AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్రెడిట్‌ కార్డ్‌ vs పర్సనల్‌ లోన్‌.. ఏది తక్కువ వడ్డీ! డబ్బు అవసరమైతే దేన్ని ఎంచుకోవాలి?

అనుకోని ఖర్చులు ఎదురైనప్పుడు వ్యక్తిగత రుణం, క్రెడిట్ కార్డ్ EMI రెండు ప్రత్యామ్నాయాలుగా కనిపిస్తాయి. అయితే, వడ్డీ రేట్లు, హిడెన్ ఛార్జీలు, చెల్లింపు నియంత్రణ, క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం, కాలపరిమితి వంటి అంశాలలో గణనీయమైన తేడాలున్నాయి. పెద్ద మొత్తాలకు, దీర్ఘకాల చెల్లింపులకు వ్యక్తిగత రుణం సాధారణంగా చౌకగా ఉంటుంది.

క్రెడిట్‌ కార్డ్‌ vs పర్సనల్‌ లోన్‌.. ఏది తక్కువ వడ్డీ! డబ్బు అవసరమైతే దేన్ని ఎంచుకోవాలి?
Personal Loan Vs Credit Car
SN Pasha
|

Updated on: Feb 25, 2026 | 6:00 AM

Share

అనుకోని ఖర్చులు ఎదురైనప్పుడు చాలా మంది ముందుగా ఆలోచించే రెండు మార్గాలు బ్యాంకు వ్యక్తిగత రుణం లేదా క్రెడిట్ కార్డ్ EMI. బయటకు చూస్తే రెండూ ఒకేలా కనిపించినా, వాస్తవానికి వాటి మధ్య ఖర్చు, ప్రభావం విషయంలో గణనీయమైన తేడాలు ఉన్నాయి. ముఖ్యంగా వడ్డీ రేట్లు, హిడెన్‌ ఛార్జీలు, చెల్లింపులపై నియంత్రణ అంశాలు వినియోగదారుల నిర్ణయాన్ని ప్రభావితం చేస్తున్నాయి.

ప్రస్తుతం మార్కెట్లో వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేట్లు సాధారణంగా 10 నుంచి 18 శాతం మధ్యలో ఉంటున్నాయి. మంచి క్రెడిట్ స్కోర్ ఉన్న వారికి ఇది ఇంకా తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇక క్రెడిట్ కార్డ్ EMIల విషయంలో బ్యాంకులు నో-కాస్ట్ EMI పేరుతో ఆఫర్లు ప్రకటించినప్పటికీ, వాస్తవ ఖర్చు తరచుగా ప్రాసెసింగ్ ఫీజులు లేదా తగ్గించిన డిస్కౌంట్ రూపంలో వినియోగదారుడిపై పడుతుంది. సాధారణ కార్డ్ EMIల వార్షిక వడ్డీ ప్రభావం 18 నుంచి 24 శాతం లేదా అంతకంటే ఎక్కువకు చేరే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

నెలవారీ బడ్జెట్ పరంగా కూడా ఈ రెండు ఎంపికలు భిన్నంగా పనిచేస్తాయి. వ్యక్తిగత రుణ EMIలు ఒకసారి నిర్ణయించాక స్థిరంగా కొనసాగుతాయి, క్రెడిట్ కార్డ్ లిమిట్‌పై ప్రభావం ఉండదు. కానీ కార్డ్ EMI తీసుకుంటే మీ అందుబాటులో ఉన్న క్రెడిట్ పరిమితి తగ్గిపోతుంది. అత్యవసర పరిస్థితుల్లో కార్డ్ వినియోగం కష్టమవుతుంది. పైగా EMI చెల్లింపులో ఆలస్యం జరిగితే భారీ లేట్ ఫీజులు, పెరిగిన వడ్డీ, క్రెడిట్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉంది.

కాలపరిమితి విషయంలో కూడా వ్యక్తిగత రుణాలు సాధారణంగా ఐదు సంవత్సరాల వరకు సౌకర్యాన్ని ఇస్తాయి. క్రెడిట్ కార్డ్ EMIలు ఎక్కువగా 6 నుంచి 24 నెలల మధ్యే పరిమితం అవుతాయి. దీంతో నెలవారీ భారం ఎక్కువగా అనిపించవచ్చు. ముందస్తు చెల్లింపులో కూడా వ్యక్తిగత రుణాలు కొంతవరకు సౌలభ్యం ఇస్తాయి. మొత్తంగా చూస్తే పెద్ద మొత్తాల ఖర్చులకు, దీర్ఘకాల చెల్లింపులకు వ్యక్తిగత రుణం సాధారణంగా చౌకగా, నియంత్రణలో ఉండే ఎంపికగా నిపుణులు సూచిస్తున్నారు. అయితే చిన్న మొత్తపు కొనుగోళ్లు, నిజమైన పారదర్శక నో-కాస్ట్ ఆఫర్లు ఉన్నప్పుడు మాత్రమే క్రెడిట్ కార్డ్ EMI ఉపయోగకరంగా ఉండొచ్చు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us