
ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఆయన ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉంటూ వివిధ సమస్యలపై తనదైన శైలిలో అభిప్రాయాలను పంచుకుంటూ ఉంటారు. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించే, ప్రేరేపించే స్ఫూర్తిదాయకమైన వీడియోలను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. ఆయన పోస్టులు, వీడియోలు జీవితం పట్ల మన దృక్పథాన్ని మార్చేవిగా ఉంటాయి. ఈ క్రమంలో ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో షేర్ చేసిన కొన్ని బెస్ట్ వర్క్ సలహాలను ఇక్కడ తెలుసుకుందాం..
ఈ ఏడాది జనవరిలో ఆనంద్ మహీంద్రా X లో MondayMotivation పేరిట ఓ ట్వీట్ చేసారు. ఇందులో తన బాల్యంలో బ్యాక్‌ఫ్లిప్‌లు నేర్చుకున్న అనుభవాన్ని వివరించారు. ఈ అనుభవం నుంచి తాను గొప్ప జీవిత పాఠాన్ని ఎలా నేర్చుకున్నాడో నెటిజన్లతో పంచుకున్నారు. తన చిన్నతనంలో బ్యాక్‌ఫ్లిప్‌లు నేర్చుకునే సహజమైన నైపుణ్యాలు తనకు లేవని మొదట్లో అనుకున్నానని, దానిని నేర్చుకోవడం దాదాపుగా అసాధ్యంగా భావించినట్లు చెప్పాడు. కానీ సాధన, స్థిరమైన ప్రయత్నాలతో చివరకు దానిని నేర్చుకోగలిగినట్లు తెలిపాడు. విజయం సాధించడానికి ఎల్లప్పుడూ స్థిరమైన సాధన అవసరమని ఆయన చెప్పారు. సరైన పద్ధతితో సాధన చేస్తే అసాధ్యంగా అనిపించే పనులు కూడా సాధించగలమని తన ట్వీట్‌లో గొప్ప జీవిత పాఠాన్ని తన అనుభవాలతో జోడించి పంచుకున్నారు.
వారానికి 70, 90, 120 గంటల పని, పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ గురించి నిత్యం చర్చలు జరుగుతుంటాయి. దీనిపై ఆనంద్ మహీంద్రా ఇటీవల తన అభిప్రాయాలను పంచుకున్నారు. పని ఎన్ని గంటలు చేస్తామనే దానికంటే.. ఆ పని అవుట్‌పుట్ ప్రభావంపై దృష్టి పెట్టాలని తాను గట్టిగా విశ్వసిస్తానని మహీంద్రా అన్నారు. ఇటీవల విక్షిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2025లో ఈ విషయంపై మహీంద్రా మాట్లాడుతూ.. 48, 40 గంటల, 70 గంటల గురించి.. 90 గంటల గురించి కాదు.. ఇలా పని గంటలపై చర్చ తప్పు దిశలో ఉందని నేను భావిస్తున్నాను. నా ఉద్దేశ్యం ఏమిటంటే మనం వర్క్ క్వాలిటీపై దృష్టి పెట్టాలి. వర్క్ క్వాంటిటీపై కాదు.
మహీంద్రా చక్కటి జీవితాన్ని ఎలా గడపాలి? దాని ప్రాముఖ్యత ఏమిటి? అనే విషయాల గురించి మాట్లాడుతూ.. జీవితమంటే కేవలం పనిపై మాత్రమే దృష్టి పెట్టడం కాదు. బదులుగా కళలు, సంస్కృతితో సహా వివిధ రంగాలపై కూడా అవగాహన కలిగి ఉండాలని ఆయన అన్నారు. ఇది జీవితంలో మంచి నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది. మీ మనస్సు ఆహ్లాదంగా ఉన్నప్పుడు కళలు, సంస్కృతి గురించి మీకు అవగాహన ఉన్నప్పుడు.. మీరు మంచి నిర్ణయాలు తీసుకుంటారని అన్నారు.
కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడపడం, దాని ప్రాముఖ్యత, పని-జీవిత సమతుల్యత ఆవశ్యకత గురించి ఆనంద్ మహీంద్రా తన అభిప్రాయాలను పంచుకుంటూ.. కుటుంబం, స్నేహితులతో సమయం గడపడం వల్ల మీరు మరింత సృజనాత్మకంగా, మంచి నాయకుడిగా ఉండగలరని మహీంద్రా అన్నారు. ఎప్పుడూ ఆఫీసులో మాత్రమే ఉంటే కుటుంబంతో గడపలేం. మన ఫ్యామిలీలోని మనవాళ్లు ఏం కావాలో, ఏం చేయాలనుకుంటున్నారో మనం ఎలా అర్థం చేసుకుంటాం? అని ఆయన అన్నారు.
ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారని ప్రతి ఒక్కరికీ తెలుసు. అయితే ఓ యూజర్ మీరు సోషల్ మీడియాలో ఎంత సమయం గడుపుతారు? అని ప్రశ్నించగా.. మహీంద్రా ఆసక్తికరమైన సమాధానమిచ్చారు. ‘నేను ప్రస్తుతం Xలో ఉన్నాను. ఒంటరిగా ఉన్నాను కాబట్టి అనికాదు. నా భార్య అద్భుతమైనది. నేను ఆమెతో సమయం గడపడం ఇష్టపడతాను.
కేవలం స్నేహితులను సంపాదించడానికి నేను సోషల్ మీడియాలో ఉండటం లేదు. ఇది ఎంత శక్తివంతమైన వ్యాపార సాధనమో జనాలు గ్రహించడం లేదు. నేను ఒక వేదికపై ఉన్నాను. ఇక్కడ 11 మిలియన్ల మంది నుంచి అభిప్రాయాలను పొందగలను’ అంటూ తాను అసలు సోషల్ మీడియాను ఏ కోణంలో చూస్తారో, ఎందుకు దాన్ని వాడుతున్నారో ఒక్కమాటలో తేల్చేశారు.
మరిన్ని బిజినెస్ కథనాల కోసం క్లిక్ చేయండి.