంఘం ఆరోపిస్తోంది. దాంతో పాటు అనుబంధ గుర్తింపు ఆలస్యం కావడంతో పరీక్ష ఫీజు ఆయా కాలేజీల్లోని విద్యార్థులకు 2500 జరిమానాతో పాటు కాలేజీలకు లక్ష చొప్పున ఫైన్ వేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాయి. కార్పొరేట్ కాలేజీలకు వత్తాసు పలుకుతు బడ్జెట్ కాలేజీలపై ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్యతో పాటు సీఎంవోలోని ఓ ఐఏఎస్ అధికారి వ్యవహరిస్తున్నారని టీపీజేఎంఏ అధ్యక్షుడు గౌరి సతీష్ ఆరోపించారు. ఎన్వోసీ ఇచ్చేందుకు వీలుగా ప్రభుత్వం జీవో జారీ చేసి సానుకూలంగా ఉంటే.. బోర్డు అధికారులు మాత్రం ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేలా చేస్తున్నారని ఆయన అన్నారు.

ఫిబ్రవరిలో జరిగే ప్రాక్టికల్ ఎగ్జామ్ హాల్స్ లో సీసీ కెమెరాలు పెట్టకపోతే ప్రాక్టికల్ ఎగ్జామ్ సెంటర్లు ఇవ్వమని బోర్డు సెక్రటరీ బెదిరించారని గౌరి సతీష్ అన్నారు. ఇప్పటికిప్పుడు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేమని.. ప్రాక్టికల్స్ సెంటర్లు ఇవ్వమన్నారు. కాబట్టి వార్షిక పరీక్షలకు కూడా సెంటర్లుగా మా కాలేజీలను ఇవ్వబోమని టీపీజేఎంఏ తెలిపింది. బోర్డు అధికారుల ధన దాహనికి బడ్జెట్ కాలేజీలను బొంద పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే మంత్రులను కలిసి సమస్యను వివరించామని.. సీఎంను కలవకుండా ఇంటర్ బోర్డు అధికారులు చేస్తున్నారని చెప్పారు. తక్షణమే సీఎం రేవంత్ రెడ్డి స్పందించి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని టీపీజేఎంఏ సభ్యులు కోరారు. గురువారం అన్ని జిల్లాల్లో జిల్లా ఇంటర్ విద్య కార్యాలయాల్లో నిరసనలు తెలపనున్నట్లు గౌరి సతీష్ వెల్లడించారు. దాదాపు బడ్జెట్ కాలేజీలు 2500కు పైగా ఉన్నాయి. వాటిలో చదివే విద్యార్థులపై ఎలాంటి ప్రభావం పడుతుందోనన్న ఆందోళనలో తల్లిదండ్రులు ఉన్నారు. ఇంటర్ బోర్డు వర్సెస్ ప్రైవేటు కాలేజీ యాజమాన్యాల ఇష్యూ ఎక్కడిదాకా వెళ్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.