
నిత్యం లక్షల మంది ఇండియన్ రైల్వేస్‌లో ప్రయాణిస్తూ ఉంటారు. దూర ప్రాంతాలకు వెళ్లే పేద, మధ్యతరగతి వారికి రైలు ప్రయాణం ఆర్థికంగా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. చాలా తక్కువ టిక్కెట్ ధరతోనే దూర ప్రాంతాలకు ప్రయాణం చేయవచ్చు. అయితే ఉన్న ధరల్లో మరింత తగ్గింపు ఏకంగా 75 శాతం తగ్గింపు.. అంటే టిక్కెట్ ధర రూ.100 ఉంటే కేవలం రూ.25 చెల్లించి ప్రయాణం చేయవచ్చు. అలాంటి తగ్గింపు సౌకర్యం ఒక కార్డు ఉన్న వారికి మాత్రమే లభిస్తుంది. ఇంతకీ ఆ కార్డు ఏంటి? అది పొందేందుకు ఎవరు అర్హులు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
దివ్యాంగుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూనిక్ డిసేబిలిటీ ఐడీ (UDID) కార్డు అనేక ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలు, రాయితీలను ఒకే వేదికపై అందుబాటులోకి తీసుకువచ్చే కీలక గుర్తింపు పత్రంగా మారింది. ముఖ్యంగా భారతీయ రైల్వేలో ప్రయాణించే దివ్యాంగులకు టిక్కెట్ ఛార్జీలపై అందించే రాయితీలను పొందేందుకు ఈ కార్డు ఎంతో ఉపయోగపడుతోంది. చాలా మందికి ఈ కార్డు గురించి పూర్తి అవగాహన లేకపోవడంతో ప్రభుత్వ ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అమలులో ఉన్న UDID పథకం ద్వారా దేశవ్యాప్తంగా దివ్యాంగులకు ఒకే విధమైన గుర్తింపు కల్పించడమే ప్రధాన లక్ష్యం. ఈ కార్డులో లబ్ధిదారుడి వ్యక్తిగత వివరాలతో పాటు వైకల్యం రకం, శాతం వంటి సమాచారం నమోదు చేయబడుతుంది. దీంతో వేర్వేరు ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతిసారి వైకల్య ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సిన అవసరం తగ్గుతుంది.
భారతీయ రైల్వే దివ్యాంగులకు వారి వైకల్యం రకం, ప్రయాణించే తరగతిని బట్టి టిక్కెట్ ఛార్జీలపై రాయితీలు అందిస్తోంది. కొన్ని కేటగిరీల్లో ఈ రాయితీ 75 శాతం వరకు ఉండే అవకాశం ఉంది. అయితే ప్రతి ఒక్కరికీ ఒకే రకమైన రాయితీ వర్తించదు. అర్హత ప్రకారం రాయితీ నిర్ణయించబడుతుంది. ఆన్‌లైన్ టిక్కెట్ బుకింగ్ సమయంలో కూడా అవసరమైన వివరాలు నమోదు చేసి ఈ సౌకర్యాన్ని పొందవచ్చు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సాధారణంగా 40 శాతం లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారు UDID కార్డుకు అర్హులు. సంబంధిత వైద్య మండలి ధ్రువీకరణ అనంతరం కార్డు జారీ చేస్తారు. దరఖాస్తు కోసం ఆధార్ కార్డు లేదా ఇతర గుర్తింపు పత్రం, పాస్‌పోర్ట్ సైజు ఫోటో, నివాస ధ్రువీకరణ, మొబైల్ నంబర్, వైకల్య ధ్రువీకరణ పత్రం అవసరమవుతాయి. అవసరమైతే వైద్య పరీక్ష కూడా నిర్వహిస్తారు.
UDID కార్డు కోసం అధికారిక పోర్టల్‌లో ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు పరిశీలన పూర్తై ఆమోదం లభించిన తర్వాత కార్డు జారీ అవుతుంది. అనంతరం దానిని ఆన్‌లైన్‌లోనే డౌన్‌లోడ్ చేసుకునే సౌకర్యం కూడా ఉంది. రైల్వే రాయితీలతో పాటు స్కాలర్‌షిప్‌లు, సహాయక పరికరాలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, వివిధ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందేందుకు కూడా ఈ కార్డు ఉపయోగపడుతుంది. అందువల్ల అర్హులైన దివ్యాంగులు వీలైనంత త్వరగా UDID కార్డు పొందాలని అధికారులు సూచిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి