స్టాక్స్‌లో పెట్టుబడి పెడుతున్నారా? అయితే 3334 శాతం లాభాలు ఇచ్చిన ఈ కంపెనీ గురించి తెలుసా?
వన్ సోర్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (గతంలో అనుగ్రహ జ్యువెలర్స్) ఐదేళ్లలో 3334 శాతం రిటర్న్స్ అందించిన మల్టీబ్యాగర్ స్టాక్. ఒకప్పుడు ఆభరణాల తయారీలో ఉన్న ఈ కంపెనీ ఇప్పుడు సేంద్రీయ, మూలికా ఉత్పత్తుల వ్యాపారంలోకి మారింది. స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులకు ఆకర్షణీయమైన ఎంపికగా నిలుస్తున్న ఈ కంపెనీ అద్భుత వృద్ధికి, దాని వ్యాపార నమూనా మార్పుకు కారణాలను ఇప్పుడు చూద్దాం..

మీరు స్టాక్ మార్కెట్‌పై అవగాహన ఉంటే, పెట్టుబడి పెట్టేవారైతే ఈ స్టాక్ గురించి కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఇది సాధారణ కంపెనీ కాదు, దాని పెట్టుబడిదారులకు అపారమైన లాభాలను అందించిన సేంద్రీయ, మూలికా ఉత్పత్తుల తయారీదారు. ఆ కంపెనీ పేరు వన్ సోర్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. ఇది గత కొన్ని సంవత్సరాలుగా మార్కెట్ పండితులు కూడా కూడా ఆశ్చర్యపోయేంత అద్భుతమైన రిటర్న్స్ అందించింది. ఈ కంపెనీ కేవలం ఐదు సంవత్సరాలలో 3334 శాతం కంటే ఎక్కువ అద్భుతమైన రాబడిని అందించింది.
నవంబర్ 10న కంపెనీ స్టాక్ ఒక్కో షేరుకు రూ.9.40 వద్ద ముగిసింది. ఇది రోజులో 4.95 శాతం తగ్గుదల. అయితే గత వారంలో ఇది 3.87 శాతం లాభపడింది. గత ఆరు నెలల్లో కంపెనీ స్టాక్ 480.25 శాతం రాబడిని ఇచ్చింది. ఒక సంవత్సరంలో దాని రాబడి 533.27 శాతానికి చేరుకుంది. ముఖ్యంగా ఐదు సంవత్సరాలలో స్టాక్ 3334 శాతం కంటే ఎక్కువ రాబడిని, ఆల్-టైమ్ హై 4814 శాతం రాబడిని ఇచ్చింది.
Groww వెబ్‌సైట్ ప్రకారం.. కంపెనీ ప్రస్తుత మార్కెట్ క్యాప్ రూ.514 కోట్లు. ఈ స్టాక్ 52 వారాల గరిష్ట స్థాయి రూ.14.92 కు చేరుకోగా, దాని 52 వారాల కనిష్ట స్థాయి రూ.1.17. కంపెనీ P/E నిష్పత్తి 247.25, P/B నిష్పత్తి 9.71, ROE (ఈక్విటీపై రాబడి) 28.03 శాతం కలిగి ఉంది. సెప్టెంబర్ 2025 నాటికి రిటైల్ పెట్టుబడిదారులు 71.02 శాతం వాటాను కలిగి ఉండగా ప్రమోటర్లు 28.98 శాతం వాటాను కలిగి ఉన్నారు.
ఆ కంపెనీ వ్యాపార నమూనా ఏమిటి?
వన్ సోర్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌ను గతంలో అనుగ్రహ జ్యువెలర్స్ లిమిటెడ్ అని పిలిచేవారు. ఈ కంపెనీని డిసెంబర్ 1994లో కోయంబత్తూరులోని కెఆర్ అండ్ సన్స్ జ్యువెలరీ ప్రమోటర్ కె.రామకృష్ణ పిళ్లై కుమారులు స్థాపించారు. ఈ కంపెనీ కోయంబత్తూరులో ఆధునిక బంగారు ఆభరణాల తయారీ ప్లాంట్, షోరూమ్‌లను స్థాపించింది. 1995లో కంపెనీ పబ్లిక్ ఇష్యూను ప్రారంభించింది, అదే సంవత్సరం జనవరిలో రిటైల్ కార్యకలాపాలను ప్రారంభించింది. ఆ తర్వాత కంపెనీ వ్యవసాయ ఉత్పత్తులు, సేంద్రీయ, మూలికా ఉత్పత్తులు, పప్పుధాన్యాలు, విత్తనాలు, సుగంధ ద్రవ్యాల వ్యాపారంలోకి తన వ్యాపారాన్ని విస్తరించింది. ప్రస్తుతం కంపెనీ దృష్టి నూనె గింజలు, మూలికా, సేంద్రీయ ఉత్పత్తులు వంటి వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారం, బ్రాండ్ ప్రమోషన్‌పై ఉంది. ఆభరణాల నుండి వ్యవసాయ వాణిజ్యం వరకు, కంపెనీ తన వ్యాపార నమూనాను పూర్తిగా మార్చివేసింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




