Twin Towers Demolition Waste: నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని ఇటీవల నోయిడాలోని సూపర్ టెక్ ట్విన్ టవర్లను కూల్చేశారు. 102 మీటర్ల ఎత్తైన ఈ అత్యాధునిక భవనాలను కేవలం 10 సెకన్లలో నేలమట్టం చేశారు. కాగా ఈ రెండు భారీ టవర్లను కూల్చివేయడంతో సుమారు 30వేల టన్నులకు పైగా చెత్త, వ్యర్థాలు పోగయినట్లు తెలుస్తుంది. మరి ఈ వ్యర్థాల మాటేంటి? వాటిని ఎలా తొలగిస్తారు? తరలింపు అంత సులభమా? అని అడిగితే పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు హైదరాబాద్ కు చెందిన రీ సస్టెయినబిలిటీ సీఈఓ మసూద్ మాలిక్. ఆసియాలో సుప్రసిద్ధ పర్యావరణ నిర్వహణ సర్క్యులర్ కంపెనీ అయిన రీ సస్టెయినబిలిటీ (గతంలో రామ్కీ ఎన్విరో ఇంజినీర్స్ లిమిటెడ్) ఈ నిర్మాణ, కూల్చివేతల వ్యర్ధాలను నిర్వహించే బాధ్యతను దక్కించుకుంది. మరి ఇంతకీ ఈ భారీ వ్యర్థాలను ఎలా రీసైకిల్ చేస్తారు? ఈ డెబ్రీష్ లో 90శాతానికి పైగా మెటీరియల్‌ను రీయూజ్ చేయడంపై మసూద్ మాలిక్ ఏమన్నారంటే?
‘ ఈ వ్యర్థాలను పూర్తిగా సేకరించడంతో పాటుగా రీసైక్లింగ్ చేయడం, వీటిని తిరిగి ఉపయోగించేలా చేయడం ఒక ఛాలెంజ్ లాంటిది. మా కంపెనీ రోజుకు 300 టన్నుల వ్యర్ధాల చొప్పున మూడునెలల పాటు ప్రాసెస్ చేస్తాం. ఈ వ్యర్థాలను నిర్మాణ మెటీరియల్స్‌గా మార్చడం, రీసైకిల్డ్ మెటీరియల్స్‌తో అత్యద్భుతమైన మౌలిక వసతుల నిర్మాణాలను అనుకూలంగా మార్చడమే మా లక్ష్యం. ఈ మెటీరియల్‌ను నోయిడా లోని మా ప్లాంట్ వద్ద తయారుచేయనున్నారు. భవిష్యత్ లో ఈ వేస్టేజ్ ను కూడా అనులమైన మెటీరియల్స్ గా విడదీసి.. వాటిని కూడా తిరిగి ఉపయోగించే విధంగా టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నాం’ అని చెప్పుకొచ్చారు మసూద్ మాలిక్.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..