Crab Farming: ఆక్వారంగంలో లాభాలను తెచ్చిపెడుతున్న పీతల పెంపకం.. ఈజీగా ఎలా పెంచాలంటే
Crab Farming: రొయ్యల పెంపకం తర్వాత అంత లాభాలను తెచ్చి పెట్టేవి పీతలు. వీటిని పెంచడం గతంలో కొంచెం కష్టమైన పని అయినా ఇప్పుడు ఆధునిక పద్ధతిలో ఆక్వా సాగు చేస్తున్నారు..
Crab Farming: రొయ్యల పెంపకం తర్వాత అంత లాభాలను తెచ్చి పెట్టేవి పీతలు పెంపకం. వీటిని పెంచడం గతంలో కొంచెం కష్టమైన పని అయినా ఇప్పుడు ఆధునిక పద్ధతిలో ఆక్వా సాగు చేస్తున్నారు. పీతలను ప్రత్యేకంగా తయారు చేసిన బాక్సుల్లో పెంచుతున్నారు. ఈ బాక్సుల్లో పీతల పెంపకం కారణంగా పీతల పెరుగుదలను గమనిస్తూ.. వాటికి ఆహారం పెట్టేందుకు వీలుంటుంది.తద్వారా వీటి దిగుబడి కూడా మంచి లాభసాటిగానే ఉంటుంది. అందుకనే ఇప్పుడు ఎక్కువమంది రొయ్యల సాగుకంటే పీతల పెంపకంపై మక్కువ చూపిస్తున్నారు. నిజానికి ఆక్వా రంగంలో చేపల తర్వాత స్థానం రొయ్యలు, పీతలదే.. వీటిని విదేశాలకు ఎగుమతి చేసి.. మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. అయితే నిన్నా మొన్నటి వరకూ పీతలను చెరువుల్లో పెంచేవారు.. అప్పుడు కొంచెం కష్టపడాల్సి వచ్చేది. అండ్ రిస్క్ కూడా ఎక్కువగా ఉండేది. ఎందుకంటే పీతల్లో స్వజాతి భక్షణ లక్షణం అధికం.. అంటే బలమైన పీత బలహీనంగా ఉన్న పీతను తినేస్తుంది. అందువలన చెరువుల్లో వేసిన పీతలు కొన్ని మాత్రమే పెరిగి పెద్దవి అవుతున్నాయి. దీంతో లాభాలు తక్కువగా వచ్చేవి. అయితే కాలంతో పాటు పరిస్థితులు మారాయి. సరికొత్త టెక్నాలజీతో పీతలను సరికొత్త పద్ధతిలో పెంచుతున్నారు. పీతల సాగులో నూతన సాంకేతిక పరిజ్ఞానం రావడంతో వీటి సాగుకు మొగ్గుచూపుతున్నారు.
రొయ్యలు మాదిరిగానే పీతపిల్లలను కూడా ఎంపిక చేసిన చెరువుల్లో సాగు చేయడం ఆనవాయితీగా వస్తోంది. కొత్త పద్ధతిలో చెరువులో పీవీసీ పైపు గొట్టాలతో ప్రత్యేక నిర్మాణాలు చేపడతారు. ఆ గొట్టాలకు పెట్టెలను అమర్చుతారు. ఒక్కో పెట్టెలో ఒక పీతను వదులుతారు. నీటిలో తేలి ఉండటం వల్ల ఆ బాక్సుల్లో తిరుగుతూ వేసిన ఆహారాన్ని పీతలు తింటాయి. దీని వల్ల ఒక పీత మరో పీతను తినడం అనే సమస్య ఉండదు. అంతే కాదు ప్రతిరోజు పెట్టెలను తెరిచి పీత ఎదుగుదల ఎలా ఉందో పరీక్షించుకుని దానికి అనుగుణంగా సాగు చేస్తూ లాభాలను ఆర్జిస్తున్నారు.
అయితే పీతల సాగు రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి విత్తనం ద్వారా చేపట్టే కల్చర్. రెండవది గుల్ల విడిచిన పీతలను సేకరించి షెల్ గట్టిపడే వరకు పెంచే పద్ధతి. దీన్ని ఫాటనింగ్ అంటారు. హేచరీల నుంచి పిల్లను 50 నుండి 100 గ్రాముల సైజులో కొనుగోలు చేసి కల్చర్ చేపడితే దాదాపు సంవత్సరం పాటు పీతలను పెంచాల్సి వుంటుంది. అదేవిధంగా గుల్లవిడిచిన పెద్ద సైజు పీతలను జాలరుల నుండి కొనుగోలుచేసి, రెండు మూడు నెలలపాటు చెరువులో పెంచి శరీరంపై పెంకు గట్టి పడిన దశలో మార్కెట్ చేస్తుంటారు.
పీతలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అంతర్జాతీయంగానే కాకుండా దేశవాళీ మార్కెట్లో కూడా పీత ఎంతో ఖరీదైంది. కనుక పీతల పెంపకానికి ఆధునిక పద్దతిని జోడించి పెంచితే మంచి లాభాలను ఆర్జించవచ్చు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని సముద్రతీరం పీతల సాగుకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఈ దిశగా ప్రభుత్వం ఆలోచించాలని ఆక్వా రైతులు కోరుతున్నారు. ప్రభుత్వం రాయితీలు ఇచ్చే ప్రోత్సహిస్తే.. రొయ్యల సాగులాగే పీతలు కూడా కాసుల పంట పండిస్తోంది.
Also Read: Couples: హిందూ సంప్రదాయంలో ఈ ఐదు జంటల్లా నేటి భర్త భర్తలుంటారట.. ఈ జంటల్లో మీరున్నారా తెలుసుకోండి