LIC Credit Card: ఇప్పటి వరకు బీమా సేవలు అందిస్తున్న జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగంలో అడుగు పెడుతోంది. ఐడీబీఐ బ్యాంకుతో కలిసి రెండు రూపే క్రెడిట్ కార్డులను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకువస్తోంది. ఎల్ఐసీ కార్డ్స్ సర్వీసెస్ లిమిటెడ్ (ఎల్ఐసీ సీఎస్ఎల్) ఈ కార్డులను శనివారం ఆవిష్కరించింది. లుమిన్ ప్లాటినం క్రెడిట్ కార్డ్, ఎక్లాట్ సెలెక్ట్ క్రెడిట్ కార్డ్ పేరిట కస్టమర్లకు అందించనున్నారు. అయితే సభ్యుల జీవన శైలికి అనుగుణంగా క్రెడిట్ లిమిట్ అందిస్తామని ఎల్ఐసీ సీఎస్ఎల్, ఐడీబీఐ బ్యాంక్ పేర్కొన్నాయి. కస్టమర్లను ఆకర్షించడమే లక్ష్యంగా విభిన్నమైన ఆఫర్లు, ప్రయోజనాలను అందిస్తున్నాయి ఈ క్రెడిట్ కార్డులు. ఈ కార్డులతో రూ.100 వినియోగానికి ఒక బెనిఫిట్ ఆఫర్ చేస్తున్నాయి. లుమినె కార్డు దారులకు మూడు డిలైట్ పాయింట్లు, ఎక్లాట్ సెలెక్ట్ క్రెడిట్ కార్డు దారులకు నాలుగు పాయింట్లు లభించనున్నాయి.
కాగా, ఈ క్రెడిట్ కార్డులతో పాలసీ దారుల బీమా ప్రీమియం చెల్లింపులు, రెన్యూవల్ మొత్తం చెల్లింపులపై రెండు రెట్ల రివార్డు పాయింట్లు లభిస్తాయి. లుమినే కార్డుదారుడు పొందిన 60 రోజుల టైం ఫ్రేమ్‌లో రూ.10 వేలు ఖర్చు చేస్తే 1000 వెల్‌కం బోనస్ డిలైట్ పాయింట్లు పొందే అవకాశం ఉంటుంది. అదే ఎక్లాట్ కార్డు దారులు 1500 పాయింట్లు లభించనున్నాయి.
ఎల్ఐసీ క్రెడిట్ కార్డ్స్‌పై బెనిఫిట్స్ ఉండనున్నాయి. రూ.400 పై ఇంధన వినియోగ లావాదేవీలపై ఒకశాతం ఫ్యూయల్ సర్‌చార్జీ మాఫీ అవుతుంది. రూ.3000 పై చిలుకు లావాదేవీలను ఈఎంఐగా కన్వర్ట్ చేసుకుంటే ప్రాసెసింగ్ లేదా క్లోజర్ ఫీజు ఉండదు. కార్డుదారుల అవసరాలు, ప్రాధాన్యాలకు అనుగుణంగా మూడు నెలల నుంచి 12 నెలల వరకు ఈఎంఐ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఎక్లాట్ కార్డుపై జాతీయ, అంతర్జాతీయ విమానాశ్రయాల్లో కాంప్లిమెంటరీ లాంజ్ సౌకర్యం పొందే అవకాశం ఉంటుంది. రెండు కార్డులపై 48 రోజుల వరకు వడ్డీ లేకుండా లావాదేవీలు జరుపుకోవచ్చు. ఈ కార్డులు నాలుగు సంవత్సరాల పాటు పని చేస్తాయి.
ఈ కార్డులతో పలు బీమా ప్రయోజనాలు కూడా ఉన్నాయి. విమాన ప్రయాణ బీమా, వ్యక్తిగత ప్రమాద బీమా, శాశ్వత వైకల్యం, క్రెడిట్ షీల్డ్ కవర్, జీరో కార్డ్ లియబిలిటీ తదితర బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ క్రెడిట్ కార్డులు చాలా కొద్ది నిర్ధిష్ట వర్గాల ఖాతాదారుల కోసమే విడుదల చేస్తున్నట్లు ఎల్ఐసీ వెల్లడించింది. ఎల్ఐసీ పాలసీ దారులు, ఎల్ఐసీ ఏజెంట్లు, ఎల్ఐసీ ఉద్యోగులు, దాని అనుబంధ సంస్థల ఉద్యోగులకు మాత్రమే ఈ కార్డుల సేవలు పరిమితం.