Optiemus Electronics: ఎలక్ట్రానిక్స్ వస్తువుల తయారీ సంస్థ ఆప్టిమస్ ఎలక్ట్రానిక్స్ (optiemus electronics) రాబోయే రెండేళ్లలో 2,000 నియామకాలను చేపడుతామని ప్రకటించింది. ఉద్యోగులతో పాటు ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా పెంచుకోవాలని కంపెనీ యోచిస్తోంది. ఆప్టిమస్ ఎలక్ట్రానిక్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఎ గురురాజ్ మాట్లాడుతూ.. కంపెనీ ప్రస్తుత ఉత్పత్తి సామర్థ్యం రెండేళ్లలో పూర్తవుతుందని అన్నారు. అటువంటి పరిస్థితిలో మేము కొత్త తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి స్థలం కోసం చూస్తున్నామని తెలిపారు. కస్టమర్ల డిమాండ్ ఎంత వరకు ఉంటుందో చూడాలని, రాబోయే ఒకటిన్నర సంవత్సరాల్లో రెండు వేల నియామకాలు చేపట్టే ప్రణాళిక ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం కంపెనీ ఉద్యోగుల సంఖ్య 300 మాత్రమే.
కంపెనీ వ్యాపారం
మొబైల్ ఫోన్‌లు, IT హార్డ్‌వేర్, టెలికమ్యూనికేషన్ ఉత్పత్తుల కోసం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకం (Production Linked Incentive Scheme) అర్హత కలిగిన ఎలక్ట్రానిక్ కంపెనీలలో OEL ఒకటి. ఈ పథకం కింద కంపెనీలు చేసే పెట్టుబడులకు, పెరిగిన అమ్మకాలకు ప్రభుత్వం ఏడాది ప్రాతిపదికన ప్రోత్సాహకాలను అందిస్తుంది.
PLI పథకం అంటే ఏమిటి?
పీఎల్‌ఐ పథకం కింద వచ్చే ఐదేళ్లలో భారత్‌లో వస్తువులు తయారు చేసే కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం రూ.1.46 లక్షల కోట్ల ప్రోత్సాహకాన్ని ఇవ్వబోతోంది. దేశీయ తయారీని ప్రోత్సహించడానికి, దిగుమతి బిల్లులను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం PLI పథకాన్ని ప్రారంభించింది.
కంపెనీ రూ.1350 కోట్లు పెట్టుబడి
ఆప్టిమస్ ఎలక్ట్రానిక్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఎ గురురాజ్ మాట్లాడుతూ.. ‘నేటి నుంచి ఏడాదిన్నరలో మన లక్ష్యాలను చేరుకుంటామనే నమ్మకం ఉంది. OELతో పనిచేయడానికి కస్టమర్‌లు గొప్ప ఆసక్తిని కనబరుస్తున్నారని’ చెప్పారు. మొబైల్ ఫోన్లు, టెలికాం పరికరాల తయారీపై రూ.1,350 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు OEL ఆగస్టులో వెల్లడించింది. దీంతో వచ్చే మూడు నుంచి ఐదేళ్లలో ఎలక్ట్రానిక్స్ తయారీ సేవల ద్వారా రూ.38,000 కోట్ల ఆదాయం సమకూరడంతో పాటు 11,000 మందికి ఉద్యోగావకాశాలు కల్పించనుంది.