Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bike insurance: బైక్ ఇన్సూరెన్స్‌తో బోలెడు ప్రయోజనాలు.. ఈ టిప్స్ పాటించడం మాత్రం మస్ట్

మన జీవితంలో ద్విచక్ర వాహనానికి అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. దాని కొనుగోలు వెనుక మంచి సందర్భం దాగి ఉంటుంది. ఆ బైక్ ను ఉద్యోగం వచ్చిన తర్వాత జీతంతో కొనుగోలు చేయవచ్చు, తల్లిదండ్రులు బహుమతిగా అందించవచ్చు. ఎంతో కష్టపడి ఒక్కో రూపాయిని కూడబెట్టి కొనవచ్చు. అలా కొనుగోలు చేసిన వాహనం ప్రమాదానికి గురైనా, దొంగలు చోరీ చేసినా ఆ బాధ వర్ణనాతీతం. కారణమేదైనా గానీ ద్విచక్ర వాహనాన్ని రక్షించుకోవడం చాలా అవసరం. ఇందుకోసం బీమా (ఇన్స్యూరెన్స్) ఎంతో ఉపయోగపడుతుంది.

Bike insurance: బైక్ ఇన్సూరెన్స్‌తో బోలెడు ప్రయోజనాలు.. ఈ టిప్స్ పాటించడం మాత్రం మస్ట్
Bike Insurance
Follow us
Srinu

|

Updated on: Nov 19, 2024 | 4:45 PM

బైక్ బీమా ప్రీమియాలు ఖరీదైనవిగా ఉంటాయి. ఈ కింద తెలిపిన చిట్కాలు పాటిస్తే బీమాపై డబ్బులను ఆదా చేసుకోవచ్చు. ఆన్ లైన్ లో బైక్ ఇన్స్యూరెన్స్ లను గమనించాలని నిపుణులు సూచిస్తున్నారు. మీరే ఇన్సూరెన్స్ మీరు కొత్తగా తీసుకుంటున్నా, ఉన్న దాన్ని రెన్యూవల్ చేసుకోవాలని చూస్తున్నా ఇది చాలా అవసరం. తద్వారా మీకు తక్కువ ప్రీమియానికి మంచి పాలసీ పొందే అవకాశం ఉంటుంది. వివిధ కంపెనీల బైక్ బీమాలను గమనించడం ద్వారా బెస్ట్ పాలసీ మీకు అందుబాటులోకి వస్తుంది. వివిధ బీమా ప్రొవైడర్లు పాలసీకి వివిధ ఫీచర్లు, యాడ్ ఆన్ లను అందజేస్తారు. అలాగే ఇంటర్నెట్ లో పాలసీని చూసినప్పుడు దాని రివ్యూలను కచ్చితంగా చదవాలి. ఆ బీమా సంస్థ గురించి స్పష్టమైన అవగాహన పెంచుకోవాలని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బైక్ ఇన్సూరెన్స్ తీసుకునే సమయంలో పాటించాల్సిన జాగ్రత్తల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

అధిక మినహాయింపు

బైక్ బీమా కవరేజ్ అమల్లోకి రావడానికి ముందు మీరు చెల్లించే మొత్తాన్ని మినహాయింపు అంటారు. ఉదాహరణకు రూ.500 మినహాయింపు ఎంచుకున్నారనుకోండి. రూ.2 వేలు నష్టపరిహారం పొందినప్పుడు మీరు రూ.500 చెల్లిస్తారు. మిగిలిన రూ.1500 బీమాదారు కవర్ చేస్తారు.

డ్రైవింగ్ రికార్డులు

మీ డ్రైవింగ్ రికార్డు సక్రమంగా, క్లీన్ గా ఉంటే తక్కువ ధరకు బీమా పొందవచ్చు. ఎటువంటి ప్రమాదాలు చేయని రైడర్లకు బీమా సంస్థలు ప్రాధాన్యం ఇస్తాయి. తక్కువ ధరకు బీమా అందించేందుకు ముందుకు వస్తాయి. కాబట్టి క్లీన్ డ్రైవింగ్ రికార్డు చాలా అవసరం.

ఇవి కూడా చదవండి

నో క్లెయిమ్ బోనస్ (ఎన్సీబీ)

పాలసీదారులకు బీమా కంపెనీలు అందించే ప్రోత్సాహక బహుమతినే ఎన్సీబీ అని చెప్పవచ్చు. పాలసీ తీసుకున్న ఏడాదిలో ఎటువంటి క్లెయిమ్ చేయకపోతే ఇది వర్తిస్తుంది. ఏటా ఈ రేటు పెరుగుతుంది. దీని వల్ల పాలసీ ప్రీమియాన్ని ఆదా చేసుకునే అవకాశం కలుగుతుంది. అంటే క్లెయిమ్ రహిత ఏడాదికీ ఇది పెరుగుతూనే ఉంటుంది.

యాంటి థెప్ట్ పరికరాలు

మోటారు సైకిల్ లో యాంటి థెప్ట్ పరికరాలను అమర్చడం వల్ల కూడా బీమా ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. వీటి వల్ల బైక్ చోరీకి గురయ్యే అవకాశం బాగా తక్కువగా ఉంటాయి. కాబట్టి బీమా కంపెనీలు తక్కువ ధరకే పాలసీలను అందించే అవకాశం ఉంది. జీపీఎస్ ట్రాకర్లు, డిస్క్ తాళాలు, అలారమ్ సిస్టమ్, గొలుసులు, తాళాలు, ఇమ్మొబిలైజర్లు వీటిలోకి వస్తాయి.

యాడ్ ఆన్ కవర్

బీమా తీసుకునేటప్పుడు వివిధ యాడ్ ఆన్ కవర్లను ఎంచుకోవాలి. జీరో డిప్రిసియేషన్ కవర్ ద్వారా మీకు బైక్ విడిభాగాల విలువను తిరిగి పొందుతారు. ఇండోర్ ప్రొటెక్షన్ కవర్ ద్వారా ఇంజిన్ లో నీరు చేరడం, ఆయిల్ లీకేజీ కారణంగా ఇంజిన్ కు కలిగే నష్టాన్ని కవర్ చేసుకోవచ్చు. వ్యక్తిగత ఆక్సిడెంట్ కవర్ ద్వారా ప్రమాదంలో సంభవించిన గాయాల విషయంలో భద్రత లభిస్తుంది.

సకాలంలో పునరుద్ధరణ

బైక్ పాలసీలను సకాలంలో పునరుద్దరించుకోవాలి. వాటిని ముందస్తుగా తీసుకుంటే సరైన కవరేజ్ అందుతుంది. అదనపు ఖర్చులను తగ్గించుకునే అవకాశం కలుగుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి