దీర్ఘకాలిక అవసరాల కోసం చాలా మంది పొదుపు మార్గాన్ని ఎంచుకుంటారు. మన డబ్బులు భద్రంగా ఉండే ఎన్నో పథకాలు బ్యాంకులు, పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా సేవింగ్స్ చేసే వ్యక్తులు ఎక్కువ ఆలోచించేది మాత్రం వడ్డీ గురించే.. ఏ పథకంలో ఎక్కువ వడ్డీ వస్తుంది.. ఏందులో అయితే డబ్బు సేఫ్‌గా ఉంటుందనే విషయంపై ప్రత్యేక దృష్టిసారిస్తారు. తాజాగా రెపో రేటును 35 బేసిస్ పాయింట్ల మేర పెంచాలని భారతీయ రిజర్వు బ్యాంకు- ఆర్‌బిఐ తీసుకున్న నిర్ణయం తర్వాత.. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పిపిఎఫ్), సుకన్య సమృద్ధి స్కీమ్, సీనియర్ సిటిజన్లకు సంబంధించిన ఫిక్స్‌డ్ డిపాజిట్లు, నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్లు (ఎన్‌ఎస్‌సి), కిసాన్ వికాస్ పత్ర వంటి వాటిపై వడ్డీ రేట్లు వచ్చే నెలలో పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా తపాలా శాఖ ద్వారా అందిస్తున్న 12 పొదుపు పథకాలకు వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ జనవరి-మార్చి త్రైమాసికంలో వడ్డీ రేట్లపై సమీక్షను వచ్చే నెల (జనవరి) ప్రారంభంలో నిర్వహించనుంది. ఆ సమయంలో చిన్న పొదుపు పథకాల రేట్లను పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాలపై సీనియర్ సిటిజన్లకు అధిక వడ్డీలు చెల్లిస్తుండగా.. చిన్న పొదుపు పథకాలపై వచ్చే నెలలో ఇంటరెస్ట్ రేట్లు పెరిగే సూచనలు మెండుగా ఉన్నట్లు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీన, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్, కిసాన్ వికాస్ పత్ర (కెవిపి), నెలవారీ ఆదాయ ఖాతా పథకం, నిర్ణీత కాల వ్యవధికి సంబంధించిన డిపాజిట్లపై ప్రభుత్వం వడ్డీ రేట్లను పెంచింది. ఇదే సమయంలో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పిపిఎఫ్), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (ఎన్‌ఎస్‌సి), సుకన్య సమృద్ధి యోజన వంటి ఇతర చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు యథాతథంగా కొనసాగిస్తూ వచ్చింది. ఈ క్రమంలో పోస్టాఫీసు ద్వారా ఆఫర్ చేస్తున్న కొన్ని పొదుపు పథకాలపై ప్రభుత్వం వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందని ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు.
ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాల్లో ఒక సంవత్సరం, ఐదేళ్లు ఫిక్స్‌డ్ డిపాజిట్, ఐదేళ్ల రికరింగ్ డిపాజిట్ పథకం, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పథకం, సుకన్య సమృద్ధి పథకాలకు వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉంది. డిసెంబర్ 7వ తేదీన, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలకమైన రెపో రేటును 35 బేసిస్ పాయింట్లు పెంచి 6.25 శాతానికి పెంచింది. ఈ ఏడాది మే నుంచి పరిశీలిస్తూ ఐదో సారి రెపో రేట్లను పెంచింది. ఆర్‌బీఐ కీలక వడ్డీ రేటును 35 బేసిస్ పాయింట్లు పెంచడంతో పలు బ్యాంకులు సైతం కొన్ని పథకాలపై వడ్డీ రేట్లను పెంచే అవకాశాలున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం చూడండి..