AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Loan: మీరు బంగారంపై రుణం తీసుకుంటున్నారా? ఇప్పుడు అంత ఈజీ కాదు.. కొత్త రూల్స్‌!

Gold Loan: బంగారం ధర పెరిగింది కదా అని గోల్డ్‌ లోన్లు తీసుకుంటున్నారా? ఒక్క నిమషం ఆగండి. గోల్డ్‌ లోన్‌ తీసుకోవడం ఇక నుంచి అంత ఈజీ కాదు. ఇలా బంగారం తాకట్టు పెట్టి అలా లోన్‌ తీసుకోవడం కుదరదు. బంగారం ఎవరిదో ఆధారాలు చూపాలి. లోన్‌ ఎందుకో కచ్చితమైన కారణాలు చెప్పాలి..

Gold Loan: మీరు బంగారంపై రుణం తీసుకుంటున్నారా? ఇప్పుడు అంత ఈజీ కాదు.. కొత్త రూల్స్‌!
Subhash Goud
|

Updated on: Mar 07, 2025 | 8:14 AM

Share

బంగారం అంటే కేవలం అలంకార ప్రియం మాత్రమే కాదు.. ఆర్ధికంగా ఆదుకునే భరోసా కూడా. సామాన్యుల నమ్మకం ఇదే. కష్టం వస్తే గోల్డ్‌ లోన్‌తో గట్టెక్క వచ్చు అనుకునే వాళ్లకు గడ్డు కాలం రాబోతుంది. భద్రం అని బ్యాంకుల్లో బంగారం తాకట్టు పెడితే..బ్యాంకు సిబ్బంది చేతివాటంతో అసలుకే ఎసరు వస్తోంది. కస్టమర్లు తాకట్టు పెట్టిన బంగారాన్ని దారి మళ్లిస్తూ మోసాలకు పాల్పడిన బ్యాంకు సిబ్బంది వైనాలు ఇటీవల సంచలనం రేపాయి. మరోవైపు దేశవ్యాప్తంగా గోల్డ్‌ లోన్స్‌ అడ్డగోలుగా పెరుగుతోన్న క్రమంలో వీటన్నింటికీ కళ్లెం వేసేందుకు నిబంధనలను మరింత కఠినతరం చేసే దిశగా రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బిఐ) చర్యలు చేపట్టబోతుంది.

ఏ బ్యాంక్‌కు వెళ్లినా..ఏ ఫైనాన్షియల్‌ ఆఫీస్‌కు వెళ్లినా గంటలో అరగంటలో గోల్డ్‌లోన్‌ ఇవ్వబడును అని తాటికాయంత అక్షరాలతో ఆకర్షణీయపై ప్రకటనలు కన్పిస్తాయి. లోన్‌ మంజూరు కావాలంటే అప్రయిజర్లే కింగ్‌ మేకర్లు. బంగారాన్ని పరీక్షించి.. తూకం వేసి ఎంత రుణం ఇవ్వాలో నిర్ణయిస్తారు. అక్కడే మోసాలకు తెరలేస్తోంది. పైకం కొద్దీ లోన్‌ మంజరు చేయడం.. కొన్ని సార్లు గిల్టు నగలను తాకట్టు పెట్టి బ్యాంక్‌లను బురిడీ కొట్టించడం వంటి మోసాలు కొకొల్లుగా జరిగాయి. జరుగుతున్నాయి. ఇట్టాంటి వాటిని కట్టడి చేసేందుకు ఆర్‌బీఐ కొరడా ఝులిపించబోతుంది. లోన్‌ తీసుకునేది ఎవరు? తాకట్టు పెట్టే బంగారం వారిదేనా? అని ఆరా తీయడం సహా అందుకు సంబంధించిన ఆధారాలను విధిగా సమర్పించాలనే నిబంధన తీసుకురాబోతుంది ఆర్‌బీఐ.

