
అమరావతి, నవంబర్ 25: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు ఇంటర్మీడియట్ బోర్డు ‘సంకల్ప్-2026’ కార్యక్రమాన్ని చేపట్టింది. 50 రోజుల ప్రణాళికతో కూడిన షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు డైరెక్టర్ రంజిత్ బాషా విడుదల చేశారు. నవంబరు 24 నుంచి ఫిబ్రవరి 20 వరకు ఈ ప్రణాళిక అమలు చేయనున్నారు. సంకల్ప్ ప్రణాళిక ప్రకారం.. రోజూ ఉదయం 9.10 నుంచి 12.40 గంటల వరకు అన్ని సబ్జెక్టుల్లో బోధించని అంశాలను పూర్తి చేయాల్సి ఉంటుంది. మధ్యాహ్నం 1.20 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రివిజన్, ఇతర టెస్ట్‌లు విద్యార్ధులకు నిర్వహించాలి. డిసెంబరు 15 నుంచి 20 వరకు ప్రీఫైనల్ పరీక్షలు నిర్వహిస్తారు. ఆ తర్వాత డిసెంబరు 22 నుంచి ఫిబ్రవరి 20 వరకు స్పెషల్ క్లాసులు ఉంటాయి. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జూనియర్ కాలేజీల్లో ఈ ప్రణాళికను అమలు చేయాలని ఇంటర్ బోర్డు సూచించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2026 మార్చి 16 నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు విద్యాశాఖ ఇటీవల షెడ్యూలు కూడా విడుదల చేసింది. షెడ్యూలు ప్రకారం పరీక్షలకు వంద రోజులు సమయం ఉంది. ఇప్పటికే పరీక్ష కేంద్రాల ఎంపిక, అక్కడ ఉన్న వసతులపై విద్యాశాఖాధికారులు పరిశీలన చేశారు. అవసరమైన చోట వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నారు. గత ఏడాది ఆశించిన ఫలితాలు రాకపోవడంతో ఈసారి ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళుతున్నారు. దీంతో విద్యాశాఖ అధికారులు గతంలో కన్నా ఈ ఏడాది నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించేందుకు ప్రణాళికలు రూపొందించింది.
ప్రతీరోజు తెల్లవారుజామున 4 గంటలకే నిద్రలేచి చదువుకోవాలి. ఏ సబ్జెక్టు అయినా రెండు లేదా మూడు భాగాలుగా విభజించుకోవాలి. పరీక్ష గడువు కాలాన్ని బట్టి కొంత సమయం రివిజన్‌కు కేటాయించి, మిగిలిన వాటిని పాఠ్యాంశాలు చదవడానికి కేటాయించాలి. రోజూ 20 నిమిషాల పాటు ధ్యానం చేయాలి. గత పబ్లిక్ పరీక్షల ప్రశ్నపత్రాలు చదివి సాధన చేయాలి. చదివిన ప్రశ్నలను చూడకుండా రాయాలి. వేగంగా రాసే విధానం అలవాటు చేసుకోవాలి. బిట్‌పేపరుపై నిర్లక్ష్యం వదిలి క్షుణ్ణంగా చదవాలి. సందేహాలుంటే ఉపాధ్యాయులతో చర్చిస్తూ అనుమానాలు నివృత్తి చేసుకోవాలి.. ఈ మేరకు కార్యచరణతో వంద రోజుల ప్రణాళికను అన్ని పాఠశాలల్లో అమలు చేయాలని అధికారులు సూచించారు. అలాగే వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టిపెట్టి నూరు శాతం ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలని పేర్కొన్నారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.