Central Government: కొత్త వడ్డీ రేట్లను ప్రకటించిన కేంద్రం.. పొదుపు పథకాల్లో చేరినవారికి ఊరట..
కేంద్ర ప్రభుత్వం అక్టోబర్-డిసెంబర్ క్వార్టర్ కోసం చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను ప్రకటించింది. సుకన్య సమృద్ధి యోజనపై 8.20 శాతం, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్స్‌పై 8.2 శాతం, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్‌పై 7.7 శాతం, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌పై 7.1 శాతం వడ్డీ కొనసాగుతాయి. వచ్చే మూడు నెలల పాటు ఈ రేట్లు అమలులో ఉంటాయి

కేంద్ర ప్రభుత్వం చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లపై కీలక ప్రకటన చేసింది. కొత్త వడ్డీ రేట్లను తాజాగా ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం అనేక పొదుపు పథకాలను ప్రవేశపెట్టింది. వీటిల్లో కోట్లాది మంది తమ పెట్టుబడులు పెడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం పథకాలు కావడంతో తమ డబ్బులు భద్రంగా ఉంటాయనే కారణంతో ఎక్కువమంది వీటిల్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అయితే సేవింగ్స్ పథకాలకు గురించి కేంద్రం ఎప్పటికప్పుడు కొత్త వడ్డీ రేట్లను ప్రకటిస్తూ ఉంటుంది. ప్రతీ మూడు నెలలకు ఒకసారి వడ్డీ రేట్లపై ప్రకటన చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా అక్టోబర్-డిసెంబర్ 2026 క్వార్టర్ కోసం కొత్త వడ్డీ రేట్లను ఖరారు చేసింది. వచ్చే మూడు నెలలకు సంబంధించి వడ్డీ రేట్లు యధావిధిగా కొనసాగుతాయని ప్రభుత్వం ప్రకటించింది.
వివిధ పథకాలకు వర్తించే వడ్డీ రేట్లను కేంద్రం యథాతధంగా ఉంచుతున్నట్లు ప్రకటన జారీ చేసింది. సుకన్య సమృద్ధి యోజనపై 8.20 శాతం వడ్డీ రేటు కొనసాగుతుంది. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్స్‌పై 8.2 శాతం వడ్డీ లభిస్తుంది. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్‌పై 7.7 శాతం, మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌పై 7.4 శాతం వడ్డీ రేట్లు వర్తిస్తాయి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) స్కీమ్‌పై 7.1 శాతం వడ్డీని కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది. వీటితో పాటు పోస్టల్ మూడేళ్ల టైమ్ డిపాజిట్‌పై కూడా 7.1 శాతం వడ్డీ రేటు అమలులో ఉంటుంది. ఈ రేట్లు అక్టోబర్ 1,2026 నుండి డిసెంబర్ 31, 2026 వరకు మూడు నెలల పాటు వర్తిస్తాయి. చిన్న పొదుపు పథకాల్లో పెట్టుబడులు పెట్టేవారికి ఇది స్థిరమైన రాబడిని అందిస్తుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం వడ్డీ రేట్లను యథాతధంగా ఉంచడం ఇవి వరుసగా పదో త్రైమాసికంగా చెప్పవచ్చు. 2026-27 ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికం 2026 అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 2026 వరకు వివిధ పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు.. రెండో త్రైమాసికం 2026 జూలై 1 నుంచి 2026 సెప్టెంబర్ 30 వరకు ప్రకటించిన రేట్ల మాదిరిగానే ఉంటాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్‌లో జారీ చేసింది.
కిసాన్ వికాస్ పత్రపై వడ్డీ రేటు 7.5 శాతంగా ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. ఇక నెలవారీ ఆదాయ పథకంలోని పెట్టుబడిదారులకు 7.4 శాతం వడ్డీ లభిస్తుందని వెల్లడించింది. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఈ కొత్త వడ్డీ రేట్లు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. దీంతో పెట్టుబడిదారులు గమనించాలని కోరింది. ఇప్పటికీ చాలామంది ఈ పొదుపు పథకాల్లో చేరుతున్నారు. ఈ స్కీమ్స్ మార్కెట్లతో లింక్ అవ్వవు. దీంతో రిస్క్ లేని పెట్టుబడి కోరుకునేవారు, స్థిరమైన ఆదాయం కావాలనుకునేవారు వీటిల్లో పెట్టుబడుతు పెడుతుంటారు.