గోల్డ్‌ లోన్‌ జారీ చేయాలంటే తాకట్టు బంగారం తమదేనని వినియోగదారులు కంపల్సరీగా ఆధారాలు ఇవ్వాలి. ఆధార్‌ కార్డ్‌, పాన్‌ కార్డ్‌ సహా కస్టమర్ల బ్యాంక్‌ గ్రౌండ్‌ను వెరీఫై చేసుకున్నాకే రుణాలు ఇవ్వాలని బ్యాంక్‌లకు ఆర్‌బీఐ ఆదేశాలు జారీ చేయబోతుందని తెలుస్తోంది.

ఇక నుంచి ఇలా బంగారం తాకట్టు పెట్టగానే అలా రుణం జారీ చేయడం ఉండదు. ఎవరు? ఏ అవసరం కోసం లోన్‌ తీసుకుంటున్నారు? తాకట్టు పెట్టే బంగారం వారిదేనా? ఇలాంటి వివరాలన్నింటిని విధిగా తీసుకోవడం సహా ఏ పర్సస్‌ కోసం లోన్‌ తీసుకుంటున్నారో.. అందుకోసమే నగదు వాడుతున్నారా? లేదా ?అని చెక్‌ చేసేలా విధివిధానాలు రాబోతున్నాయి. గోల్డ్‌ లోన్‌ తీసుకునే వారికి 20వేలకు మించి నగదు చేతికి ఇవ్వవద్దని, 20 వేలకు మించి బ్యాంక్‌ అకౌంట్‌ ద్వారా ట్రాన్సాక్షన్‌ జరగాలని ఇప్పటికే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ .. NBFCలను ఆదేశించింది ఆర్‌బీఐ.

గోల్డ్‌ లోన్‌ మంజూరు చేసే క్రమంలో బంగారం విలువ నిర్ధారణతో పాటు ప్రాసెసింగ్‌ రుసుములు, వడ్డీ విషయంలో వేర్వేరు పద్ధతులను ఆర్థిక సంస్థలు అనుసరిస్తున్నట్లు ఆర్‌బీఐ దృష్టికొచ్చింది. ఒకే పాన్‌కార్డుపై ఒకే ఏడాది అనేకమార్లు గోల్డ్‌ లోన్‌ చేయడం, డిఫాల్టర్లకు సమాచారం ఇవ్వకుండానే వారు తాకట్టు పెట్టిన బంగారాన్ని వేలం వేయడం వంటి అంశాలను ఆర్‌బీఐ తీవ్రంగా పరిగణించింది. వీటన్నింటిపై సెవన్‌మెన్‌ కమిటీని ఏర్పాటు చేసింది. 16 నెలల పాటు సదరు కమిటీ గోల్డ్‌ రుణాల్లో జరుగుతున్న అవకతవకలను క్షుణ్ణంగా పరిశీలించింది. కమిటీ నివేదిక ఆధారంగా గోల్డ్‌ లోన్స్‌పై స్పష్టమైన గైడ్‌లైన్స్‌ ఇవ్వాలని నిర్ణయించింది ఆర్‌బీఐ

హోం లోన్ల మాదిరిగానే గోల్డ్ లోన్లకు కూడా టాప్ అప్ లోన్ల ఇవ్వడం సహా ధర్డ్‌ పార్టీల జోక్యంపై ఆర్‌బీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. గోల్డ్‌ లోన్‌ విషయంలో బ్యాంకులు ఆర్ధిక సంస్థలు ఒకే తరహా విధానాలు పాటించడం లేదని గుర్తించింది. గోల్డ్‌ లోన్‌, రికవరీకి సంబంధించి బ్యాంకులు, ఇతరాత్ర ఆర్థిక సంస్థలన్నీ ఒకే తరహా విధివిధానాలు పాటించేలా చర్యలకు సిద్ధమవుతోంది ఆర్‌బిఐ. గోల్డ్‌లోన్‌ జారీ లో జరుగుతోన్న అవకతవకాలను అరికట్టడం సహా కస్టమర్ల ప్రయోజనాలను పరిరక్షించాలే కొత్త విధివిధానాలపై ఆర్‌బీఐ దృష్టిసారించింది.కొత్త గైడ్‌లైన్స్‌ త్వరలోనే అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి