Income Tax: ఆ పెట్టుబడి పథకాలతో పన్ను ఆదా.. ప్రధాన తేడాలేంటో తెలిస్తే షాక్..!
భారతదేశంలో నిర్ణీత ఆదాయం దాటాక ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ పన్ను బాదుడు నుంచి రక్షణకు కొన్ని ప్రత్యేక పథకాలు సాయం చేస్తూ ఉంటాయి. దేశంలో నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్, ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్స్ పన్ను ఆదా చేసే పథకాలుగా ప్రజాదరణ పొందాయి. ఈ రెండూ స్థిర రాబడిని అందిస్తాయి. అలాగే ఆదాయపు పన్ను సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపును అందిస్తాయి.

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్, ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్స్ రెండూ 5 సంవత్సరాల లాక్-ఇన్ వ్యవధిని కలిగి ఉంటాయి. అయితే వివిధ వడ్డీ రేట్లు, చక్రవడ్డీ, పన్ను నియమాల కారణంగా వాటిపై మొత్తం రాబడి మారవచ్చు. జనవరి నుంచి మార్చి 2025 త్రైమాసికానికి ఎన్‌ఎస్‌సీ వడ్డీ రేటు సంవత్సరానికి 7.7 శాతంగా నిర్ణయించారు. మరోవైపు పెద్ద బ్యాంకులు పన్ను ఆదా చేసే ఎఫ్‌డీలపై 6.5 శాతం నుంచి 7.5 శాతం వరకు వడ్డీని అందిస్తున్నాయి. ఉదాహరణకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ 7 శాతం వడ్డీని, ఎస్‌బీఐ, పీఎన్‌బీ 6.5 శాతం, డీసీబీ బ్యాంక్ 8 శాతం, ఇండస్ఇండ్ బ్యాంక్, యెస్ బ్యాంక్ 7.25 శాతం వడ్డీని అందిస్తున్నాయి. ఏదైనా బ్యాంకునకు సంబంధించిన ఎఫ్‌డీ త్రైమాసిక కాంపౌండింగ్‌తో ఇస్తే దాని మొత్తం వార్షిక రాబడి ఎక్కువగా ఉండవచ్చు. ఉదాహరణకు త్రైమాసిక కాంపౌండింగ్‌తో 7.5 శాతం వార్షిక రేటుతో ఎఫ్‌డీ అందిస్తే వాస్తవ రాబడి 7.71 శాతం వరకు ఉండవచ్చు. ఇది ఎన్‌ఎస్‌సీ వడ్డీ రేటు 7.7 శాతానికి దాదాపు సమానంగా ఉంటుంది.
ఎన్ఎస్‌సీ
ఎన్ఎస్‌సీ పెట్టుబడి పెడితే టీడీఎస్ తగ్గించరు. అలాగే వార్షిక కాంపౌండింగ్, పరిపక్వతపై చెల్లింపు ఆధారంగా వడ్డీ ఇస్తారు. సెక్షన్ 80 సీ కింద రూ.1.5 లక్షల వరకు మినహాయింపు అందుబాటులో ఉంటుంది. అలాగే మొదటి 4 సంవత్సరాల వడ్డీని తిరిగి పెట్టుబడి పెట్టవచ్చు. సెక్షన్ 80సీ కింద పన్ను రహితంగా ఉంటుంది. ఐదో సంవత్సరం వడ్డీకి పన్ను విధిస్తారు. మీరు పన్ను ఆదాతో పాటు టీడీఎస్ మినహాయింపు ఎంపిక కోసం చూస్తుంటే ఎన్ఎస్‌సీ మంచి ఎంపికగా ఉంటుంది.
ఫిక్స్‌డ్ డిపాజిట్లు
ఫిక్స్‌డ్ డిపాజిట్లపై టీడీఎస్ వర్తిస్తుంది. సాధారణ పౌరులకు రూ.40,000 కంటే ఎక్కువ వడ్డీపై, సీనియర్ సిటిజన్లకు రూ.50,000 టీడీఎస్ మినహాయింపు వర్తిస్తుంది. 2025-26 నుంచి కొత్త పరిమితులు అంటే సాధారణ పౌరులకు రూ.50,000, సీనియర్ సిటిజన్లకు రూ.1,00,000 వరకు మినహాయింపు ఉంటుంది. సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల వరకు మినహాయింపు ఉంటుంది. అలాగే డీఐసీజీసీ ద్వారా రూ.5 లక్షల బీమా సౌకర్యం ఉంటుంది. బ్యాంక్ ఎఫ్‌డీ వార్షిక దిగుబడి ఎన్ఎస్‌సీ కంటే ఎక్కువగా ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








