Business Idea: కాస్త పెట్టుబడి పెట్టగలిగితే ప్రతి నెలా రూ.5 లక్షల సంపాదన! అలాగే 10 మందికి ఉపాధి ఇవ్వొచ్చు
పెట్రోల్ పంప్ వ్యాపారం నేడు అధిక లాభాలు గడించే సురక్షితమైన మార్గం. దీనికి అవసరమైన పెట్టుబడి, అర్హతలు, భూమి, దరఖాస్తు ప్రక్రియ వంటి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్తాన్ పెట్రోలియం వంటి కంపెనీల డీలర్‌షిప్ పొంది, సరైన ప్రదేశంలో పంప్ ఏర్పాటు చేస్తే నెలకు రూ.5 లక్షల వరకు ఆదాయం సంపాదించవచ్చు.

ప్రతిరోజూ పెద్ద మొత్తంలో సంపాదించే వ్యాపారాన్ని ప్రారంభించాలని చాలా మందికి ఉంటుంది. కానీ, అది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే పెద్ద ఎత్తున బిజినెస్ పెట్టేందుకు అందరి వద్ద కావాల్సినంత పెట్టుబడి ఉండదు. కానీ అవకాశం ఉన్నవాళ్లు సరైన చోట పెట్టుబడి పెడితే మాత్రం వారి వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయల్లా సాగిపోతుంది. ఇప్పుడు అలాంటి ఓ బిజినెస్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. కాస్త పెట్టుబడి పెట్టే స్థోమత ఉంటే పెట్రోల్ పంప్ తెరవడం ఒక అద్భుతమైన ఎంపిక. దేశంలో వాహనాల సంఖ్య వేగంగా పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ డిమాండ్ ఎప్పుడూ తగ్గదు. అందుకే పెట్రోల్ పంప్ వ్యాపారం నేటికీ చాలా సురక్షితమైనది, లాభదాయకంగా పరిగణించవచ్చు. అయితే ఈ వ్యాపారాన్ని ప్రారంభించే ముందు, పెట్రోల్ పంపును ఎలా తెరవాలి, దానికి ఎంత ఖర్చవుతుంది? దాని నుండి ఎంత డబ్బు సంపాదించవచ్చో అనేది తెలుసుకోవడం ముఖ్యం.
పెట్రోల్ పంపు తెరవడానికి కొన్ని తప్పనిసరి షరతులు ఉన్నాయి. దరఖాస్తుదారుడు కనీసం 21 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. భారత పౌరుడు అయి ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో గ్రాడ్యుయేషన్, గ్రామీణ ప్రాంతాలకు ఇది 10 లేదా 12వ తరగతి పాస్ అయి ఉండాలి. అదనంగా మీకు నిర్దేశించిన విధంగా కనీస మూలధనం, భూమి కూడా ఉండాలి. దీనితో పాటు దరఖాస్తుదారునికి ఎటువంటి నేర చరిత్ర ఉండకూడదు. పెట్రోల్ పంపు తెరవడానికి భూమి అత్యంత ముఖ్యమైన అవసరం. పెట్రోల్ పంపుకు అవసరమైన భూమి పరిమాణం దాని స్థానాన్ని బట్టి ఉంటుంది. హైవేపై ఉన్న పెట్రోల్ పంపుకు సాధారణంగా సుమారు 1200 నుండి 1600 చదరపు మీటర్ల భూమి అవసరం, అయితే ఒక నగరం లేదా పట్టణంలో ఈ అవసరం దాదాపు 800 నుండి 1000 చదరపు మీటర్లు ఉండవచ్చు.
ఆ భూమిని సొంతంగా కలిగి ఉండొచ్చు లేదా లీజుకు అయినా తీసుకోవచ్చు. మంచి ప్రదేశం ఉంటే పెట్రోల్, డీజిల్ అమ్మకాలు అంత ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సరైన స్థలాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఆ భూమి ఎలాంటి చట్టపరమైన వివాదాల నుండి విముక్తి పొందిందని గుర్తుంచుకోవాలి. ఇండియన్ ఆయిల్ (IOCL), భారత్ పెట్రోలియం (BPCL), హిందుస్తాన్ పెట్రోలియం (HPCL) వంటి చమురు కంపెనీలు భారతదేశంలో పెట్రోల్ పంపులను తెరవడానికి కాలానుగుణంగా ప్రకటనలు జారీ చేస్తాయి. దీని కోసం దరఖాస్తులు ఆన్‌లైన్‌లో చేయబడతాయి. దరఖాస్తుదారులను లాటరీ లేదా మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపిక తర్వాత కంపెనీ ప్రాంగణాన్ని తనిఖీ చేస్తుంది, అవసరమైన పత్రాలను ధృవీకరిస్తుంది, పెట్రోల్ పంపును నడపడానికి శిక్షణను అందిస్తుంది.
పెట్రోల్ పంపు తెరవడానికి అయ్యే మొత్తం ఖర్చు దాని స్థానాన్ని బట్టి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో పెట్రోల్ పంపు ప్రారంభించడానికి అయ్యే ఖర్చు సాధారణంగా రూ.15 నుండి రూ.25 లక్షల మధ్య ఉంటుంది, పట్టణ ప్రాంతాల్లో ఈ ఖర్చు సుమారు రూ.30 నుండి రూ.50 లక్షల వరకు పెరుగుతుంది. హైవేపై పెట్రోల్ పంపు తెరవడానికి అత్యధిక పెట్టుబడి అవసరం, ఇక్కడ ఖర్చు రూ.50 నుండి రూ.1 కోటి వరకు ఉంటుంది. ఈ మొత్తం ఖర్చులో సెక్యూరిటీ డిపాజిట్, స్టోరేజ్ ట్యాంక్, యంత్రాలు, షెడ్, కార్యాలయం, ప్రాథమిక మౌలిక సదుపాయాలు ఉన్నాయి. సరైన ప్లేస్‌లో మీ పెట్రోల్ బంక్ ఉంటే మాత్రం నెలకు రూ.5 లక్షల సంపాదన ఉంటుంది. అలాగే బంక్‌లో పని చేసేందుకు ఓ 10 మందికి జీవనోపాధి కల్పించే అవకాశం కూడా ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
