
ఈ ఏడాది కార్ల విక్రయాలు ఊపందుకున్నాయి. కంపెనీలు ప్రకటిస్తున్న ఆఫర్లతో పాటు అందరూ సొంత కార్లను కలిగి ఉండేందుకు ఆసక్తి చూపుతుండటంతో వీటి కొనుగోళ్లు పెరుగుతున్నాయి. సాధారణంగా కార్లలో తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు ఉన్నవి ఎక్కువ కొనుగోళ్లు చేస్తుంటారు. అయితే ఆసక్తికరంగా ఈ ఏడాది కాస్త ఎక్కువ ధరే ఉండే ఎస్‌యూవీ కార్ల సేల్స్ ఎక్కువగా జరిగాయి. ఇది వాహన కొనుగోలు దారుల్లో కనిపించిన అతి పెద్ద మార్పుగా మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. సేఫ్టీ, కంఫర్ట్ కోసం అధిక ధరను కూడా భరించడానికి వినియోగదారులు వెనుకాడటం లేదని దీని ద్వారా అర్థం అవుతోందని చెబుతున్నారు. ఈ క్రమంలో 2023 అక్టోబర్ లో జరిగిన సేల్స్ వివరాలను ఇప్పుడు చూద్దాం..
అక్టోబర్ 2023లో కూడా ఎప్పటిలాగానే మారుతి సుజుకీ కార్లే టాప్ సేల్స్ రాబట్టాయి. మారుతి సుజుకీ వ్యాగన్ ఆర్, స్విఫ్ట్ కార్లు మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. వ్యాగన్ ఆర్ 22,080 యూనిట్లు విక్రయించి 23శాతం వృద్ధి రేటు నమోదు చేసింది. 2022 అక్టోబర్లో 17,945 కార్లను మాత్రమే విక్రయించింది. అలాగే స్విఫ్ట్ 20,598 యూనిట్లను విక్రయించింది. 2022 అక్టోబర్లో , 17,231మాత్రమే విక్రయించింది. అంటే 20శాతం వృద్ధి రేటు నమోదు చేసింది. ఆ తర్వాతి స్థానంలో టాటా నెక్సాన్ ఉంది. ఇది 16,887 యూనిట్లను విక్రయించింది. అక్టోబర్ 2022లో 13,767 కార్లను విక్రయించి 23 శాతం వృద్ధిని నమోదు చేసింది.
మారుతి సుజుకి బాలెనో హ్యాచ్‌బ్యాక్, బ్రెజ్జా వరుసగా 16,594 యూనిట్లు, 16,050 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసి, ఆ తర్వాతి రెండు స్థానాలు సాధించాయి. బాలెనో 2022 అక్టోబర్లో 17,149 విక్రయాలు జరిగాయి. అంటే గతేడాది కంటే 3శాతం తక్కువ సేల్స జరిగాయి. మరోవైపు మారుతి సుజుకి బ్రెజ్జా 2022 అక్టోబర్లో 9,941 యూనిట్లు విక్రయాలు చేసి 61 శాతం వృద్ధిని సాధించింది,
ఆరో స్థానంలో టాటా పంచ్ ఉంది, ఆ తర్వాత మరో రెండు మారుతి సుజుకి మోడల్స్ డిజైర్, ఎర్టిగా ఉన్నాయి. టాటా గత నెలలో పంచ్ 15,317 యూనిట్లను విక్రయించగలిగింది. 2022లో 10,982 మాత్రమే చేయగా 39 శాతం వృద్ధిని నమోదైంది. మారుతి సుజుకి డిజైర్ 14,699, ఎర్టిగా 14,209 యూనిట్లను విక్రయించింది. ఈ కార్లు 2022 అక్టోబర్లో వరుసగా 12,321, 10,494 యూనిట్లను విక్రయించి 19శాతం, 35శాతం వృద్ధిని నమోదు చేశాయి.
మహీంద్రా స్కార్పియో 13,578 యూనిట్లను విక్రయించింది. 2022 అక్టోబర్లో 7,438 యూనిట్లను విక్రయించి 83 శాతం వృద్ధిని సాధించి తొమ్మిదో స్థానంలో నిలిచింది. టాప్ 10 అమ్మకాల వాహనాలలో చివరి రెండు వాహనాలు ఆసక్తికరంగా ఉన్నాయి. చివరగా, అక్టోబర్ 2023లో 13,077 యూనిట్లు విక్రయించబడిన హ్యుందాయ్ క్రెటా పదో స్థానంలో నిలిచింది. ఇది 2022లో 11,880 యూనిట్లను విక్రయించింది. అంటే 10శాతం వృద్ధి రేటు నమోదైంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..