TATA Motors: రవాణా రంగానికి షాక్..వాణిజ్య వాహనాల ధరలు భారీగా పెరగనున్నాయి..టాటా ట్రక్కులు..పికప్ వ్యాన్‌లు మరింత ప్రియం!
మన దేశంలో అతిపెద్ద వాణిజ్య వాహనాల తయారీ సంస్థ షాకింగ్ న్యూస్ చెప్పింది. తమ వాణిజ్య వాహనాల ధరలను జనవరి 1 నుంచి 2.5 శాతం పరిధిలో పెంచనున్నట్లు ప్రకటించింది.
TATA Motors: మన దేశంలో అతిపెద్ద వాణిజ్య వాహనాల తయారీ సంస్థ షాకింగ్ న్యూస్ చెప్పింది. తమ వాణిజ్య వాహనాల ధరలను జనవరి 1 నుంచి 2.5 శాతం పరిధిలో పెంచనున్నట్లు ప్రకటించింది. మధ్యస్థ, భారీ వాణిజ్య వాహనాలు (M&HCV), ఇంటర్మీడియట్, తేలికపాటి వాణిజ్య వాహనాలు (I&LCV), చిన్న వాణిజ్య వాహనాలు (SCV) బస్సుల విభాగాలలో ధరల పెంపు వ్యక్తిగత మోడల్, వాహనం వేరియంట్ ఆధారంగా ఉంటుందని టాటా మోటార్స్ ఒక ప్రకటనలో తెలిపింది.
“ఉక్కు, అల్యూమినియం, ఇతర విలువైన లోహాలు వంటి వస్తువుల ధరల పెరుగుదల, ఇతర ముడి పదార్థాల అధిక ధరలతో పాటు, ఇతర ఖర్చులు కూడా పెరిగిపోవడం వాణిజ్య వాహనాల ధరల పెంపునకు కారణంగా మారింది” అని టాటా మోటార్స్ పేర్కొంది. వివిధ స్థాయిల తయారీలో పెరిగిన వ్యయాలలో గణనీయమైన భాగాన్ని కంపెనీ గ్రహిస్తుండగా, టాటా మోటార్స్ ఇలా చెప్పింది.. “మొత్తం ఇన్‌పుట్ ఖర్చులు బాగా పెరగడం వల్ల కొద్దిపాటి ధరల పెంపు ద్వారా కొంత పొందడం అత్యవసరం.”.
ఒక పక్క కరోనా ఇబ్బందులు. మరో పక్క ఇంధనాల ధరల పెరుగుదల ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇప్పుడు వీటికి తోడుగా అటు పాసెంజర్ వాహనాలు.. ఇటు కమర్షియల్ వాహనాల ధరలు కూడా పెరుగుతుండడం ప్రజలకు తీవ్ర ఇబ్బందులను కలిగించే అంశమే. ఇప్పటికే తమ వాహనాల ధరలు పెంచుతున్నట్టు దాదాపుగా అన్ని ఆటోమొబైల్ కంపెనీలు ప్రకటించాయి. ఈ నేపధ్యంలో కమర్షియల్ వాహనాల ధరలు పెరగడం మరింత భారంగా మారనుంది.
ఇదిలా ఉండగా సోమవారం, NSEలో టాటా మోటార్స్ షేర్లు 2.53% తగ్గి ₹467.95 వద్ద ముగిసింది. ఇక ఈ నెల ప్రారంభంలో మారుతీ సుజుకి కూడా వివిధ ఇన్‌పుట్ ఖర్చుల పెరుగుదల కారణంగా జనవరి 2022లో ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. వివిధ మోడళ్లపై ధరల పెంపు మారుతుందని కంపెనీ తెలిపింది. హోండా, రెనాల్ట్ కూడా పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చుల ప్రభావాన్ని తగ్గించడానికి వచ్చే ఏడాది జనవరి నుండి వాహనాల ధరలను పెంచాలని చూస్తున్నాయి. మరోవైపు, పెరుగుతున్న ఇన్‌పుట్, కార్యాచరణ ఖర్చుల కారణంగా జనవరి 1 నుండి దాని ధరల పెరుగుదల మొత్తం మోడల్ శ్రేణిలో 3% వరకు ఉంటుందని ఆడి తెలిపింది.
ఇవి కూడా చదవండి: Gaming Experience: స్మార్ట్‌ఫోన్‌లో గేమ్స్ ఆడటం సరదానా.. మంచి గేమింగ్ అనుభవం కోసం ఎటువంటి ఫీచర్లు ఉన్న ఫోన్ కొనాలంటే..