Indian Railways: రైలు ప్రయాణం అంటే ఆలస్యమవుతుందని అందరికి తెలిసిందే. రైలు అంటేనే ఆలస్యంగా చేరుకుంటాయి తప్ప.. ముందుగా చేరుకున్న దాఖలాలు ఎక్కడా లేవు. రైలును నమ్ముకుని ప్రయాణం చేస్తే ఎంత ఆలస్యం అవుతుందో తెలియని పరిస్థితి. సమయానికి చేరకున్న ఘటనలు చాలా అరుదు అనే చెప్పాలి. చాలా సార్లు రైళ్లు ఆలస్యం కావడం వల్ల ముఖ్యమైన పనులు చేయలేకపోతుంటాము. ఆలస్యమైనా సర్దుకుని పోతుంటాం. కానీ ఓ వ్యక్తి అలా ఊరుకోలేదు. రైలు ఆలస్యంపై దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు.
వివరాల్లోకి వెళితే.. కశ్మీర్‌కు చెందిన సంజయ్ శుక్లా అనే వ్యక్తి జమ్మూ నుంచి శ్రీనగర్‌కు వినానం బుక్ చేసుకున్నాడు. ఈ వినానం అందుకోవాలంటే మధ్యాహ్నం 12 గంటలకు జమ్మూ విమానాశ్రయాన్ని చేరుకోవాలి. కానీ అతను ఎక్కిన రైలు ఉదయం 8.10 గంటలకు జమ్మూకు రావాల్సి ఉంది. కానీ మధ్యాహ్నం 12 గంటలకు గానీ ఆ రైలు చేరుకోలేదు. దీంతో సంజయ్ శుక్లా తన విమానం మిస్ అయ్యాడు. దీంతో దాదాపు రూ.15000 చెల్లించి ప్రత్యేక కారులో ప్రయాణించి శ్రీనగర్‌కు చేరుకున్నాడు. వేళ కాని వేళ చేరుకోవడం వల్ల అక్కడ హోటల్‌లో బస చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సంఘటన జూన్ 11, 2016లో జరిగింది. రైలు ఆలస్యం వల్ల తనకు కలిగిన నష్టంపై ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించాడు.
రైల్వే శాఖ తరపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భట్టి వాధించారు. ఇండియన్ రైల్వే కాన్ఫరెన్స్ అసోసియేషన్ కోచింగ్ టారిఫ్ నంబర్ 26, పార్ట్ 1, వాల్యూమ్ 1, రూల్ 114, 115 ప్రకారం.. రైలు ఆలస్యానికి ఎటువంటి పరిహారం అందివ్వాల్సిన అవసరం లేదంటూ కోర్టుకు విన్నవించారు. రైల్వే తరఫున సోలిసిటర్ వినిపించిన వాదనను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. వినియోగదారుడి సమయానికి వెల కట్టలేమని వ్యాఖ్యానించింది. రైలు ఆలస్యానికి ఎవరో ఒకరు బాధ్యత వహించాల్సిందేనని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. అంతేకాదు జవాబుదారి తనం ఉండాలని న్యాయస్థానం సూచించింది. ఇలా రైళ్లు ఆలస్యంగా నడిపిప్తూ బాధ్యతారహిత్యంగా వ్యవహరిస్తే ప్రైవేటు ఆపరేటర్ల నుంచి వచ్చే పోటీని తట్టుకోలేరంటూ కోర్టు హెచ్చరించింది.
నిర్దేశించిన సమయానికి రైలును గమస్థానం చేర్చలేకపోయినందుకు రైల్వేశాఖపై మండిపడింది సుప్రీం కోర్టు. రైలు ఆలస్యం కారణంగా నష్టపోయిన సంజీవ్ శుక్లాకు పరిహారంగా రూ. 30,000లను 9 శాతం వడ్డీతో చెల్లించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.