Ratan Tata: నిలువెత్తు నిరాడంబరతకు మారుపేరు రతన్ టాటా. లక్షల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతైనా ఆయనలో ఎలాంటి గర్వం కనిపించదు. తోటివారి పట్ల ఎంతో దయాగుణంలో ఉండే ఆయన దాతృత్వంలోనూ ఎంతో ముందుంటారు. సందర్భం వచ్చిన ప్రతీసారి ఇతరులకు సాయం చేయడంలోనూ ముందుంటారాయన. కొవిడ్ కష్టకాలంలో దేశం కోసం రూ.1500 కోట్లు విరాళమిచ్చిన రతన్ టాటా (Ratan Tata).. తమ సంస్థలో కరోనాతో చనిపోయిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు 20 నెలల బేసిక్ సాలరీని వన్ టైమ్ పేమెంట్ కింద చెల్లించారు. అంతేకాదు.. ఆ ఉద్యోగుల రిటైర్‌మెంట్ తేదీ వరకు వారి కుటుంబాలకు ప్రతీ నెలా బేసిక్ సాలరీలో సగం వేతనాన్ని చెల్లిస్తున్నారు. ఇలా సాయానికి, సింప్లిసిటీకి కేరాఫ్ అడ్రస్‌గా టాటా మరోసారి తన నిరాడంబరతను చాటుకున్నారు. ముంబైలోని తాజ్ హోటల్లో జరిగిన ఓ కార్యక్రమానికి ఆయన నానో కారులో వచ్చారు. పక్కన బాడీగార్డ్స్ కూడా ఎవరూ లేరు. హోటల్‌కు వచ్చే సమయానికి సిబ్బంది వచ్చి టాటాను సాదరంగా రిసీవ్ చేసుకున్నారు. సాధారణంగా బిగ్ షాట్స్, సెలబ్రిటీలు ఎక్కడికైనా వచ్చారంటే.. అక్కడ ఎంత హంగామా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటి టాటా తాజ్ హోటల్‌కు వచ్చినప్పుడు మాత్రం అక్కడ ఎలాంటి సందడి లేకపోడం గమనార్హం.
ఈక్రమంలో టాటా నానో కారులో తాజ్ హోటల్‌కు వచ్చిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ముంబైకి చెందిన ప్రముఖ సెలబ్రిటీ పొటోగ్రాఫర్ విరాల్ భయ్యాని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేశాడు. టాటా నిరాడంబరతను చూసి తాను ఆశ్చర్యపోయానని విరాల్ భయ్యాని తన ఇన్‌స్టా పోస్టులో పేర్కొన్నారు. నెటిజన్లు కూడా టాటా సింప్లిసిటీని చూసి ఆశ్చర్యపోతున్నారు. ‘ ఒక బిలియనీర్ అయి ఉండి టాటా చాలా సింపుల్ లైఫ్ గడుపుతున్నారు.. గ్రేట్’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..
Also Read: