Save Money: జీవనశైలి మారుతోంది. దీంతో పది వస్తువుల కోసం పది దుకాణాలు తిరిగే రోజులు పోయి ఏమి కావల్సిన మాల్స్ కు వెళ్లడం అలవాటుగా మారిపోయింది. మొదట్లో ఎక్కువ సంపాదన ఉన్న వాళ్లు మాత్రమే మాల్స్ కు వెళ్లి షాపింగ్ చేసేవారు. కాని పరిస్థితులు మారిపోయాయి. ఇదో ఫ్యాషన్ గా మారడంతో వేతన జీవులు కూడా ఇప్పుడు మాల్స్ లో షాపింగ్ కు అలవాటు పడ్డారు. దీంతో అంచనాకు మించిన షాపింగ్ తో నెల తిరగకుండానే ఆదాయం ఖర్చు అయిపోవడంతో నెల మధ్యలోనే ఆర్థిక ఇబ్బందులు పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా మాల్స్ లో ఆఫర్లకు ఆకర్షితులై మనకు ఆ సమయంలో అవసరం లేని వస్తువులను కూడా కొనుగోలు చేస్తుండటంతో డబ్బులు వృధా అవుతున్నాయి. మొదట మన బడ్జెట్ ను అంచనా వేసుకుని మాల్స్ లో షాపింగ్ కు వెళ్తే.. షాపింగ్ పూర్తై బిల్లింగ్ కౌంటర్ వద్దకు వచ్చే సరికి బిల్లు చూసి షాక్ అవ్వడం సాధారణ మనిషి వంతు అవుతుంది. దీనికి కారణం మనం ఏం కొనాలో అనే సరైన అంచనా లేకుండా వెళ్లడమే.
సాధారణంగా మన ఇంటి చుట్టుపక్కల ఉండే కిరణా దుకాణానికి వెళ్లేటప్పుడు మనకు ఏం కావాలో ఓ చీటీ రాసుకుని వెళ్లి.. దుకాణదారుడికి ఇస్తే వెంటనే వాటిని కట్టిపెట్టి.. బిల్లు వేసి ఉంచుతాడు. కాని మాల్స్ కు వెళ్లేటప్పుడు మాత్రం చాలా మంది ఈ లాజిక్ మిస్ అవుతూ ఉంటారు. కొంతమంది చీటి రాసుకుని వెళ్లినా, అక్కడ ఆఫర్లు చూసి ఆకర్షితులై మన లిస్ట్ ను పక్కన పెట్టేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కొన్ని వస్తువులపై ఇచ్చే తగ్గింపును దృష్టిలో పెట్టుకుని మాల్స్ కు ప్రజలు అలవాటుపడ్డారు. దీంతో పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఖాళీగా కనిపించవు. వీకెండ్స్ అయితే ఇక షాపింగ్ కు ఎంత సమయం పట్టిందో.. బిల్లింగ్ కు అంతే సమయం పట్టే సందర్భాలు ఉంటాయి. అయితే మాల్స్ లో షాపింగ్ సందర్భంలో చాలా మంది తమకు తెలియకుండానే డబ్బులు వృధాగా ఖర్చు పెట్టి తరువాత బాధపడతారు. అటువంటి వారు కొన్ని విషయాలపై దృష్టిపెడితే మన డబ్బు వృధా కాకుండా మనకు కావల్సిన వస్తువులనే తీసుకుని ఇంటికి రావచ్చు. అవెంటో తెలుసుకుందాం.
