Bullet Train: హైదరాబాద్-ముంబై మధ్య బుల్లెట్ ట్రైన్.. ఈ ప్రాంతాల మీదుగా జర్నీ.. కేంద్రం నుంచి బిగ్ అప్డేట్..
దేశవ్యాప్తంగా ఏడు బుల్లెట్ రైలు కారిడార్లను కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో మొట్టమొదటి ప్రాజెక్ట్ అహ్మదాబాద్-ముంబై పనులు జరుగుతోండగా.. హైదరాబాద్-ముంబై ప్రాజెక్టుపై కీలక అప్డేట్ వచ్చింది. ఈ ప్రాజెక్ట్ డీపీఆర్ పనులు పూర్తయ్యాయి. దీంతో త్వరలోనే పనులను మొదలుపెట్టే అవకాశముంది.

దేశంలో బుల్లెట్ రైళ్లను వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం శరవేగంగా పనులు చేపడుతోంది. ఇప్పటికే ఏడు కారిడార్లను ప్రకటించగా.. వీటి పనులను త్వరలో ప్రారంభించేందుకు సిద్దమవుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్-ముంబై బుల్లెట్ రైలు కారిడార్‌పై కీలక అప్డేట్ వచ్చింది. దీనికి సంబంధించిన డీపీఆర్ రిపోర్ట్ పూర్తయింది. దీంతో త్వరలోనే ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. ప్రస్తుతం ముంబై-హైదరాబాద్ మధ్య రైలు ప్రయాణానికి 15 గంటల సమయం పడుతుంది. అదే బుల్లెట్ రైలు కారిడార్ పూర్తయితే మూడు గంటల్లోనే చేరుకోవచ్చని రైల్వే వర్గాలు చెబుతున్నాయి.
హైదరాబాద్-ముంబై ప్రాజెక్టుపై అప్డేట్
దాదాపు ఈ కారిడార్‌లో గంటకు 300 కిలోమీటర్ల వేగంతో హైస్పీడ్ బుల్లెట్ రైళ్లు నడుస్తాయి. 2 గంటల 55 నిమిషాల్లోనే ముంబై-హైదరాబాద్ మధ్య ప్రయాణం చేయవచ్చు. అలాగే 3 గంటల 13 నిమిషాల సమయం పటటే మల్టీ స్టాప్ ఆప్షన్ కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ కారిడార్‌కు సంబంధించి స్టేషన్లు, గరిష్ట వేగం, మార్గం వివరాల విషయానికొస్తే.. మూడు రాష్ట్రాల గుండా ఈ కారిడార్ వెళుతుంది. మహారాష్ట్రలో 457 కిలోమీటర్లు, కర్ణాటకలో 121 కిలోమీటర్లు, తెలంగాణలో 93 కిలోమీటర్ల మేర కారిడార్ విస్తరించి ఉంటుంది. మొత్తం 14 స్టేషన్లను నిర్మించనున్నారు. విక్రోలి, థానే, నవీ ముంబై, లోనావాలా, పింప్రి-చించ్వాడ్, బారామతి, పంధర్ పూర్, షోలాపూర్, కలబురగి, కోకాపేట, శంషాబాద్ స్టేషన్లు ఉంటాయి. మహారాష్ట్రలో అత్యధిక స్టేషన్లు ఉండనున్నాయి. ఇక శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో ఈ కారిడార్ నిర్వహణ కోసం పెద్ద డిపో నెలకొల్పనున్నారు.
మొట్టమొదటి కారిడార్ పనుల్లో పురోగతి
దేశంలోనే మొట్టమొదటి హైస్పీడ్ బుల్లెట్ రైలు కారిడార్ ప్రాజెక్ట్ అయితే ముంబై-అహ్మదాబాద్ పనుల్లో పురోగతి లభించింది. మహారాష్ట్రలో మూడో పర్వత సొరంగం తవ్వకం ఇటీవల పూర్తఅయింది. పాల్ఘర్ జిల్లాలోని దహను తాలూకాలోని అంబేసరి గ్రామంలో భారీ సొరంగం తవ్వకం పనులు పూర్తయ్యాయి. ఈ విషయాన్ని మంగళవారం నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రకటించింది. ఈ సొరంగం 417 మీటర్ల పొడవు, 14.4 మీటర్ల వెడల్పుతో ఉంటుంది. ఇక ఈ ప్రాజెక్టులో భాగంగా గుజరాత్‌లో 130 మీటర్ల ఉక్కు వంతెన నిర్మాణం కూడా పూర్తయింది. ఈ కారిడార్ 508 కిలోమీటర్ల మేర ఉంటుంది. 12 స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. మహారాష్ట్ర, గుజరాత్ మీదుగా ముంబై-అహ్మదాబాద్‌ను కలుపుతుంది. వచ్చే ఏడాదిలో ఈ కారిడార్‌లో బుల్లెట్ రైలును ప్రారంభించాలని కేంద్రం సన్నాహాలు చేస్తోంది. వచ్చే ఏడాది ఆగస్ట్ 15న తొలి రైలును పట్టాలెక్కించాలని చూస్తోంది. దీంతో ఈ ప్రాజెక్ట్ పనులు శరవేగంగా చేపడుతున్నారు. సొరంగం పనులన్నీ పూర్తవ్వడంతో ఈ కారిడార్ పనులు మరింత పుంజుకోనున్నాయి.
