Maruti Suzuki 800: కార్ల బుకింగ్‌కూ తత్కాల్ స్కీమ్.. దేశంలో 35 ఏళ్ల క్రితమే అమలు

సాధారణంగా తత్కాల్ అంటే ప్రజలకు రైలు టిక్కెట్ల బుకింగ్ టక్కున గుర్తుకొస్తుంది. తత్కాల్ స్కీమ్ అంటే సాధారణ వెయింటింగ్ లిస్ట్ కంటే నిర్ణీత టిక్కెట్లను రైలు బయలు దేరే 24 గంటల ముందు ఇస్తారు. అదే విధంగా దేశంలో 35 ఏళ్ల క్రితం ఓ కారు బుకింగ్‌కు తత్కాల్ స్కీమ్‌ను ప్రవేశపెట్టారు. ఆ కారు ఏంటి? ఆ స్కీమ్‌కు వచ్చిన ప్రజాదరణ వంటి విషయాలను తెలుసుకుందాం.

Maruti Suzuki 800: కార్ల బుకింగ్‌కూ తత్కాల్ స్కీమ్.. దేశంలో 35 ఏళ్ల క్రితమే అమలు
Maruti Suzuki 800

Updated on: Mar 13, 2025 | 4:30 PM

మారుతి సుజుకీ 800 వెర్షన్ కారుకు గతంలో ప్రత్యేకంగా తత్కాల్ వేరియంట్ లాంచ్ చేశారు. 1989-1990 లలో మారుతి సుజుకి 800 అధిక డిమాండ్ నేపథ్యంలో ఆ కంపెనీ ఈ ప్రత్యేకమైన వెర్షన్ రిలీజ్ చేసింది. దీర్ఘకాల కస్టమర్ నిరీక్షణ కాలాన్ని తగ్గించడానికి దీనిని భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టారు. మారుతి సుజుకి 800 కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు కొన్నిసార్లు చాలా నెలలు లేదా సంవత్సరాల వరకు వేచి ఉండాల్సి వచ్చేది. ఆ అవసరం లేకుండా ఫాస్ట్-ట్రాక్ లేదా ఇన్‌స్టంట్ డెలివరీ ఎంపికగా తత్కాల్ వేరియంట్ ప్రవేశపెట్టారు.  మారుతీ సుజుకీ 800 టీకే వేరియంట్ పేరుతో రిలీజ్ చేసిన ఈ కారు పొందాలంటే కస్టమర్లు రూ. 50,000 అధిక ధర చెల్లించాల్సి వచ్చేది. 

అయితే మారుతీ సుజుకీ టీకే వేరియంట్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేది కాదు. ఉత్పత్తి సామర్థ్యం ఆధారంగా కాలానుగుణంగా ప్రవేశపెట్టేరు. మారుతీ సుజుకీ 800 తత్కాల్ వేరియంట్ ప్రామాణిక మారుతి 800కి సమానంగా ఉంటుంది. తత్కాల్ పథకాన్ని మొదట స్టాండర్డ్ (ఎస్‌టీడీ) మోడల్ కోసం అందించారు. తరువాత డీలక్స్ (డీఎక్స్) వేరియంట్‌కు విస్తరించారు. మారుతీసుజుకీ టీకే వేరియంట్‌లో ఏసీ ఆప్షన్ కూడా ఉండేది. అయితే డీఎక్స్, ఎస్టీడీ వేరియంట్‌లు ఫాబ్రిక్ సీట్లు, డోర్ ట్రిమ్‌లు, స్ప్లిట్ రియర్ సీట్లు, లామినేటెడ్ విండ్‌షీల్డ్‌తో వచ్చాయి. తత్కాల్ వాహనాలను ప్రత్యేకంగా గుర్తించేలా బూట్ క్యాప్‌పై టీకే స్టిక్కర్ ఉండేది. మారుతీ సుజుకీ 800 కారు 796 సీసీ ఎఫ్8బీ ఇంజిన్‌తో వచ్చేది. అందువల్ల ఈ కారు 5,500 ఆర్‌పీఎం వద్ద 39.5 బీహెచ్‌పీ, 5000 ఆర్‌పీఎం వద్ద 59 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు 4-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఆధారంగా పని చేసేది. 

మారుతి సుజుకి 800 భారతదేశంలో మొట్టమొదటి సరసమైన ధరలో లాంచ్ చేసిన కారుగా ఉండేది. ఈ కారు బాగా ప్రజాదరణ పొందడంతో డిమాండ్ సరఫరాను మించిపోయింది. అందువల్ల కారు కొనుగోలు చేయాలనుకునే వారు ఎక్కువ కాలం వేచి ఉండాల్సి వచ్చింది. మారుతి 800 బుకింగ్‌లకు చాలా కాలంగా వెయిటింగ్ లిస్ట్‌లు ఉండటం వల్ల ప్రజలు తమ బుకింగ్ స్లాట్‌లను అధిక ధరకు అమ్మేసుకునే వారు. ఇలాంటి సమస్యకు పరిష్కారంగా తత్కాల్ వేరియంట్ లాంచ్ చేశారు. కాలక్రమేణ తత్కాల్ వేరియంట్ మారుతీ సుజుకీ నిలిపివేసింది. అయితే ఇప్పటికీ కార్ల బుకింగ్‌ల కోసం ఓ ప్రత్యేక తత్కాల్ వేరియంట్‌ను లాంచ్ చేసిన మోడల్‌గా మారుతీ సుజుకీ 800 నిలుస్తుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..