మనం ఏ వస్తువులు కొనుగోలు చేయడానికి వెళ్తున్నామో షాపింగ్ కు ముందు డిసైడ్ చేసుకోవాలి. ముఖ్యంగా నిత్యావసర, కిరణా వస్తువులు కొనడానికి వెళ్తున్నప్పుడు ముందుగానే లిస్ట్ తయారుచేసుకోవాలి. ఆ లిస్టు ప్రకారం మనకు కావల్సిన వస్తువులను కొనుగోలు చేస్తే మనం అనుకున్న బడ్జెట్ లో షాపింగ్ పూర్తి చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా వస్తువుపై ఉన్న ఆఫర్ మిమల్ని ఆకర్షిస్తే, ఆ వస్తువు మీకు ఎంత వరకు అవసరం, అది కొనడం ద్వారా మీకు ఆ వస్తువు ఎంత మేర ఉపయోగపడుతుందనేది డిసైడ్ చేసుకోవాలి. అలా మీలో మిమల్ని ప్రశ్నించుకోవడం ద్వారా ఆ వస్తువు నిజంగా మీకు ఉపయోగపడుతుందా, లేదా ఆఫర్ కు ఆకర్షితులై కొనుగోలు చేసి డబ్బులు వృధా చేసుకుంటున్నామా అనేది అర్థమవుతుంది.
మాల్స్ లో మనకు కావల్సిన వస్తువులకు వెళ్లడానికి ఓ పరిమితిని విధించుకోవడం మంచిది. నెలకు ఒకసారి షాపింగ్ చేయాలా, రెండు సార్లు చేయాలా అనేది ముందు డిసైడ్ అవ్వాలి. డబ్బులు ఉంటే ఎప్పుడైనా షాపింగ్ కు వెళ్లవచ్చు. అయితే వేతన జీవులు, నెల జీతంపై ఆధారపడి జీవించేవారు ఎక్కువుగా షాపింగ్ లకు అలవాటుపడటం ద్వారా డబ్బులు ఎక్కువుగా వృధా అయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్రతి వారం మాల్స్ లోకి ఏదో ఒక కొత్త ప్రొడక్ట్ వస్తూనే ఉంటుంది. ఆ ఉత్పత్తులు మనల్ని ఆకర్షించవచ్చు. మనకు అది కొనాలనే ఆలోచన లేకపోయినా మనం ఆవస్తువును కొనాలనే ఆలోచన తరచూ షాపింగ్ లకు వెళ్లడం ద్వారా రావచ్చు. అందుకే షాపింగ్ కు పరిమితి విధించుకోవడం మంచిది. ఏదైనా మధ్యలో ముఖ్యమైన సామాగ్రి అవసరం అయితే స్థానికంగా మన చుట్టుపక్కల ఉండే దుకాణాలకు వెళ్లి కొనుక్కోవడం ఉత్తమం.
ముఖ్యంగా వేతన జీవులు షాపింగ్ మాల్స్ కు అలవాటు పడిందే అక్కడ ఇచ్చే డిస్కౌంట్లు చూసి, బయట కిరాణా దుకాణంతో పోలిస్తే కిలోకు రెండు నుంచి ఐదు రూపాయల వరకు తగ్గింపు ఉండొచ్చు పరిస్థితులను బట్టి. అయితే అదే సందర్భంలో నాణ్యతను చూసుకోవల్సి ఉంటుంది. మాల్స్ లో లభించే ధరలతో పాటు నాణ్యతను కూడా చెక్ చేసుకోవల్సి ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో మనం చేసే షాపింగ్ మీద మాల్స్ కు, కిరణా దుకాణానికి రేట్లలో ఎంత మేర తేడా ఉందనేది గమనించుకోండి. ఇంటి నుంచి షాపింగ్ మాల్ కు వెళ్లేందుకు సొంత వాహనం లేదా ఆటో, రిక్షాలో వెళ్తాం. అప్పుడు దానికయ్యే ఖర్చుతో పాటు ఎంత సమయం వెచ్చించాం అనేది పరిగణలోకి తీసుకోవాలి. అలా పోల్చిచూస్తే మన డబ్బులు సేవ్ అవుతున్నాయా, వృధా అవుతున్నాయా అనే అంచనా వస్తుంది. మాల్స్ లో షాపింగ్ చేసేటప్పుడు ఆఫర్లకు ఆకర్షితులు కాకుండా మనకు కావల్సిన వస్తువులను మనం ఎంపిక చేసుకుంటే షాపింగ్ సమయంలో డబ్బులు వృధా కాకుండా జాగ్రత్త పడవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం చూడండి..