Promissory Note: ఎవరికైనా అప్పు ఇచ్చేటప్పుడు ప్రామిసరీ నోటు ఇలా రాస్తే చెల్లదు.. తెలుసుకోవాల్సిన విషయాలు

ప్రామిసరీ నోటు కేవలం అప్పు ఇచ్చేటప్పుడు రాసుకునే ఓ ఒప్పంద పత్రం మాత్రమే కాదు.. లీగల్‌గా ఇది అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. దీన్ని రాసుకునేటప్పుడు కొన్ని కీలక జాగ్రత్తలు పాటించాలి. రిటన్ డాక్యుమెంట్, నిర్దిష్ట మొత్తం, షరతులు లేని ఒప్పందం, సాక్షి సంతకాలు, రెవెన్యూ స్టాంప్ తప్పనిసరి. ఆ వివరాలు ఇలా..

Promissory Note: ఎవరికైనా అప్పు ఇచ్చేటప్పుడు ప్రామిసరీ నోటు ఇలా రాస్తే చెల్లదు.. తెలుసుకోవాల్సిన విషయాలు
Promissory Note

Updated on: May 10, 2026 | 8:23 AM

మన నిత్య జీవితంలో డబ్బుల లావాదేవీలు జరిగినప్పుడు సాధారణంగా వాడే పత్రం ‘ప్రామిసరీ నోటు’. అయితే, చాలా మంది దీనిని కేవలం అప్పు తీసుకున్నప్పుడు రాసే ఒక కాగితంలాగే భావిస్తారు. కానీ, ప్రామిసరీ నోటు అనేది కేవలం రుణ ఒప్పందం మాత్రమే కాదు, అది ఒక పవిత్రమైన ‘వాగ్దాన పత్రం’ అని హైకోర్టు అడ్వకేట్ అలఘర్ రవీంద్రనాథ్ వివరించారు. నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ చట్టం 1881 ప్రకారం దీనికి ఉన్న చట్టబద్ధత, విధివిధానాలు ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

చాలామందికి ఉన్న ఒక పెద్ద అపోహ ఏమిటంటే, ప్రామిసరీ నోటును కేవలం నగదు అప్పు తీసుకున్నప్పుడే వాడతారని. కానీ దీని పరిధి చాలా పెద్దది. అద్దె బకాయిలు ఉన్నా, ఎవరికైనా ఏదైనా సేవ(నర్సింగ్, కోచింగ్ లాంటివి) అందించినప్పుడు ఇవ్వాల్సిన ఫీజులు ఉన్నా, లేదా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు చెల్లించాల్సిన నష్టపరిహారం విషయంలోనైనా సరే.. ఒక నిర్దిష్ట మొత్తాన్ని నిర్ణీత కాలంలో చెల్లిస్తానని హామీ ఇస్తూ రాసిచ్చే పత్రం ప్రామిసరీ నోటుగా చెల్లుబాటు అవుతుంది.

ఇది చదవండి: లక్షల్లో అప్పులు ఉన్నా భయపడాల్సిన అవసరం లేదు.. సింపుల్‌గా తీర్చేసే బెస్ట్ ఐడియా ఇది

ఇవి కూడా చదవండి

ప్రామిసరీ నోటు చట్టబద్ధంగా ఉండాలంటే ఈ 5 సూత్రాలు తప్పనిసరి.!

ఒక ప్రామిసరీ నోటు కోర్టులో చెల్లుబాటు కావాలంటే ఐదు కీలక నియమాలను పాటించాలని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు.

ఖచ్చితంగా రాతపూర్వకంగా ఉండాలి:

మాట మీద ఇచ్చే హామీకి చట్టం ముందు విలువ ఉండదు. ప్రామిసరీ నోటును పేపర్ మీద పెన్నుతో రాయవచ్చు లేదా టైప్ చేయవచ్చు. ఏ భాషలో రాసినా ఇబ్బంది లేదు కానీ, రుణగ్రహీత సంతకం లేదా వేలు ముద్ర మాత్రం స్పష్టంగా ఉండాలి.

స్పష్టమైన కాలపరిమితి:

డబ్బును ఏ తేదీన లేదా ఎంత కాలం లోపు తిరిగి చెల్లిస్తారనే విషయాన్ని పత్రంలో స్పష్టంగా పేర్కొనాలి. ఆ తేదీయే తర్వాత చట్టపరమైన చర్యలకు ప్రాతిపదిక అవుతుంది.

నిర్దిష్ట మొత్తం(అక్షరాల్లో ముఖ్యం):

అసలు మొత్తం ఎంత, వడ్డీ ఎంత అనేది విడివిడిగా రాయాలి. ఒకవేళ అంకెల్లో రాసిన మొత్తానికి, అక్షరాల్లో రాసిన మొత్తానికి తేడా వస్తే.. చట్టం అక్షరాల్లో రాసిన దాన్నే ప్రామాణికంగా తీసుకుంటుంది. ఉదాహరణకు అంకెల్లో రూ. 10,000 అని రాసి, అక్షరాల్లో రూ. 1,00,000 అని రాస్తే, లక్ష రూపాయలనే అసలు మొత్తంగా పరిగణిస్తారు.

ఎలాంటి షరతులు ఉండకూడదు:

ప్రామిసరీ నోటు అంటేనే ‘షరతులు లేని వాగ్దానం’. “మా నాన్న ఆస్తి అమ్మినప్పుడు ఇస్తా” లేదా “నాకు ప్రమోషన్ వస్తే చెల్లిస్తా” వంటి కండిషన్లు పెడితే అది ప్రామిసరీ నోటు కిందకు రాదు. చెల్లింపు అనేది అన్-కండిషనల్‌గా ఉండాలి.

సాక్షి సంతకాలు, రెవెన్యూ స్టాంప్:

ఇది చాలా ముఖ్యం. సాక్షులు లేని ప్రామిసరీ నోటు న్యాయపరంగా బలహీనమైనది. సాక్షులు తమ పేరు, చిరునామా స్పష్టంగా రాయాలి. అలాగే నోటుపై రూ. 1 రెవెన్యూ స్టాంప్ ఉండాలి. ఈ చిన్న స్టాంప్ రూ. 3 కోట్ల రూపాయల లావాదేవీ వరకు చెల్లుబాటు అవుతుంది.

చెల్లుబాటు కాలం ఎంత?

చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, ప్రామిసరీ నోటుకు ఒక ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. నోటుపై పేర్కొన్న చెల్లింపు గడువు ముగిసిన రోజు నుండి సరిగ్గా మూడు సంవత్సరాల వరకు మాత్రమే ఇది చట్టబద్ధంగా చెల్లుతుంది. ఈ లోపు రుణగ్రహీత డబ్బు చెల్లించకపోతే, రుణదాత కోర్టును ఆశ్రయించి తన సొమ్మును రికవరీ చేసుకోవచ్చు. మూడు ఏళ్లు దాటితే మాత్రం ఆ పత్రం ద్వారా డబ్బు వసూలు చేయడం చాలా కష్టమవుతుంది. డబ్బుల లావాదేవీల విషయంలో నమ్మకం ఎంత ముఖ్యమో, చట్టబద్ధమైన జాగ్రత్తలు కూడా అంతే ముఖ్యమని న్యాయ నిపుణులు అంటున్నారు.

ఇది చదవండి: అపార్ట్‌మెంట్ వర్సెస్ ఇండిపెండెంట్ హౌస్ ఏది కొంటే బెటర్.. 10 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుంది

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us