క్రెడిట్ కార్డు లావాదేవీలకు యూపీఐ ఛార్జీలు వర్తిస్తాయా..? క్లారిటీ వచ్చేసింది..

Venkatrao Lella

Images: Pinterest

30 SEP 2026

యూపీఐ ఛార్జీలపై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. అక్టోబర్ 15 నుంచి విధించనున్న యూపీఐ పేమెంట్లపై స్పష్టతిచ్చింది. యూపీఐ లింక్డ్ క్రెడిట్ కార్డులకు ఛార్జీలపై క్లారిటీనిచ్చింది.

అక్టోబర్ 15వ తేదీ నుంచి పర్సన్ టు మర్చంట్ లావాదేవీలపై ఎండీఆర్ ఛార్జీల విధింపును అమలు చేయనున్నారు. రూ.2 వేలు దాటిన లావాదేవీలకు 0.4 శాతం చొప్పున విధించనున్నట్లు కేంద్రం ప్రకటించింది.

అయితే ఎండీఆర్ ఛార్జీలపై ప్రజల్లో కొంత ఆందోళన ఉంది. యూపీఐ లింక్డ్ క్రెడిట్ కార్డుల నుంచి ట్రాన్సాక్షన్లు చేసినా ఛార్జీలు వర్తిస్తాయా అనే ప్రశ్న చాలామందిలో ఉంది. దీంతో ఎన్‌పీసీఐ స్పందించి స్పష్టతిచ్చింది.

క్రెడిట్ కార్డును యూపీఐ లింక్ చేసి పేమెంట్ చేస్తే ఎండీఆర్ ఛార్జీలు వర్తించవని ఎన్‌పీసీఐ క్లారిటీ ఇచ్చింది. ఇక క్రెడిట్ లైన్స్ ద్వారా చేసే ట్రాన్సాక్షన్లకు కూడా ఛార్జీలు వర్తించవని స్పష్టం చేసింది.

ఎన్‌పీసీఐ ప్రకటనతో క్రెడిట్ కార్డుల ద్వారా లావాదేవీలు చేసేవారికి ఊరట కలిగింది. ఒక వ్యక్తి మర్చంట్ వద్ద చేసే పేమెంట్లకు మాత్రమే ఛార్జీలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. వ్యక్తుల మధ్య జరిగే ట్రాన్సాక్షన్లకు వర్తించవని తెలిపింది.

ఒక యూజర్ తన బ్యాంక్ అకౌంట్ నుంచి మర్చంట్ బ్యాంక్ అకౌంట్‌కు యూపీఐ ద్వారా చేసే లావాదేవీలకు మాత్రమే యూపీఐ ఛార్జీలు అమలవుతాయని ఎన్‌పీసీఐ చెప్పుకొచ్చింది. ఒక యూజర్ మరో యూజర్ అకౌంట్‌కు చేస్తే ఛార్జీలు ఉండవంది.

స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, సెక్యూరిటీస్ వద్ద చేసే యూపీఐ లావాదేవీలకు 0.02 శాతం చొప్పున ఎండీఆర్ ఛార్జీలు పడతాయి. గరిష్ట పరిమితి ఒక్కొ లావాదేవీకి రూ.300 నిర్ణయించారు.

చిన్న వ్యాపారులకు నెలకు రూ.లక్ష వరకు లావాదేవీలు ఉచితంగానే కొనసాగుతున్నాయి. ఆ పరిమితి దాటితే యూపీఐ ఛార్జీలు పడతాయి. దీంతో చిన్న వ్యాపారులకు పెద్దగా నష్టం ఉండదు.

4 శాతం మర్చంట్ లావాదేవీలు మాత్రమే కొత్త ఎండీఆర్ పరిధిలోకి వస్తాయి. 95 శాతం మందికి యూపీఐ లావాదేవీలు ఉచితంగా కొనసాగుతాయని కేంద్రం చెబుతోంది.