AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Silver: వెండి కూడా బంగారం లెక్కనే.. కేంద్రం కీలక నిర్ణయం.. అమల్లోకి రానున్న కొత్త రూల్స్..

వెండికి హాల్‌మార్కింగ్ ప్రక్రియ సెప్టెంబర్ 1 నుండి ప్రారంభమవుతుంది. ఇప్పటివరకు బంగారంపై మాత్రమే హాల్‌మార్కింగ్ తప్పనిసరి, కానీ ప్రభుత్వం వెండిపై కూడా ఈ వ్యవస్థను అమలు చేయాలని నిర్ణయించింది. BIS వెండికి ఆరు స్వచ్ఛత స్థాయిలను నిర్ణయించింది. ఇది పారదర్శకత, కస్టమర్ విశ్వాసాన్ని పెంచనుంది.

Silver: వెండి కూడా బంగారం లెక్కనే.. కేంద్రం కీలక నిర్ణయం.. అమల్లోకి రానున్న కొత్త రూల్స్..
Silver Hallmarking
Krishna S
|

Updated on: Aug 28, 2025 | 12:34 PM

Share

కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై వెండి ఆభరణాలకు కూడా బంగారం మాదిరిగానే హాల్‌మార్కింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టనుంది. ఈ ప్రక్రియ సెప్టెంబర్ 1 నుండి అమల్లోకి రానుంది. ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశ్యం కస్టమర్లు కొనుగోలు చేసే వెండికి స్వచ్ఛత హామీ ఇవ్వడం. ప్రస్తుతానికి ఈ హాల్‌మార్కింగ్ స్వచ్ఛందంగా ఉంటుంది. అంటే వినియోగదారులు కోరుకుంటే హాల్‌మార్క్ చేసిన వెండిని కొనుగోలు చేయవచ్చు లేదా హాల్‌మార్క్ లేని వెండిని కూడా కొనవచ్చు. అయితే భవిష్యత్తులో ఇది తప్పనిసరి అయ్యే అవకాశాలు లేకపోలేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బంగారం విషయంలో హాల్‌మార్కింగ్ తప్పనిసరి అయినట్లే, వెండికి కూడా ఇదే విధానం అమలులోకి రావచ్చని భావిస్తున్నారు.

హాల్‌మార్కింగ్ వల్ల వెండి ఆభరణాల ధరలు పెరుగుతాయా అనే సందేహం చాలా మందిలో ఉంది. అయితే దీని వల్ల ధరలపై ప్రత్యక్ష ప్రభావం ఉండదని నిపుణులు చెబుతున్నారు. కానీ వినియోగదారుల్లో నాణ్యత పట్ల విశ్వాసం పెరిగి, హాల్‌మార్క్ చేసిన వెండికి డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. హాల్‌మార్క్ అనేది వినియోగదారుడు కొనుగోలు చేస్తున్న వెండి ఎంత స్వచ్ఛమైనదో తెలియజేసే ఒక ప్రామాణికత ముద్ర. ఇది కొనుగోలులో మోసం జరిగే అవకాశాలను తగ్గించి, వినియోగదారులు తమ డబ్బుకు పూర్తి విలువ పొందేలా చేస్తుంది.

వెండి స్వచ్ఛతను గుర్తించే ప్రమాణాలు

బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) వెండికి ఆరు వేర్వేరు స్వచ్ఛత ప్రమాణాలను నిర్ణయించింది. ఈ ప్రమాణాలను బట్టి వెండి ఆభరణాలు లేదా వస్తువుల స్వచ్ఛతను గుర్తించవచ్చు.

800 స్టాంప్: ఇందులో 80శాతం వెండి ఉంటుంది, మిగిలిన 20శాతం ఇతర లోహాలు (రాగి వంటివి) ఉంటాయి.

835 స్టాంప్: ఇది 83.5శాతం స్వచ్ఛత కలిగిన వెండిని సూచిస్తుంది.

900 స్టాంప్: ఇందులో 90శాతం వెండి ఉంటుంది. ఇది సాధారణంగా నాణేలు మరియు కొన్ని ప్రత్యేక ఆభరణాలలో ఉపయోగిస్తారు.

925 స్టాంప్: ఇది స్టెర్లింగ్ వెండిగా ప్రసిద్ధి చెందింది. దీనిలో 92.5శాతం స్వచ్ఛత ఉంటుంది మరియు ఇది అత్యంత ప్రజాదరణ పొందిన ప్రమాణం.

970 స్టాంప్: ఇది 97శాతం స్వచ్ఛమైన వెండి, దీనిని ప్రత్యేక పాత్రలు మరియు డిజైనర్ ఆభరణాల కోసం ఉపయోగిస్తారు.

990 స్టాంప్: దీనిని ఫైన్ సిల్వర్ అని పిలుస్తారు. దీనిలో 99శాతం వెండి స్వచ్ఛత ఉంటుంది. ఇది చాలా మృదువుగా ఉంటుంది కాబట్టి, బార్‌లు మరియు నాణేల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు.

ఈ కొత్త ప్రమాణాలతో వినియోగదారులు ఇకపై వెండి నాణ్యతను సులభంగా గుర్తించగలుగుతారు. తద్వారా సురక్షితమైన, నమ్మదగిన కొనుగోళ్లు చేయవచ్చు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..