కొనసాగుతోన్న ఆర్థిక మందగమనం.. ఏడేళ్ల కనిష్టానికి జీడీపీ..!
దేశ ఆర్థిక వ్యవస్థలో మందగమనం కొనసాగుతోంది. మూడో త్రైమాసికంలో వృద్ధి 4.7శాతానికి దిగజారింది. దీంతో ఏడేళ్ల కనిష్ఠానికి వృద్ధి రేటు చేరింది. తయారీ రంగం డీలా పడటమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.

దేశ ఆర్థిక వ్యవస్థలో మందగమనం కొనసాగుతోంది. మూడో త్రైమాసికంలో వృద్ధి 4.7శాతానికి దిగజారింది. దీంతో ఏడేళ్ల కనిష్ఠానికి వృద్ధి రేటు చేరింది. తయారీ రంగం డీలా పడటమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. 2012-13 జనవరి-మార్చిలో నమోదైన 4.3శాతం తరువాత ఆ స్థాయికి వృద్ధి రేటు పరిమితం కావడం ఇదే తొలిసారి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) జూలై-సెప్టెంబర్ కాలంలో వృద్ధి రేటును గతంలో పేర్కొన్న 4.5శాతం నుంచి 5.1 శాతానికి సవరించినట్లు జాతీయ గణాంక కార్యాలయం శుక్రవారం ప్రకటించింది. అలాగే ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం(2019 ఏప్రిల్-జూన్)లో వృద్ధి రేటును 5శాతం నుంచి 5.6శాతానికి సవరించింది. అదే సమయంలో 2019-20లో వృద్ధి 5శాతంగా నమోదు కావొచ్చని ముందస్తు అంచనాల్లో వెల్లడించింది.
మరోవైపు ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వం మంచి సంకేతమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. జీడీపీ గణాంకాలు బాగా మెరుగుపడతాయని అంచనా వేయలేదు. కరోనా ప్రభావం మరికొన్ని వారాల పాటు కొనసాగితే సవాళ్లు ఎదురుకావొచ్చు. ప్రస్తుతానికైతే భయపడాల్సిన అవసరం లేదు అని నిర్మలా చెప్పుకొచ్చారు.