SBI Alert: దేశీయ అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో జూలై 1వ తేదీ నుంచి పలు నిబంధనలు మారనున్నాయి. కొత్తగా మారే నిబంధనలు వినియోగదారులు తప్పకుండా తెలుసుకోవాల్సిందే. దీంతో ఈ నిబంధనలు చాలా మంది కస్టమర్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎస్‌బీఐలో అనేక రూల్స్ మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ఎస్‌బీఐలో ఖాతాలు ఉన్నవారు ఎప్పటికప్పుడు బ్యాంకు తీసుకువస్తున్న నిబంధనలను తెలుసుకోవడం మంచిది. లేకపోతే ఇబ్బందులు పడే అవకాశాలుంటాయి. వినియోగదారులపై ఛార్జీలు విధించడం, తగ్గించడం, ఇతర లావాదేవీల విషయాలలో అనేక మార్పులు చేస్తుంటుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇందులో భాగంగానే జూలై నుంచి కొత్త నిబంధనలు మారనున్నాయి. ఎస్‌బీఐ బేసిక్ సేవింగ్స్ అకౌంట్ సర్వీసు ఛార్జీలను సవరించింది ఎస్‌బీఐ. బ్యాంక్ నగదు ఉపసంహరణ, ఏటీఎం విత్‌డ్రాయల్స్, చెక్ బుక్స్, ట్రాన్స్‌ఫర్, నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లకు సవరించిన కొత్త సర్వీస్ చార్జీలు జూలై 1 నుంచి వర్తిస్తాయని బ్యాంకు వెల్లడించింది.
నెలలో నాలుగు ఉచిత నగదు లావాదేవీలు ఉపసంహరణ ముగిసిన తర్వాత ఒక్కో లావాదేవీకి రూ.15 ఛార్జీ విధించనుంది. అలాగే జీఎస్‌టీ అదనం. బ్యాంక్ బ్రాంచ్ లేదా ఏటీఎం క్యాష్ విత్‌డ్రాయెల్స్ రెండింటికీ ఇదే ఛార్జీలు పడతాయి.
ఇక ఎస్‌బీఐ ఒక ఆర్థిక సంవత్సరంలో 10 చెక్ లీవ్స్‌ను ఉచితంగా అందిస్తుంది. వీటి తర్వాత 10 చెక్ లీవ్స్‌కు రూ.40 ఛార్జీ పడుతుంది. అలాగే జీఎస్‌టీ అదనం. 25 చెక్ లీవ్స్‌కు అయితే రూ.75 చార్జీ, జీఎస్‌టీ చెల్లించాల్సి ఉంటుంది. ఎమర్జెన్సీ చెక్ బుక్ (10 చెక్ లీవ్స్) కోసం అయితే రూ.50 ఛార్జీతోపాటు జీఎస్‌టీ పడుతుంది.
గృహరహిత శాఖలలో వినియోగదారులు నగదు ఉపసంహరించుకునేందుకు పరిమితిని ఇటీవల పెంచింది ఎస్‌బీఐ. కరోనా మహమ్మారిలో మా కస్టమర్లకు మద్దతు ఇవ్వడానికి ఎస్‌బీఐ చెక్, ఉపసంహరణ ఫారం ద్వారా గృహేతర నగదు ఉపసంహరణ పరిమితిని పెంచుతున్నట్లు ఎస్బీఐ ప్రకటించింది. చెక్‌ను ఉపయోగించి నగదు ఉపసంహరణను రోజుకు లక్ష రూపాయల వరకు పెంచింది. అలాగే సేవింగ్స్, పాస్‌బుక్‌తో పాటు ఫారమ్‌ను ఉపయోగించి నగదు ఉపసంహరణను రోజుకు రూ.25 వేలకు పెంచారు.