Crypto Rules: సెలబ్రిటీల క్రిప్టో ప్రకటనలపై సెబీ సంచలన నిర్ణయం.. ఇకపై ఆ నిబంధనలు తప్పక పాటించాల్సిందే..
Crypto Rules: గత కొన్ని నెలలుగా దేశంలో క్రిప్టో పెట్టుబడులపై ఆసక్తి చూపే వారి సంఖ్య భారీగానే పెరుగుతోంది. తెలిసీ తెలియక పెట్టుబడులు చేసి చాలా మంది తమ సొమ్మును నష్టపోతున్నారు.
Crypto Rules: గత కొన్ని నెలలుగా దేశంలో క్రిప్టో పెట్టుబడులపై ఆసక్తి చూపే వారి సంఖ్య భారీగానే పెరుగుతోంది. తెలిసీ తెలియక పెట్టుబడులు చేసి చాలా మంది తమ సొమ్మును నష్టపోతున్నారు. ఇందుకు ప్రముఖులు ప్రకటనలు ఇవ్వటం కూడా ఒక ప్రధాన కారణంగా నిలుస్తోంది. దీనిని కట్టడి చేసేందుకు వినియోగదారుల రక్షణ కోసం సెబీ రంగంలోకి దిగింది. అయినా ఇటీవలి కాలంలో క్రిప్టో కరెన్సీ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. కొన్ని కాయిన్ల రేటు అమాంతం సున్నాకు చేరుకుంది. TerraUSD సిస్టర్ కాయిన్ అయిన లూనా ఈ నెల 13న సున్నా డాలర్ల విలువకు చేరుకుంది. ఒకానొక సమయంలో ఇది 100 డాలర్ల కంటే పైనే ట్రేడింగ్ అయింది. అంతేకాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్ విలువ కూడా 35% పైగా పడిపోయింది. భారత కరెన్సీ ప్రకారం ఒక్కో బిట్ కాయిన్ విలువ సుమారు రూ. 22.85 లక్షల వద్ద ఉంది.
కొత్త రూల్స్ ప్రకారం..
సెక్యూరిటీస్ & ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) సెలబ్రిటీలు, పబ్లిక్ ఫిగర్లు క్రిప్టో పెట్లుబడులను ప్రమోట్ చేయకుండా నిరోధించాలని ప్రతిపాదించింది. దేశంలో క్రిప్టో పెట్టుబడులు క్రమబద్ధీకరించబడని కారణంగా ప్రముఖులు, క్రీడాకారులతో సహా ప్రశంసలు పొందిన పబ్లిక్ వ్యక్తులెవరూ క్రిప్టో ఉత్పత్తులను స్పన్సర్ షిప్ ఇవ్వకూడదని SEBI సిఫార్సు చేసింది. క్రిప్టోలు, డిజిటల్ ఆస్తులకు ప్రకటనలు ఇచ్చే కంపెనీలు Inc42 ప్రకారం క్రిప్టో లావాదేవీల్లో సాధ్యమయ్యే ఉల్లంఘనల జాబితాను బహిర్గతం చేయాలని మార్కెట్ రెగ్యులేటర్ సూచించింది.
క్రిప్టో ఉత్పత్తుల్లో లావాదేవీలు ఫెమా, బడ్స్, పిఎమ్‌ఎల్‌ఎ వంటి భారతీయ చట్టాలను ఉల్లంఘించినందుకు ప్రాసిక్యూషన్‌కు దారితీయవచ్చని సెబీ తెలిపింది. క్రిప్టో ప్రకటనల్లో నిబంధనల ఉల్లంఘన జరుగుతున్నట్లు తేలితే పబ్లిక్ ఫిగర్స్ బాధ్యత వహించాల్సి ఉంటుందని సెబీ పేర్కొంది. అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ASCI) ఫిబ్రవరిలో క్రిప్టో, క్రిప్టో ఉత్పత్తులకు సంబంధించిన ప్రకటనల కోసం ప్రత్యేకంగా మార్గదర్శకాలను తీసుకొచ్చింది. ఆ తరువాతే సెబీ ప్రస్తుతం ఈ నిర్ణయం తీసుకుంది.
తాజా నిబంధనల ప్రకారం అన్ని ప్రకటనలు తప్పనిసరిగా నిరాకరణను కలిగి ఉండాలి. “క్రిప్టో ఉత్పత్తులు, NFTలు క్రమబద్ధీకరించబడవు పైగా అవి చాలా ప్రమాదకరమైనవి. అటువంటి లావాదేవీల నుంచి ఏదైనా నష్టానికి ఎటువంటి నియంత్రణ సహాయం ఉండకపోవచ్చు.” అనే హెచ్చరికను ప్రకటనలు చేస్తున్న క్లిప్టో కంపెనీలు తప్పని సరిగా జోడించాలి. వినియోగదారులకు క్రిప్టో పెట్టుబడుల వద్ద డబ్బు నష్టపోయే ప్రమాదం ఉంటుందని కొత్త రూల్ప్ ప్రకారం తప్పనిసరిగా తెలియజేయాలి.