
Gold: సావరిన్ గోల్డ్ బాండ్స్ (SGB)లో పెట్టుబడి పెట్టిన వారికి భారీ లాభం వచ్చింది. SGB 2020-21 Series VI పెట్టుబడిదారులకు దాదాపు 204 శాతం క్యాపిటల్ గెయిన్ లభించింది. ఈ సిరీస్‌కు సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ప్రీమెచ్యూర్ రిడెంప్షన్ ధరను గ్రాముకు రూ.15,384గా నిర్ణయించింది.
అంటే 2020లో ఆన్‌లైన్ ద్వారా సుమారు రూ.5,067 ధరకు ఒక గ్రాము సావరిన్ గోల్డ్ బాండ్స్ కొనుగోలు చేసిన ఇన్వెస్ట్‌లకు కాసుల వర్షం కుసింది. ఇప్పుడు దాని విలువ ఏకంగా 3 రెట్లకు పైగా పెరిగింది. ఉదాహరణకు, అప్పట్లో మీరు రూ.1 లక్ష పెట్టుబడి పెట్టినట్లయితే ప్రస్తుతం దాని రిడెంప్షన్ విలువ సుమారు రూ.3.04 లక్షలు అవుతుంది. ఇందులో బాండ్స్ ద్వారా వచ్చిన వడ్డీని కలపలేదు.
రూ.5,067 నుంచి రూ.15,384కు..
సావరిన్‌గోల్డ్ బాండ్స్ 2020-21 Series VIని 8 సెప్టెంబర్ 2020న జారీ చేశారు. దీని అసలు ఇష్యూ ధర గ్రాముకు రూ.5,117గా ఉంది. అయితే ఆన్‌లైన్‌లో డిజిటల్ పేమెంట్ చేసిన వారికి గ్రాముపై రూ.50 డిస్కౌంట్ లభించింది. దీంతో వారి ప్రభావవంతమైన కొనుగోలు ధర రూ.5,067గా ఉంది. ఇప్పుడు ఆర్బీఐ నిర్ణయించిన ప్రీమెచ్యూర్ రిడెంప్షన్ ధర గ్రాముకు రూ.15,384. అంటే ఒక్క గ్రాముపై రూ.10,317 విలువ పెరిగింది.
రూ.1,00,000 × (రూ.15,384 ÷ రూ.5,067) = సుమారు రూ.3,03,612
అంటే రూ.1 లక్ష పెట్టుబడి సుమారు రూ.3.04 లక్షలకు పెరిగినట్లు లెక్క. ఇది దాదాపు 203.6 శాతం క్యాపిటల్ గెయిన్.
204% రిటర్న్‌తో పాటు 2.5% వడ్డీ
SGBలో పెట్టుబడి పెట్టిన వారికి కేవలం బంగారం ధర పెరగడం వల్లే లాభం రాలేదు. ఈ బాండ్లపై ఏటా 2.5 శాతం వడ్డీ కూడా లభిస్తుంది. ఈ వడ్డీని సాధారణంగా ఆరు నెలలకు ఒకసారి చెల్లిస్తారు. ఉదాహరణకు రూ.1 లక్ష విలువైన ఎస్‌జీబీ కొనుగోలు చేసిన పెట్టుబడిదారుడికి సంవత్సరానికి సుమారు రూ.2,500 వడ్డీ లభిస్తుంది. ఆరు సంవత్సరాల పాటు అదే పెట్టుబడిని కొనసాగించినట్లయితే, సుమారు రూ.15,000 వడ్డీ అవుతుంది. అయితే వాస్తవ వడ్డీ మొత్తం పెట్టుబడి వివరాలు, చెల్లింపు తేదీలపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల 204 శాతం క్యాపిటల్ గెయిన్ మాత్రమే కాకుండా, పెట్టుబడిదారులకు వడ్డీ ఆదాయం కూడా అదనంగా వచ్చింది.
సావరిన్ గోల్డ్ బాండ్స్ ప్రీమెచ్యూర్ రిడెంప్షన్ ధరను రిజర్వ్ బ్యాంకు నేరుగా నిర్ణయించదు. నిర్ణీత విధానం ప్రకారం 999 స్వచ్ఛత కలిగిన బంగారం గత మూడు పని దినాల ముగింపు ధరల సగటు ఆధారంగా రిడెంప్షన్ ధరను నిర్ణయిస్తారు. ఇందుకోసం ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (IBJA) ప్రచురించే బంగారం ధరలను పరిగణనలోకి తీసుకుంటారు. ఈ సిరీస్‌కు 8 సెప్టెంబర్ 2026 రిడెంప్షన్‌ను పరిగణనలోకి తీసుకుని, సెప్టెంబర్ 3, 4, 7 తేదీల్లోని బంగారం ధరలను ఆధారంగా చేసుకున్నారు. ఆ లెక్క ప్రకారం రిడెంప్షన్ ధరను రూ.15,384 గ్రాముగా నిర్ణయించారు.
ఇది కూడా చదవండి: Flipkart Big Billion Days: కస్టమర్లకు గుడ్‌న్యూస్.. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ఎప్పటి నుంచో తెలుసా..?
సావరిన్ గోల్డ్ బాండ్ సాధారణ మెచ్యూరిటీ కాలం 8 సంవత్సరాలు. అయితే పెట్టుబడిదారులకు ఐదేళ్లు పూర్తయిన తర్వాత నిర్దిష్ట వడ్డీ చెల్లింపు తేదీల్లో ప్రీమెచ్యూర్ రిడెంప్షన్ చేసుకునే అవకాశం ఉంటుంది. SGB 2020-21 Series VIని 8 సెప్టెంబర్ 2020న జారీ చేశారు. దీంతో 8 సెప్టెంబర్ 2026 నుంచి ఈ సిరీస్‌లో ప్రీమెచ్యూర్ రిడెంప్షన్ అవకాశం వచ్చింది. ఈ సిరీస్ అసలు మెచ్యూరిటీ తేదీ 8 సెప్టెంబర్ 2028. అంటే ముందుగానే రిడీమ్ చేసుకునే పెట్టుబడిదారులు మెచ్యూరిటీకి దాదాపు రెండేళ్ల ముందే బయటకు రావచ్చు.
గమనిక: రూ.3.04 లక్షల లెక్కలో 204% క్యాపిటల్ గెయిన్ మాత్రమే పరిగణించారు. పెట్టుబడిదారులకు ఇప్పటికే చెల్లించిన 2.5% వార్షిక వడ్డీ ఇందులో కలపలేదు. అలాగే పన్ను నిబంధనలు రిడెంప్షన్ విధానం, కొనుగోలు సమయం వంటి అంశాలపై ఆధారపడవచ్చు.
ఇది కూడా చదవండి: Chicken, Egg, Milk Prices: గుడ్లు, చికెన్, పాల ధరలు ఎందుకు పెరుగుతున్నాయో తెలుసా? అసలు కారణం ఇదేనట..!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి